కొవిడ్‌ను జయించిన 15 రోజుల నవజాత శిశువు

భువనేశ్వర్ (CLiC2NEWS): పుట్టిన 15 రోజులకే కొవిడ్ బారినపడిన నవజాత శిశువు పది రోజుల్లోనే మహమ్మారిపై విజయం సాధించింది. ఈ ఘటన ఒడిశాలోని భువనేశ్వర్‌లో చోటు చేసుకుంది. ఛత్తీస్‌గఢ్‌లోని కలహండి జిల్లాకు చెందిన అగర్వాల్ భార్య ప్రీతి అగర్వాల్ (29) రాయ్‌పూర్‌లోని ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసవించింది. నవజాత శిశువుకు జ్వరం రావడంతో అగర్వాల్ దంపతులు భువనేశ్వర్‌లోని జగన్నాథ్ హాస్పిటల్‌కు తీసుకువెళ్లారు. పరీక్షించిన నియోనటాలజిస్ట్ డాక్టర్ అరిజిత్ మోహపాత్ర శిశువుకు కొవిడ్ సోకిందని నిర్ధారించారు. శిశువును తమ వద్దకు తీసుకువచ్చినప్పుడు అధిక జ్వరంతో, తీవ్ర శ్వాసకోశ సమస్యలతో బాధపడుతుందని వైద్యులు పేర్కొన్నారు.
పలు చికిత్సలు చేసి, చివరికు వెంటిలెటర్‌పై ఉంచామని, రెమ్డెసివిర్తో సహా ఇతర యాంటీబయాటిక్స్ ఇచ్చినట్లు చెప్పారు. తల్లిదండ్రుల అనుమతితో రెమ్‌డెసివిర్‌ను ఇంజెక్షన్ ఇచ్చామని, ఎందుకంటే కొత్తగా పుట్టిన శిశువులపై పరిశోధనలు జరుగలేవని చెప్పారు. చివరకు చికిత్స సానుకూలంగా స్పందించి, కోలుకుందని మోహాపాత్ర పేర్కొన్నారు. ‘ఈ కేసు నా జీవితంలో ఒక ప్రత్యేక అనుభవం’ అవుతుందని ఆ డాక్టర్ పేర్కొన్నారు.