Oxygen Concentrator: ఢిల్లీలో హోం డెలివరీ
కేజ్రీవాల్ సర్కార్ కీలక నిర్ణయం

న్యూఢిల్లీ (CLiC2NEWS): ఢిల్లీలో ఆక్సిజన్ కాన్సంట్రేటర్స్ బ్యాంకును మే 15 నుండి ప్రారంభించినట్లు ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ శనివారం ప్రకటించారు. ఆక్సిజన్ కొరతను తట్టుకొని నిలిచేందుకు కేంద్ర పాలిత ప్రాంతంలోని ప్రతి జిల్లాలో ఆక్సిజన్ కాన్సంట్రేటర్ బ్యాంకులను ఏర్పాటు చేస్తున్నట్లు సిఎం అరవింద్ కేజ్రీవాల్ వెల్లడించారు.
“ శనివారం నుండి ముఖ్యమైన సర్వీస్‌ను ప్రారంభించారు. అవే ఆక్సిజన్ కాన్సంట్రేటర్స్ బ్యాంక్స్. ప్రతి జిల్లాలో, 200 ఆక్సిజన్ కాన్సంట్రేటర్స్‌ను ఉంచుతాం. మెడికల్ ఆక్సిజన్ అందుబాటు లేక కోవిడ్ రోగులు ఐసియులో చేరాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కొన్ని సార్లు చనిపోతున్నారు కూడా. ఈ అవాంతరాలను తొలగించేందుకు ఈ బ్యాంకులను ఏర్పాటు చేశాం“ అని తెలిపారు.
అదేవిధంగా ఇంట్లో చికిత్స పొందుతున్న వారికి దీన్ని హోం డెలివరి చేస్తామని, ఎలా వినియోగించాలో బృందంలోని సభ్యుడు చెబుతారని తెలిపారు. అదేవిధంగా వైద్యులు సైతం రోగులతో టచ్‌లోనే ఉంటారని, ఒక వేళ ఆసుపత్రిలో చేరాల్సి ఉంటే…సకాలంలో చర్యలు తీసుకుంటారని తెలిపారు. దీనికి సంబంధించిన హెల్ప్‌లైన్ నంబర్ -1031కు డయల్ చేయవచ్చునని తెలిపారు
కేజ్రీవాల్ మాట్లాడుతూ.. `నిన్నటితో పోల్చితే కొత్తకేసులు మరింత తగ్గాయి. ప్రస్తుతం 6,500 మందికి పాజిటివ్‌గా తేలింది. పాజిటివిటి రేటు 11 శాతానికి తగ్గింది. ఢిల్లీలో మరోసారి కరోనా విజృంభించదని ఆశిస్తున్నాం. అందుకు తగ్గట్టుగా ఏర్పాట్లు చేస్తున్నాం` అని అన్నారు.