Ramadan: నిష్ఠానిగ్రహాల సమగ్ర రూపం `రోజా`
Special Article: శుక్రవారం ముస్లిం సోదర సోదరిమణులకు ప్రత్యేకం...

1. ఉపవాసం మహత్తును, దాని పుణ్యఫలాన్ని, దాని మహోన్నతమైన లాభాల్ని దృష్టిలో ఉంచుకొని శ్రద్ధతో, నిష్ఠగా ఉపవాసం పాటించాలి. ఈ ఉత్తమమైన ఆరాధనకు ఇతర ఏ ఆరాధన సమానం కాజాలదు. ఈ కారణం చేతనే ప్రతి ముస్లిం సమాజానికి (ఉమ్మత్ కు) ఉపవాసం విధిగా నిర్ణయించబడినది. దైవాజ్ఞ ఏమంటే..:
“విశ్వాసులరా! పూర్వం ప్రజలకు ఉపవాసం ఎలా విధించబడిందో అలాగే మీకు విధించబడింది. తన్మూలంగా మీరు దైవాభీతి కలవారుగా ధర్మపరాయణులుగా రూపొందలని”
ప్రవక్త (,సఆసం) ఈ ఉపవాసం ఉన్నత లక్ష్యాన్ని ఇలా వివరించారు.
“ఉపవాసం పాటించి అబద్దం పలికి,అబద్దాన్ని ఆచరించిన వ్యక్తి ఆకలిదప్పులతో పడి ఉండటం దేవునికి ఏ మాత్రం ఇష్టం లేదు”(బుఖారీ)
ఆయన (,సఆసం) ఇంకా ఇలా అన్నారు: “ఏ వ్యక్తి అయితే సంపూర్ణ విశ్వాసంతో, ఆత్మ విమర్శతో రంజాన్ ఉపవాసం పాటిస్తాడో పూర్వం అతడు చేసిన పాపాలను దేవుడు క్షమిస్తాడు”(బూఖారి)
2. రంజాన్ ఉపవాసాలు పూర్తి నిష్ఠతో పాటించాలి. తీవ్రంగా జబ్బు కానీ, లేదా షరియత్ ప్రకారం అనుమతిగాని లేకపోతే ఉపవాసం పాటించటం మానుకోరాదు.
ప్రవక్త (సఆసం) అన్నారు – ఒక వ్యక్తి జబ్బుగాని,షరీయత అనుజ్ఞ కానీ లేకుండా రంజాన్ లో ఒక్క ఉపవాసం అయినా వదిలి వేస్తే,అతను జీవితాంతం ఉపవాసాలు పాటించినా అవి ఆ ఒక్క ఉపవాసం లోపాన్ని పూర్తిచేయజాలవు.(తిర్మిజీ)
3. ఉపవాసం పాటించే సమయంలో ప్రదర్శన బుద్దినుండి తప్పించు కోవడానికి ఎప్పటిలాగే ఉత్సాహంగా, చురుకుగా, తమ పనుల్లో నిమగ్నులై ఉండాలి. ప్రవర్తన ద్వారా, ఉపవాసం వల్ల కలిగే బలహీనతను, నీరసాన్ని ప్రదర్శించరాదు.
హజ్రత్ అబూ హురైరా (రజీ) అన్నారు, “మనిషి ఉపవాసమున్నపుడు ఎప్పటివలె తలకు నూనె రాసుకోవాలి. అలా చేయడం వలన ఉపవాస ఫలితంగా ఏర్పడే ప్రభావాలు కనబడవు.
4. ఉపవాసమున్నపుడు అత్యంత నిష్ఠతో ప్రతి చెడు నుండి దూరంగా ఉండటానికి ప్రయత్నం చేయాలి. ఎందుకంటే పూర్తి జీవితాన్ని పరిశుద్ధం.పవిత్రం చేయడమే ఉపవాస లక్ష్యం.
ప్రవక్త (సఆసం) ఇలా అన్నారు. ఉపవాసం ఒక డాలు లాంటిది. మీరు ఉపవాసం ఉన్నప్పుడు లజ్జవిహీనమైన మాటలు పలుకరాదు. అల్లరి, గందరగోళాలు సృష్టించకూడదు. ఒకవేళ ఎవరైనా తిడితే లేదా పొట్లాడితే – నేను ఉపవాసములో ఉన్నాను, చెడు ఎలా బదులివ్వగలను ఎలా పొట్లాడగలను అని ఆలోచించాలి. (బుఖారి, ముస్లిమ్)
5. ప్రవక్త (సఆసం) ప్రవచనాల్లో ఈవిధంగా ఉంది. “ఉపవాసానికి ఏ మహత్తర పుణ్యఫలం ప్రకటించబడిందో దాన్ని మనసారా కోరుకోండి“ ముఖ్యంగా ఇఫ్తార్ సమయంలో దేవుణ్ణి ఇలా వేడుకోవాలి.“ దేవా! నా ఉపవాసాన్ని స్వీకరించు, నీవు పుణ్యఫలాన్ని ప్రసాదిస్తానని సెలవిచ్చావో దాన్ని నాకు ప్రసాదించు”
ప్రవక్త (సఆసం) అన్నారు- “ఉపవాసకులు స్వర్గంలో ఒక ప్రత్యేకమైన ద్వారం గుండా ప్రవేశిస్తారు. ఆ ద్వారం పేరు “రయ్యాన్”. ఉపవాసకులు ప్రవేశించిన తరువాత ఆ ద్వారం మూసివేయబడుతుంది. మరెవ్వరూ ఆ ద్వారం గుండా వెళ్లజాలరు“ (బుఖారి)
ఆయన ఇంకా ఇలా అన్నారు.”ఉపవాసము పాటించేవాని ఎడల ఆ ఉపవాసము తుదిదినాన ఇలా సిఫారసు చేస్తుంది.
దేవా! దినమంతా ఈ వ్యక్తి అన్న పానీయాలకు, ఇతర రుచులకు దూరంగా వున్నాడు. దేవ! ఈ వ్యక్తి విషయంలో నా సిఫారసు ను స్వీకరించు” దేవుడు కూడా దాని సిఫారాసు ను స్వీకరిస్తాడు.. (,మిష్కాత్)
ప్రవక్త (సఆసం) ఇలా కూడా అన్నారు. “ఇఫ్తార్ సమయంలో ఉపవాసకుడు ఏ అర్ధింపు చేసినా స్వీకరించబడుతుంది. తిరస్కరించబడదు. (తిర్మజి)
6. ఉపవాసంవల్ల కలిగే ఇబ్బందుల్ని సంతోషంగా భరించాలి. ఆకలిదప్పుల తీవ్రతను, బలహీనతను ఇతరులతో చెప్తూ ఉపవాసాన్ని అగౌరవపరచరాదు.
7. ప్రయాణంలో ఉన్నపుడు లేక జబ్బు తీవ్రంగా ఉన్నపుడు ఉపవాసం వుండలేకపోతే వదిలివేయవచ్చును. వేరే రోజుల్లో వాటి “ఖాజా”పూర్తి చేయాలి. ఖురాన్లో ఉంది.
జబ్బు ఉన్న లేక ప్రయాణం చేస్తున్నా వారు ఇతర దినాల్లో ఉపవాసాలు పూర్తి చేయాలి.
హజ్రత్ అనస్, (రజి) ఉల్లేఖించారు. “మేము ప్రవక్త (సఆసం)తో రంజాన్ లో ప్రయాణం చేస్తున్నపుడు కొందరు ఉపవాసం ఉండేవారు. మరికొందరు ఉండేవారు కాదు. అయితే ఉపవాసం ఉన్నవారు లేనివారిని, విమర్శించేవారు కాదు. ఉపవాసం లేనివారు కూడా ఉన్నవారిని విమర్శించేవారు కాదు. (బుఖారి)
8. ఉపవాసాలు ఉన్నపుడు చాడీలు చెప్పటం, చెడు చూపు చూడడం లాంటి వాటికి దూరంగా ఉండటానికి సరైన జాగ్రత్తలు పాటించాలి.
ప్రవక్త (సఆసం) అన్నారు,ఉపవాసకుడు చాడీలు చెప్పకుండా ఉంటే ఉదయం నుండి సాయంత్రం వరకు దైవారాధనలో ఉన్నట్టే.. అతను ఎవరి మీదనైనా చాడీలు చెప్పినపుడు వెంటనే అతని ఉపవాసంలో పగలు ఏర్పడుతుంది.
9. ధర్మంగా ఉపాధిని సంపాదించాలి. అక్రమ మార్గంలో సంపాదించిన సొమ్ముతో పోషించబడే శరీరం చేసే ఏ ఆరాధన కూడా స్వీకరించబడదు.
ప్రవక్త (సఆసం ) అన్నారు-” అధర్మంగా సంపాదించిన ధనంతో పెరిగిన శరీరం నరకానికి తగు”(బుఖారి)
10. సహ్రీ. తప్పకుండా భుజించాలి.అందువల్ల ఉపవాసం సులభసాధ్యమౌతుంది. బలహీనత, నీరసం, కలగదు.
ప్రవక్త (సఆసం) అన్నారు.సహరి భుజించండి.ఎందుకంటే అందులో ఎంతో శుభం ఉంది(బుఖారి)
ప్రవక్త (సఆసం) ఇంకా ఇలా అన్నారు.సహరి భుజించటంలో ఎంతో శుభముంది. ఏమి లేకపోతే కొన్ని మంచి నీళ్ళయిన త్రాగండి. దైవదూతలు సహరి భుజించేవారికి “సలామ్”అందజేస్తారు. (అహ్మద్)
ప్రవక్త (సఆసం) ఇంకా ఇలా అన్నారు. మధ్యాహ్నం వేళలో కొంచెం విశ్రాంతి తీసుకొని తద్వారా రాత్రి జాగరణ చేసేటపుడు సౌలభ్యాన్ని పొందండి. సహరి భుజించి, తద్వారా పగలు ఉపవాసం పాటించడానికి శక్తిని సంపాదించండి.(ఇబ్నెమాజ)
సహి ముస్లిం లో ఉంది- “మనకు గ్రంధం కలవారికి ఉపవాసల్లో ఉన్న భేదం సహరి భుజించటంలోనే ఉంది”అను ప్రవక్త (సఆసం)అన్నారు.
11. సూర్యుడు అస్తమించిన తరువాత ఇఫ్తార్ చేయటంలో జాప్యం చేయకండి- ఎందుకంటే విధేయత భావాన్ని జనింపచేసేందుకు ఉపవాసం అసలు ఉద్దేశించబడింది. అంతేకాని ఆకలిదప్పులతో ఉంచటం ఉద్దేశం కాదు.
ప్రవక్త (సఆసం) ప్రవచనం -“ఇఫ్తార్ త్వరగా చేస్తునంతకాలం ముస్లింలు మంచి పరిస్థితిలో వుంటారు.”(బుఖారి)
12. ఇఫ్తార్ సమయంలో ఈ దుఆ చేయాలి.
“అల్లాహుమ్మ లకసుమ్తు వ అలా రిజ్ ఖిక అఫ్తర్ తు.”(ముస్లిమ్)
దేవా! నేను నీకోసమే ఈ రోజాను పాటించాను, నీవు ప్రసాదించిన దాని ద్వారా విరమిస్తున్నాను”
ఇఫ్తార్ చేసిన తరువాత ఈ దుఆ చదవాలి.
జహబజ్ జమ్ఆ వబ్తల్ల తిల్ ఊరూఖు వసబతల్ అజ్ రు ఇన్షాఅల్లాహ్ (అబూదావూద్)
‘దాహం తీరింది. నరాలకు సత్తువ చేకూరింది. దైవం తలిస్తే ప్రతిఫలం కూడా లభిస్తుంది.
13. ఎవరి ఇంట్లోనైనా ఇఫ్తార్ చేసినట్లయితే ఈ దుఆ ని పాటించాలి.
“ఆఫ్తర ఇన్ధకుముస్సాయిమూన వ అకల తా “ముకుముల్” అబ్ రారు వ సల్లత్ అలైకుముల్ మలాయిక(అబూదావూద్)
మీ ఇంట్లో రోజా పాటించేవారు విరివిగా ఇఫ్తార్ చేయుగాక .దైవదూతలు మీకు కారుణ్యం ప్రసాదించేందుకు దుఆ చేయుగాక”.
14. ఇతరులకు ఇఫ్తార్ చేయించే ఏర్పాటుకుడా చేయాలి. దానికి గొప్ప పుణ్యఫలముంది. మహాప్రవక్త ముహమ్మద్ (సఆసం) ఇలా అన్నారు. -ఏ వ్యక్తి అయితే రంజాన్లో ఒకరికి ఇఫ్తార్ చేయిస్తాడో దేవుడు అతని పాపాల్ని క్షమిస్తాడు. అతన్ని నరకాగ్ని నుండి రక్షిస్తాడు. ఇఫ్తార్ చేయించిన వ్యక్తికి ఉపవాసం ఉన్న వ్యక్తీకి సమానంగా పుణ్యం ప్రాప్తిస్తుంది. ఉపవాసం ఉండే వ్యక్తి పుణ్యంలో ఎలాంటి తగ్గుదల ఉండదు. -ప్రజలు అడిగారు, దైవ ప్రవక్త !ఉపవాసకులకు ఇఫ్తార్ చేయించి భోజనం పెట్టిచేటంత సొమ్ము మాలో అందరి వద్ద ఎక్కడుంది?
కేవలం ఒక ఖార్జుర ఫలంతో లేక గ్రుక్కెడు పాలతో, కనీసం నీళ్లతోనైనా ఇఫ్తార్ చేయిస్తే చాలు”అని మహాప్రవక్త (సఆసం) జవాబిచ్చారు. (ఇబ్నె ఖాజీమా)
–షేక్.బహర్ అలీ