కొవిన్‌లోనే ప్రైవేట్ ఆస్పత్రుల వ్యాక్సిన్ ఆర్డర్లు?

న్యూఢిల్లీ (CLiC2NEWS): దేశంలో కరోనా కట్టడికోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వ్యాక్సినేషన్‌ను ముమ్మరం చేసిన విషయం తెలిసిందే. కాగా ప్రైవేటు దవాఖానాల్లో వ్యాక్సిన్‌లు నిరుపయోగమవుతున్నాయన్న వార్తల నేపథ్యంలో కేంద్రం స్పందించింది. ప్రైవేటు ఆస్పత్రుల నెలవారీ కొనుగోళ్లపై పరిమితులు విధించనున్నట్లు సమాచారం. ఇకపై ప్రైవేట్ ఆస్పత్రులు వ్యాక్సిన్‌ల కోసం కొవిన్ ద్వారా మాత్రమే ఆర్డర్ చేయాలని స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. ఈ నూతన మార్గదర్శకాలు జులై 1 నుండి అమల్లోకి రానున్నట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి.
అన్ని ప్రైవేటు ఆసుపత్రులు ఈ మొత్తం టీకా సమాచారాన్ని కొవిన్ డేటాబేస్‌లో అందించాల్సి ఉంటుందని ఆ వర్గాలు పేర్కొన్నాయి. ఆ వివరాల ఆధారంగా తయారీ సంస్థలు తదుపరి వ్యాక్సిన్ డోసులను రూపొందించేందుకు వీలుంటుంది.
ఇప్పటి వరకు నేరుగా తయారీ సంస్థల నుండి ప్రైవేట్ ఆస్పత్రులు వ్యాక్సిన్ డోసులను కొనుగోలు చేసేవి. ప్రైవేట్ ఆస్పత్రుల్లో లక్షల కొద్దీ వ్యాక్సిన్‌లు నిరుపయోగంగా ఉండిపోతున్నాయంటూ పలు రాష్ట్రాలు ఆందోళన వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రైవేట్ ఆసుపత్రులకు 25శాతం వ్యాక్సిన్‌లను కేటాయించడం చాలా ఎక్కువని, దాన్ని తగ్గించాలంటూ తమిళనాడు సహా పలు రాష్ట్రాలు ఇటీవల కేంద్రానికి లేఖ రాశాయి.