TamilNadu: సిఎంగా స్టాలిన్ ప్రమాణస్వీకారం

చెన్నై(CLiC2NEWS): తమిళనాడు 14వ ముఖ్యమంత్రిగా ముత్తువేళ్ కరుణానిధి స్టాలిన్ శుక్రవారం ప్రమాణస్వీకారం చేశారు. ఆయన సిఎం పదవిని అధిరోహించడం ఇదే తొలిసారి. రాజభవన్లో స్టాలిన్ చేత గవర్నర్ బనర్విలాల్ పురోహిత్ ప్రమాణం చేయించారు. కోవిడ్ నేపథ్యంలో అత్యంత నిరాబరంబరంగా కొద్దీ మంది అతిథుల సమక్షంలో ఈ కార్యక్రమం సాగింది. ఆయనతో పాటు మరో 33 మంది క్యాబినేట్ మంత్రులు కూడా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి ఆయన భార్య దుర్గ, కుమారుడు, చెపాక్ నియోజకవర్గ నూతన ఎమ్మెల్యే ఉదయ్ నిధి స్టాలిన్, సోదరి, లోక్సభ ఎంపి కణిమొళి కూడా హాజరయ్యారు. స్టాలిన్ ప్రమాణస్వీకారం చేస్తున్న సమయంలో ఆయన భార్య ఉద్వేగానికి లోనయ్యారు.
ఇంకా ఈ ప్రమాణ స్వీకారం కార్యక్రమానికి పలువురు రాజకీయ నాయకులు, ప్రముఖులు హాజరయ్యారు. మక్కల్ నీథి మయ్యం అధినేత కమల్ హాసన్, డీఎంకేకు చెందిన ఎమ్మెల్యేలు, కొందరు కీలక నాయకులు పాల్గొన్నారు.
ఇటీవల జరిగిన తమిళనాడు శాసనసభ ఎన్నికల్లో డిఎంకె ఘన విజయం సాధించింది. 234 స్థానాలకు గాను 133 చోట్ల జయకేతనం ఎగురవేసింది. అన్నాడిఎంకె 66, కాంగ్రెస్ 18, పిఎంకె 5, బిజెపి 4 స్థానాలకే పరిమితమయ్యాయి.