Corona: పాజిటివ్ రిపోర్ట్ లేకున్నా.. ఆసుప‌త్రిలో అడ్మిష‌న్‌

న్యూఢిల్లీ (CLiC2NEWS): దేశంలో క‌రోనా సెకండ్ వేవ్ విజృంభిస్తున్న వేళ వైర‌స్ బాధితుల‌కు కేంద్రం కాస్త ఉప‌శ‌మ‌నం క‌ల్పించింది. కొవిడ్ రోగులు ఆసుప‌త్రుల్లో చేరేందుకు పాజిటివ్ నిర్ధార‌ణ రిపోర్ట్ త‌ప్ప‌నిస‌రి కాద‌ని వెల్ల‌డించింది. రోగుల‌ను ఆసుప‌త్రిలో చేర్చుకోక‌పోవ‌డం వంటి సంఘ‌ట‌న‌లు జ‌రుగుతున్న నేప‌థ్యంలో ఆసుప‌త్రిలో రోగుల అడ్మిష‌న్ నిబంధ‌న‌ల‌ను శ‌నివారం స‌డ‌లించింది. క‌రోనా సెకండ్ వేవ్‌తో దేశం పోరాడుతున్న ఈ క్లిష్ట స‌మ‌యంలో ఏ రోగిని కూడా ఆసుప‌త్రిలో చేర్చుకునేందుకు నిరాక‌రించ‌కూడ‌ద‌ని పేర్కొంది. రోగి మ‌రో ప్రాంతానికి చెందిన‌ప్ప‌టికీ ఆసుప‌త్రిలో అడ్మిట్ చేసుకోవాల‌ని, ఆక్సిజ‌న్‌, అవ‌స‌ర‌మైన మందుల‌తో వైద్య చికిత్స అందించాల‌ని సూచించింది.

కొత్త మార్గ‌ద‌ర్శ‌కాలు

  • ఒక‌వేళ రోగికి క‌రోనా సోకి ఉంటుంద‌ని అనుమానంగా ఉంటే క‌రోనా వార్డు, లేదా కేంద్రంలో ఉంచి వైద్య చికిత్స అందించాలి
  • ఆ ప్రాంతానికి చెందిన వ్య‌క్తి కాక‌పోతే ధ్రువీక‌ర‌ణ కోసం డిమాండ్ చేయ‌కూడ‌ద‌ని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది.
  • ఆసుపత్రిలో ప్రవేశాలు తప్పనిసరిగా అవసరాన్ని బట్టి ఉండాలి. ఆసుపత్రిలో చేరాల్సిన అవసరం లేని వ్యక్తులతో పడకలు ఆక్రమించకుండా చూసుకోవాలి.
  • క‌రోనాతో బాధపడుతున్న రోగులకు సత్వర, సమర్థవంతమైన, సమగ్ర చికిత్సను అందించే ల‌క్ష్యంగా ఆసుప‌త్రులు ప‌నిచేయాలి.

ఈ కొత్త మార్గ‌ద‌ర్శ‌కాల‌పై అన్ని ప్రభుత్వ ఆసుప‌త్రుల‌తోపాటు ప్రైవేటు ఆసుపత్రులకు వర్తిస్తాయని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ‌ వెల్ల‌డించింది. వీటిని మూడు రోజుల్లో అమ‌లు చేసేలా అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ముఖ్య కార్య‌ద‌ర్శులు ఆ మేర‌కు ఆదేశాలు, ఉత్త‌ర్వులు జారీ చేయాల‌ని సూచించింది.

Leave A Reply

Your email address will not be published.