టిఆర్ ఎస్‌లో స్వామిగౌడ్ ప్రకంపనలు
ఉద్యమ సమయంలో హేళన చేసిన వారికి సర్కార్‌లో మంచి గుర్తింపు... కొంతకాలంగా కెసిఆర్, కెటిఆర్‌లు అపాయింట్‌మెంట్ ఇవ్వడంలేదని ఆరోపణ

హైదరాబాద్ : అధికార టీఆర్‌ఎస్ పార్టీపై శాసన మండలి మాజీ చైర్మన్ స్వామిగౌడ్ వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఈ మధ్యకాలంలో ఆయన చేసిన వ్యాఖ్యలు రాజకీయవర్గాల్లో తీవ్ర చర్చకు దారి తీసింది. ఆయన ఆదివారం ఒక టీవీ చానల్ తో మాట్లాడుతూ.. పార్టీ అధిష్టానంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. పార్టీలో ఉద్యమకారులను కలుపుకుని పోవడంలేదని ఆగ్రహం చెందారు. తెలంగాణ ఉద్యమ సమయంలో తమను చూసి హేళన చేసిన వారికి నేడు ప్రభుత్వంలో మంచి గుర్తింపు లభించిందని ఆరోపణలు చేశారు. గతకొంత కాలంగా ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ అపాయింట్‌మెంట్ అడిగా ఇవ్వడంలేదని వాపోయారు. కాగా ఆయనకు ప్రస్తుతం పార్టీ మారే ఆలోచన లేదని తేల్చి చెప్పారు. కాగా ఆయన కొంత కాలంగా పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్నారు. ఈ మధ్య ఆయన టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, మల్కాజిగిరి ఎంపీ రేవంత్‌రెడ్డిపై ప్రశంసలు కురిపించడం కూడా టిఆర్ ఎస్ పార్టీ అధిష్టానానికి ఇబ్బందిగా మారింది. చూడాలి చివరకు స్వామిగౌడ్ వ్యవహారం ఎక్కడకు దారితీస్తదో..