మహారాష్ట్ర, పంజాబ్‌లలో పరిస్థితి ఆందోళనకరం: కేంద్రం

న్యూఢిల్లీ: దేశంలో కరోనా కేసులు రోజురోజుకి పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా మహారాష్ట్ర, పంజాబ్‌లలో పెరిగిపోతున్న కరోనా కేసులు ఆందోళన కలిగిస్తున్నాయని కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేష్ భూషణ్ అన్నారు. గత 24 గంటలలోనే మహారాష్ట్రలో 28 వేల కేసులు నమోదైనట్లు ఆయన చెప్పారు. అటు పంజాబ్ జనాభా లెక్కల ప్రకారం చూసుకుంటే అక్కడి కేసులు చాలా ఎక్కువ అని భూషణ్ అన్నారు. దేశంలో పది జిల్లాల్లో పరిస్థితి ఆందోళనకరంగా ఉందని తెలిపారు. ఈ పది జిల్లలో 9 మహారాష్ట్రకే చెందినవి కావడం గమనార్హం. పుణె, నాగపూర్, ముంబై, థానె, నాసిక్, ఔరంగాబాద్, నాందేడ్, జల్‌గావ్, అకోలాలతోపాటు కర్ణాటకలోని బెంగళూరు అర్బన్ జిల్లాల్లో కేసులు చాలా ఎక్కువగా ఉన్నట్లు ఆయన వెల్లడించారు.