AP: ప్రధాని మోడీకి సిఎం జగన్ లేఖ

అమరావతి (CLiC2NEWS): ప్రధాని మోడీకి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి లేఖ రాశారు. ప్రైవేటు ఆస్పత్రుల ద్వారా వ్యాక్సినేషన్ ఎక్కువగా జరగడం లేదనే విషయాన్ని ప్రధాని దృష్టికి తీసుకుని వెళ్లారు. జూన్ 21 నుంచి దేశంలో ఉత్పత్తి అవుతున్న వ్యాక్సిన్ లో 25 శాతం కోటాను ప్రైవేటు హాస్పిటళ్ళకు కేంద్రం కేటాయించిన సంగతి తెలిసిందే. అయితే ప్రైవేటు హాస్పిటళ్ళ ద్వారా వ్యాక్సినేషన్ కు ప్రజలు ఎక్కువగా ఆసక్తి చూపించటం లేదని లేఖలో వెల్లడించారు సీఎం.
‘‘జులై లో ప్రైవేట్ ఆస్పత్రులకు 17,71,580 డోసులు కేటాయించారు. ఇంత పెద్ద మొత్తంలో వ్యాక్సిన్లను ప్రైవేట్ ఆస్పత్రులు వినియోగించుకునే అవకాశం లేదు. ప్రైవేట్ ఆస్పత్రులు తీసుకోనటువంటి వ్యాక్సిన్ నిల్వలను ప్రభుత్వ వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్‌కు కేటాయించాలని’’ ముఖ్యమంత్రి జగన్ విజ్ఞప్తి చేశారు. ఈనెల 24న జరిగిన ప్రధాన కార్యదర్శుల సమావేశంలోనూ, ఇతర రాష్ట్రాలు ఇదే అంశాన్ని ప్రస్తావించాయని ముఖ్యమంత్రి జగన్ లేఖలో పేర్కొన్నారు.