ఇంత జరుగుతుంటే.. ప్రేక్షకపాత్ర పోషించలేం!: సుప్రీంకోర్టు

న్యూఢిల్లీ (CLiC2NEWS): కరోనా మహమ్మారితో దేశం మొత్తం సంక్షోభం ఎదుర్కొంటున్న వేళ ప్రేక్షకుడిగా ఉండలేమని భారత సర్వోన్నత న్యాయస్థానం అభిప్రాయపడింది. కొవిడ్ విలయంతో ఆయా రాష్ట్రాల్లో నెలకొన్న పరిస్థితులను అక్కడి హైకోర్టులు పర్యవేక్షిస్తున్నప్పటికీ సంక్షోభ సమయంలో తాము స్పందించకుండా ఉండలేమని తెలిపింది. రాష్ట్రాల మధ్య జరుగుతున్న సహకారాలను సమన్వయ పరచడంలో తమ పాత్ర ఉంటుందని ధర్మాసనం పేర్కొంది. కరోనా మహమ్మారి వల్ల దేశం ఎదుర్కొంటున్న సమస్యలను సుమోటోగా స్వీకరించిన ప్రీంకోర్టు ధర్మాసనం మంగళవారం మరోసారి విచారణ చేపట్టింది.
ఇప్పటికే హైకోర్టుల్లో కరోనా అంశాలపై జరుగుతున్న విచారణను ఆపే ఉద్దేశం తమకు లేదని ధర్మాసనం స్పష్టం చేసింది. ఈ విషయంలో హైకోర్టులు మెరుగుగానే పనిచేస్తున్నాయని.. ఆర్టికల్ 226 ప్రకారం, హైకోర్టులు తమ అధికారాలను వినియోగించకుండా తాము నిరోధించడం లేదని జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ ఎల్ఎన్ రావ్, జస్టిస్ రవీంద్ర భట్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం స్పష్టం చేసింది. వారు పరిశీలించలేని సమస్యలపై మాత్రమే సహాయం చేసే పాత్రను తాము పోషిస్తామని అభిప్రాయపడింది.
రాష్ట్రాల మధ్య సమన్వయం కోసం తాము ప్రయత్నిస్తామని సుప్రీం తెలిపింది. గత వారం ఈ కేసును సుమోటాగా స్వీకరించిన సుప్రీంకోర్టు.. కొవిడ్‌పై జాతీయ ప్రణాళికను సమర్పించాల్సిందిగా కేంద్రాన్ని ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ మేరకు కేంద్రం తమ ప్రణాళికను కోర్టుకు సమర్పించింది. దానిని పరిశీలించిన తర్వాత శుక్రవారం మరోసారి దీనిపై విచారణ జరపనుంది.
మంగళవారం విచారణ సందర్భంగా రెండు అంశాలపై కేంద్రం నుంచి సుప్రీం ధర్మాసనం స్పష్టత కోరింది. కొవిడ్ సంక్షోభ నివారణలో భాగంగా ఆర్మీ వంటి కేంద్ర వనరులను వినియోగించడం, వ్యాక్సిన్ల ధరలపై స్పష్టత ఇవ్వాలని ధర్మాసనం కేంద్రాన్ని అడిగింది. కేంద్రానికి, రాష్ట్రాలకు వేర్వేరు ధరలకు వ్యాక్సిన్లు ఇవ్వడమేంటని ఈ సందర్భంగా నిలదీసింది. నేషనల్ ఎమర్జెన్సీ సమయంలో దీనిపై కేంద్రానికే పూర్తి నియంత్రణ ఉండాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.