అంతర్జాతీయ స్థాయి విద్యను అందించవచ్చు..

ఈ సంవత్సరము విద్య కొరకు కేటాయించే నిధులలో సింహభాగం డిజిటల్ పరికరాలు కొనుగోలుకు ఉపయోగిస్తే ఎన్నో ప్రయోజనాలు ఉంటాయి.

  • విద్యా సంవత్సరం వృధా కాదు.
  • సాధారణ విద్యతో పాటు సాంకేతిక విద్య ను అందించవచ్చు.
  • నిరుద్యోగం తగ్గించవచ్చు.
  • అంతర్జాతీయ స్థాయి విద్యా ఉద్యోగాలు అందరికీ అందుబాటులోకి తేవచ్చు.
  • ప్రతిభ ఉన్నవారు, వెంటనే నిలదొక్కుకుని, పదిమందికి ఉపాధి కల్పిస్తారు.
  • సాంకేతిక పరిజ్ఞానం పెంపొందించాలనే జాతీయ విద్యా విధానం 2020 లక్ష్యం నెరవేరుతుంది.
  • ఒకవేళ విద్యా సంస్థలు యధావిధిగా నడిచే పరిస్థితి వచ్చినప్పటికీ, అదనపు కోర్సులు చదువుకోవడానికి, చదువుతూనే ఆన్ లైన్ జాబులు చేసుకోవడానికి డిగ్రీ, పీజీ విద్యార్థులకు అవకాశం ఉంటుంది.

కరోనా ప్రభావంతో ఒక విద్యా సంవత్సరం ఇప్పటికే నష్టపోయాం. ఈ సంవత్సరం కూడా ఈ కరోనా ప్రభావం ఏ విధంగా ఉంటుందో అంతుచిక్కడం లేదు. ప్రభుత్వాలు ధైర్యం చేసి విద్య సంవత్సరము వృధా కాకూడదని ఒక అడుగు ముందుకు వేసి ఒక నిర్ణయం తీసుకుంటే, కొద్దిరోజుల్లోనే కరోనా ప్రభావంతో రెండు అడుగులు వెనుకకు వేయవలసి వస్తుంది. ఇప్పటికైతే తెలంగాణ రాష్ట్రంలో కరోనా ప్రభావం తగ్గుతున్నప్పటికీ థర్డ్ వేవ్  ప్రభావంతో సమస్యలు ఎదురవుతాయని కొంతవరకు వెనక్కు తగ్గక తప్పలేదు.

ఇంకా కొంచెం లోతుగా పరిశీలన చేసి ప్రత్యామ్నాయాలు కూడా పరిశీలించవలసిన అవసరం ప్రభుత్వంపై ఉన్నది, దీనికొరకు విద్యావంతులు, మేధావులు తమ తమ అభిప్రాయాలను సూచించవలసిన అవసరం కూడా ఉన్నది. తెలంగాణ రాష్ట్రంలో పాఠశాలల అభివృద్ధి కొరకు వేల కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసింది. పాఠశాల భవనాలు ఇతర వసతులు సమకూర్చుట కొరకు ఈ యొక్క నిధులు ఉపయోగించాలని వివిధ రాష్ట్రాల పాఠశాలలను పరిశీలించి ఒక నిర్ణయం తీసుకోబోతున్న ది.

ఈ నిధులను కరోనా ప్రభావం నుండి ఈ విద్యాసంవత్సరం వృధా కాకుండా ప్రత్యామ్నాయాల కొరకు కూడా ఉపయోగిస్తే బాగుంటుంది. కార్పొరేటు విద్యాసంస్థల్లో మరియు కొన్ని ఆన్లైన్ బోధన అందించే బైజూస్ లాంటి సంస్థలు విద్యార్థులకు ట్యాబ్ ల ద్వారా విద్యను అందిస్తుంది. మన రాష్ట్రంలో దాదాపుగా 80 లక్షల మంది విద్యార్థులు ఉంటారు. ఇందులో పోస్టు గ్రాడ్యుయేట్ ద్వితీయ సంవత్సరం, గ్రాడ్యుయేట్ తృతీయ సంవత్సరం, ఇంటర్మీడియట్ రెండవ సంవత్సరము, పదవ తరగతి విద్యార్థులు దాదాపుగా 20 లక్షల మంది ఉండే అవకాశం ఉన్నది. వారిలో ప్రభుత్వ విద్యా సంస్థల్లో చదివే వారు సుమారు పది లక్షల కన్నా తక్కువగా ఉండే అవకాశం ఉన్నది. వారికి ఒక్కొక్కరికి ఒక ట్యాబ్ అందజేయడానికి ఏదైనా ఆన్లైన్ ద్వారా విద్యను అందించే సంస్థను పరిశీలించి, లేదా వారి తోనే సాంకేతిక సహకారం కొరకు ఒప్పందం కుదుర్చుకున్నట్లు అయితే ఖర్చు తక్కువగా ఉండి, ఫలితం ఎక్కువ ఉండే అవకాశం ఉండవచ్చు. ప్రైవేటు సంస్థలలో చదివే వారు, ఎక్కువ శాతం తమ స్వంత ఖర్చులతో ట్యాబ్ లు కొనుగోలు చేయగలిగే స్తోమత కలిగి ఉంటారు, లేనట్లైతే ట్యాబ్ ల కొనుగోలు కొరకు వారికి బ్యాంక్ ల ద్వారా ఎడుకేషన్ లోన్ ఇప్పిస్తే వారికి ప్రయోజనకరంగా ఉంటుంది.

ఈ విధంగా ఈ  విద్యా సంవత్సరంలో చివరి సంవత్సరం చదువుతున్న వారిని నష్టపోకుండా కాపాడవచ్చు.
ఒకవేళ కరోనా ప్రభావం పూర్తిగా తగ్గిపోయి విద్యాసంస్థలు యధావిధిగా కొనసాగినప్పటికీ విద్యార్థులకు అందజేయబడిన ట్యాబ్ లు వృధా అయ్యే అవకాశమే లేదు, ఎందుకంటే మన భారతదేశంలో 2020 నుండి ప్రవేశపెట్టబడిన జాతీయ విద్యా విధానం ద్వారా ఒక విద్యార్థి తనకు నచ్చిన కోర్సును అంతర్జాతీయ స్థాయిలో తనకు నచ్చిన సంస్థ ద్వారా నేర్చుకోవచ్చు. ఒకవేళ విద్యార్థి అంతర్జాతీయ స్థాయిలో లో డిమాండ్ ఉన్న ఏవైనా కోర్సులు ఆన్ లైన్ ద్వారా చదివినట్లయితే, అతనికి ఖర్చు తక్కువ అవుతుంది, ఆ తర్వాత అతనికి మంచి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. ప్రస్తుతానికి పెద్ద పెద్ద సాఫ్ట్వేర్ సంస్థలు వర్క్ ఫ్రం హోం ద్వారానే తమ యొక్క ఉద్యోగుల సేవలు తీసుకుంటున్నాయి. దీని ద్వారా ఆ సంస్థలకు కూడా ఖర్చు తగ్గుతుంది. అంతర్జాతీయ స్థాయిలో ఉన్న సంస్థలు మన ప్రాంతంలోనే ఉండి, చదువు పూర్తి చేసుకున్న వారికి  ఉద్యోగాలు ఇచ్చినట్లయితే మన రాష్ట్రం మన ప్రాంతం ఎంతో ఆర్థికంగా బలపడే అవకాశాలు ఉన్నాయి.

విద్యార్థిని విద్యార్థులు సహజంగా వారికి పరిచయం ఉన్న లేదా వారి ప్రాంతంలో ఉన్న వారు ఏ కోర్సు చదివితే అదే కోర్స్ చదవడానికి, ఏ ఉద్యోగం సాధిస్తే అదే ఉద్యోగం సాధించడానికి, వారిని అనుసరించడానికి ప్రయత్నం చేస్తుంటారు. ఉదాహరణకు తెలంగాణ రాష్ట్రంలో ఇంజనీరింగ్ చేసే విద్యార్థుల సంఖ్య తమిళనాడులో ఇంజనీరింగ్ చేసే విద్యార్థులతో పోలిస్తే చాలా ఎక్కువగా ఉంటుంది. తెలంగాణలోని విద్యార్థులు ఒకరిని చూసి ఒకరు ఇంజనీరింగ్ కోర్సులలోనే చేరి, సాఫ్ట్వేర్ ఉద్యోగాల కొరకు ప్రయత్నం చేస్తూ ఉంటారు. కానీ తమిళనాడులో అన్ని కోర్సులతో సమానంగా ఇంజనీరింగ్ ను కూడా ఒక కోర్సు గా భావిస్తారు, అందులో మాత్రమే ఎక్కువ మంది విద్యార్థులు చేరి,  సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చేయడానికి ప్రయత్నం చేయరు. దీని ద్వారా మనం అర్థం చేసుకోవలసింది మన ప్రాంతంలోని విద్యార్థినీ విద్యార్థులు అంతర్జాతీయ స్థాయి విద్యా సంస్థల్లో డిమాండ్ ఉన్నా కోర్సును చదివి మంచి జీతాలు ఇచ్చే అంతర్జాతీయ స్థాయి సంస్థల్లో ఉద్యోగం సాధించినట్లయితే మిగతా విద్యార్థినీ విద్యార్థులు కూడా వారిని అనుసరించి ఆయా డిమాండ్ ఉన్న కోర్సులు చదివి అంతర్జాతీయ స్థాయిలో పెద్ద పెద్ద సంస్థలలో ఉద్యోగాలు సాధించే అవకాశాలు ఉన్నాయి.

ఈ విధంగా ఇప్పటికే జాతీయ విద్యా విధానంలో ఆన్లైన్ విద్యకు ప్రాధాన్యత ఇవ్వబడింది, కావున రాష్ట్ర ప్రభుత్వాలు మరియు కేంద్ర ప్రభుత్వం విద్యా సంస్థల కొరకు తాము కేటాయించే నిధులలో డిజిటల్ విద్యనందించే పరికరాలు ముఖ్యంగా ఎక్కువ శాతం నిధులను ట్యాబ్ ల కొరకు ఖర్చు చేస్తే విద్యాసంవత్సరం నష్టపోకుండా, విద్యార్థులకు నష్టం జరగకుండా నిరుద్యోగ సమస్య పెరగకుండా ఉంటుంది. అదేవిధంగా ప్రతిభ ఉన్న పేద మధ్య తరగతి విద్యార్థినీ విద్యార్థులు మంచి మంచి ఉద్యోగాలు సాధించి ఆర్థికంగా బలపడి రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాలకు బాసటగా నిలుస్తారు. కావున ప్రతి స్ధాయిలో చివరి సంవత్సరం చదువుతున్న  విద్యార్థులకు ఈ విద్యా సంవత్సరం ట్యాబ్ ల ద్వారా విద్యను అందజేయడానికి అవకాశాలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పరిశీలించాలి.

-అడ్డిచర్ల సాగర్
ప్రభుత్వ ఉపాధ్యాయుడు
తెలంగాణ రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత (2019)
9346474070

Leave A Reply

Your email address will not be published.