తెలంగాణలో డిగ్రీ, పీజీ పరీక్షలు వాయిదా

హైదరాబాద్: తెలంగాణలో డిగ్రీ, పిజి పరీక్షలు వాయిదా పడ్డాయి. రాష్ట్రంలో కరోనా కేసులు పెరగుతున్న దృష్ట్యా అన్ని యూనివర్సిటీల పరిధిలో ప్రస్తుతం జరుగుతున్న సెమిస్టర్ పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ పాపిరెడ్డి వెల్లడించారు. ఈ మేరకు అన్ని వర్సిటీలకు ఆదేశాలు జారీ చేశారు.
కరోనా నేపథ్యంలో విద్యార్థులకు ఇబ్బంది కాకుండా ఉండేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. పరీక్షల కొత్త షెడ్యూల్ ను త్వరలో ప్రకటిస్తామని ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొ పాపిరెడ్డి ప్రకటించారు కరోనా నేపథ్యంలో నేటి నుంచి అన్ని విద్యా సంస్థలను మూసి వేస్తున్నట్లుగా నిన్న విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అసెంబ్లీలో ప్రకటించారు. తల్లిదండ్రులు ఆందోళనలో ఉన్నారు కాబట్టి స్కూల్స్ మూసి వేయాలని కోరుతున్నారని అందుకే రాష్ట్రంలో కరోనా వ్యాధి అరికట్టడం కోసం రేపటి నుంచి స్కూల్స్ మూసివేస్తున్నామని ప్రకటించారు. వీటికి అనుబంధంగా ఉన్న అన్ని హాస్టల్స్ కూడా మూసివేస్తున్నట్టు ప్రకటించారు. గతంలో మాదిరిగానే ఆన్లైన్ క్లాస్ లు ఉంటాయని ప్రజలు సహకరించాలని మంత్రి కోరారు.
అయితే ప్రస్తుతం జరుగుతున్న పరీక్షలు యథాతథంగా కొనసాగుతాయని ఆయా వర్సిటీలు నిన్న ప్రకటించాయి. ఈ నేపథ్యంలో సమీక్ష నిర్వహించిన ఉన్నత విద్యామండలి.. సెమిస్టర్ పరీక్షలను వాయిదా వేయాలని యూనివర్సిటీలకు సూచించింది.