RaghuRama: వైద్య పరీక్షలు పూర్తి.. ఆర్మీ ఆస్ప‌త్రి ప్ర‌క‌ట‌న‌

హైద‌రాబాద్‌ (CLiC2NEWS): నర్సాపురం పార్లమెంట్ సభ్యుడు రఘురామకృష్ణంరాజుకు సుప్రీంకోర్టు ఆదేశాల‌తో వైద్య ప‌రీక్ష‌లు నిర్వ‌హించారు సికింద్రాబాద్‌లోని ఆర్మీ ఆస్ప‌త్రి వైద్యులు. అనంత‌రం ర‌ఘురామకు వైద్య ప‌రీక్ష‌ల‌పై ఓ ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు. రఘురామకృష్ణం రాజుకు ముగ్గురు వైద్యుల మెడికల్‌ బోర్డ్‌ ఆధ్వర్యంలో వైద్య పరీక్షలు నిర్వహించినట్లు ప్ర‌క‌ట‌న‌లో వెల్లడించింది. సుప్రీంకోర్టు ఆదేశాలతో తెలంగాణ హైకోర్టు నియమించిన న్యాయాధికారి సమక్షంలో ఈ వైద్య పరీక్షలు నిర్వహించినట్లు అధికారులు వెల్లడించారు. సుప్రీంకోర్టు తదుపరి ఆదేశాలు వచ్చేవరకు ఆర్మీ ఆసుపత్రిలోనే రఘురామకృష్ణంరాజు ఉండనున్నారు. కొవిడ్‌ నిబంధనల ప్రకారం ఎంపీ రఘురామకు అన్ని ఏర్పాట్లు చేశామని.. ఆయన ఆర్మీ ఆసుపత్రిలోనే ఉంటారని అధికారులు తెలిపారు.

కాగా, జ్యుడీషియ‌ల్ ఆఫీస‌ర్ స‌మ‌క్షంలో నిర్వ‌హించిన వైద్య ప‌రీక్ష‌ల‌కు సంబంధించిన నివేద‌క‌ల‌ను సీల్డ్ క‌వ‌ర్‌లో త‌మ‌కు స‌మ‌ర్పించాల‌ని సుప్రీంకోర్టు ఆదేశించిన సంగ‌తి తెలిసిందే.. ఆయ‌న ఆర్మీ ఆస్ప‌త్రిలో ఉన్న స‌మ‌యాన్ని కూడా క‌స్ట‌డీలో ఉన్న‌ట్టుగా భావించాల‌ని కోర్టు తెలిపింది.

కాగా.. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు రఘురామకృష్ణరాజును గుంటూరు జిల్లా జైలు నుంచి సికింద్రాబాద్‌ ఆర్మీ ఆసుపత్రికి సోమవారం రాత్రి రోడ్డు మార్గాన తరలించారు. అనంతరం రఘురామకృష్ణంరాజుకు నిర్వహించిన వైద్య పరీక్షలను అధికారులు వీడియోలో చిత్రీకరించారు.

Leave A Reply

Your email address will not be published.