అసాధారణ సేవకుడు సంతోష్ కుమార్ కు దక్కిన అరుదైన గౌరవం

మంచిర్యాల (CLiC2NEWS): గత 26 సంవత్సరాలుగా అన్ని రంగాలలో ఎన్నో రకాల విశేషమైన సేవలు అందిస్తూ, బడుగు బలహీన వర్గాల ప్రజలు, ఆపదలో ఉన్నవారు, అనాధలు, ఎందరినో అక్కున చేర్చుకుని అనన్యసామాన్యమైన సేవలు అందించి ఆపద్బాంధవుడిగా పేరుగాంచిన మంచిర్యాల జిల్లా తాండూరు మండల కేంద్ర నివాసి అభినవ సేవాసంస్థల వ్యవస్థాపకుడు కేశెట్టి సంతోష్ కుమార్.
కరోనా సమయంలో ఆపదలో ఉన్న వారిని, ఆకలితో అల్లాడిపోతున్నవారిని రక్త సంబంధీకులు కూడా ఆదుకో కుండా దూరంగా ఉంటే తను మాత్రం అందరివాడై, ఆపదలో ఉన్న వారికి ఆపన్నహస్తమై, అన్ని రకాల సేవలు అందిస్తూ, అహర్నిశలు కృషి చేస్తూ అందరికీ అన్ని వేళలా అందుబాటులో ఉంటూ ఎంతోమంది ఆకలి తీర్చి ఆదుకున్నాడు.
తన ప్రాణాలను లెక్కచేయకుండా శక్తివంచన లేకుండా పని చేశాడు. అతని సేవలకు సంబంధించిన సమాచారం తెలుసుకున్న ఎన్నో జాతీయ అంతర్జాతీయ సంస్థలు ఇప్పటికే అతనిని ఎన్నో అవార్డులతో సత్కరించాయి. అదే మాదిరిగా భారత ప్రభుత్వ కార్పోరేట్ మంత్రిత్వ శాఖ ద్వారా గుర్తింపు గల జీవన్ దాయిని మల్టిపర్పస్ పౌండేషన్ మరియు శివాణి నేచురోపతి కేర్ అండ్ రిసర్చ్ సెంటర్ సంయుక్తంగా కేశెట్టి సంతోష్ కుమార్ ను అంతర్జాతీయ మానవతావాది పురష్కారం మరియు గ్లోబల్ అంబాసిడర్-2021 అవార్డులు అందజేసి గౌరవించాయి.
అభినవ సంతోష్ కుమార్ ఈ అవార్డులు అందుకోవడం పట్ల అతని మిత్రులు శ్రేయోభిలాషులు హర్షం వ్యక్తం చేశారు. ముందు ముందు అతను ఇంకెన్నో అవార్డులు అందుకోవాలని, అతను చేస్తున్న సేవలకు ఎన్ని అవార్డులు ఇచ్చినా సరిపోవని కొనియాడారు. ఈ సందర్భంగా అతనికి శుభాకాంక్షలు తెలియజేశారు.