TS: భూముల రిజిస్ట్రేషన్ విలువ పెంచాలి: కేబినెట్ సబ్ కమిటీ

హైదరాబాద్ (CLiC2NEWS): తెలంగాణలో భూముల రిజిస్ట్రేషన్ విలువ పెంపునకు రంగం సిద్ధమైంది. భూముల రిజిస్ట్రేషన్ విలువలను పెంచాలని మంత్రివర్గ ఉప సంఘం ప్రభుత్వానికి సూచించింది. రాష్ట్రంలో నిధుల సమీకరణ కోసం తెలంగాణ ప్రభుత్వం ఇటీవల ఏర్పాటు చేసిన మంత్రివర్గ ఉప సంఘం ఆర్థికశాఖ మంత్రి హరీశ్‌రావు అధ్యక్షత మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో మంగళవారం సమావేశమైంది. మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్, రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, సీఎస్ సోమేశ్ కుమార్‌తోపాటు పలువురు ఉన్నతాధికారులు సమావేశానికి హాజరయ్యారు.
స్టాంపులు, రిజిస్ట్రేషన్లకు సంబంధించిన అధికారులతో ప్రత్యేకంగా చర్చించారు. రాష్ట్రంలో భూముల విలువ పెంచే విషయమై ప్రత్యేకంగా చర్చించారు. `రాష్ట్ర ఆవిర్భావం నాటి నుంచి రిజిస్ట్రేషన్ విలువను ప్రభుత్వం పెంచలేదు. ఏపీలో గడిచిన 8 ఏండ్లలో 7 సార్లు రిజిస్ట్రేషన్ల విలువలు పెరిగాయి. తమిళనాడులో రిజిస్ట్రేషన్ విలువ 7.5శాతంగా ఉంది. మహారాష్ట్రలో రిజిస్ట్రేషన్ విలువ 7 శాతంగా ఉంది. ప్రభుత్వ విలువల కన్నా ఎక్కువకే లక్షలాది రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయి. హెచ్‌ఎండీఏ పరిధిలో అధిక విలువతోనే 51 శాతం రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయి. తక్కువ రిజిస్ట్రేషన్ విలువతో రుణాలకు ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. సాగు నీటి ప్రాజెక్టులు, వ్యవసాయాభివృద్ధితో గ్రామాల్లోనూ భూముల విలువ భారీగా పెరిగింది. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లోని భూముల విలువ భారీగా పెరిగింది.“ అని కేబినెట్ సబ్ కమిటీ పేర్కొంది.
భూముల విలువలను సవరించాలని త్వరలో ముఖ్యమంత్రి కెసిఆర్‌కు నివేదిక ఇవ్వాలని కేబినెట్ సబ్ కమిటీ నిర్ణయించింది.