TS: గాంధీ ఆస్పత్రికి సిఎం కెసిఆర్

హైదరాబాద్ (CLiC2NEWS): తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రికి చేరుకున్నారు. మంత్రి హరీష్ రావు, సిఎస్ సోమేశ్ కుమార్తో కలిసి ఆస్పత్రిలో కొవిడ్ చికిత్సలు, ఇతర సదుపాయాలను ఆయన పరిశీలిస్తున్నారు. గాంధీ ఆస్పత్రిలో ఎమర్జెన్సీ వార్డును సిఎం సందర్శించారు. ఐసియు రోగులతో మాట్లాడి వారికి ధైర్యం చెప్పారు. వారికి అందుతున్న వైద్య సౌకర్యాలను అడిగి తెలుసుకోనున్నారు. అనంతరం అక్కడ జూనియర్ వైద్యులు, ఇతర సిబ్బందిని సిఎం అభినందించారు.
కొవిడ్ చికిత్సతో పాటు ఆక్సిజన్, ఔషధాల లభ్యతను పరిశీలించి చర్చించనున్నారు. ప్రస్తుతం వైద్య ఆరోగ్యశాఖను సీఎం కేసీఆర్ స్వయంగా పర్యవేక్షిస్తున్న విషయం తెలిసిందే. సీఎం కేసీఆర్ పర్యటన నేపథ్యంలో గాంధీ ఆస్పత్రి వద్ద పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు.
వైద్య, ఆరోగ్య శాఖ మంత్రిగా ఈటల రాజేందర్ ను తప్పించిన తరువాత ఆ శాఖలను ముఖ్యమంత్రి కేసీఆర్ తనవద్దే ఉంచుకున్నారు. వైద్య, ఆరోగ్యశాఖ కేసీఆర్ వద్దనే ఉండటంతో కేసీఆర్ గాంధీ ఆసుపత్రిని సందర్శించిన తరువాత ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారు అన్నది కూడా ఆసక్తికరంగా మారింది.


