water war: తెలంగాణలో అక్రమ ప్రాజెక్టులు లేవు: మంత్రి శ్రీనివాస్ గౌడ్

హైదరాబాద్ (CLiC2NEWS): అక్రమ ప్రాజెక్టులతో తెలంగాణ వాటాను ఆంధ్రప్రదేశ్ దోచుకుంటోందని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ ఆరోపించారు. కృష్ణా బెసిన్‌లో అవసరాలు తీరకుండానే పెన్నాకు నీళ్లు తీసుకెళ్లేందుకు యత్నాలు చేస్తున్నారన్నారు.
కేంద్ర ప్రభుత్వంతో ఏపీ ఏమైనా అవగాహన ఒప్పందం చేసుకుందా? అని ప్రశ్నించారు. ప్రాజెక్టులను కేంద్రం పరిధిలోకి తీసుకోవాలని ఏపీ కోరడాన్ని ఖండిస్తున్నామని శ్రీనివాస్ గౌడ్ తెలిపారు.
తెలంగాణలో అక్రమంగా నిర్మించిన ప్రాజెక్టులు లేవని మంత్రి స్పష్టం చేశారు. ఉమ్మడి ఏపీ సీఎంలు గతంలో ఇచ్చిన జీవోలను ముఖ్యమంత్రి కేసీఆర్ అమలు చేస్తున్నారని పేర్కొన్నారు. రాష్ట్రంలో ఎక్కువగా ఎత్తిపోతల పథకాల ద్వారానే సాగునీటి అవసరాలు తీసుతున్నాయన్నారు. తెలంగాణలో ఉన్న సెటిలర్స్ అంతా తమవారేనన్న శ్రీనివాస్ గౌడ్.. ప్రత్యేక రాష్ట్రం వచ్చాక కూడా ప్రశాంతంగా ఉన్నామని సెటిలర్లు చెబుతున్నారు.
“ఒకప్పుడు సెటిలర్స్ కావచ్చేమో.. కాని ఇప్పుడు కాదు.. వారంతా తెలంగాణకు చెందిన వారే. ఉద్యమ సమయంలో కూడా సెటిలర్స్ అనే పదాన్ని మేం వాడ లేదు. వారు ఇప్పటికీ సెటిలర్స్ అని మీరు ముద్ర వేస్తున్నారు. వారిలో చాలా మంది పిల్లలు ఇక్కడే పుట్టారు. ఈ ప్రాంతానికి అన్యాయం జరుగుతుంటే మాట్లాడాలి కదా అని అనేక మందిని అడిగాం. వారంతా అందుకు సానుకూలంగా స్పందించారు. తెలంగాణ వచ్చిన తర్వాత వారి జీవన స్థితిగతులు మరింత మెరుగ్గా అయ్యాయని ఎంతో మంది చెప్పారు. వారు ఎప్పటి మా వారే“ అని మంత్రి తెలిపారు.