Kathi Mahesh: సినీ నటుడు కత్తి మహేశ్ మృతి

హైదరాబాద్ (CLiC2NEWS): సినీ నటుడు, విశ్లేషకుడు కత్తి మహేశ్ కన్నుమూశారు. గత కొద్ది రోజుల క్రితం కత్తి మహేశ్ రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన విషయం విదితమే. చెన్నైలోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మహేశ్ మృతి చెందారు. ఈ మేరకు మహేశ్ మృతిని చెన్నై అపోలో ఆస్పత్రి వైద్యులు ధృవీకరించారు.
కాగా కత్తి మహేశ్ ఆస్పత్రి ఖర్చుల నిమిత్తం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ భారీ ఆర్థిక సాయం అందజేశారు. కత్తి మహేశ్ చికిత్స కోసం రూ.17 లక్షలు విడుదల చేసినట్లు సీఎం క్యాంప్ ఆఫీసు ప్రకటించింది. ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి ఈ ఆర్థికసాయం అందజేశారు.
మహేశ్ సినీ ప్రస్థానం..
కత్తిమహేశ్ దర్శకుడు, నటుడు మాత్రమే కాదు, సినీ విశ్లేషకుడు కూడా. పలు టెలివిజన్ ఛానళ్లు, యూట్యూబ్ వేదికగా సినిమాలను విశ్లేషించేవారు. ఆయన మృతి పట్ల తెలుగు సినీ పరిశ్రమ విచారం వ్యక్తం చేసింది.
చిత్తూరు జిల్లాలో కత్తిమహేశ్ జన్మించారు. అక్కడే ప్రాథమిక విద్యను పూర్తి చేసిన ఆయన హైదరాబాద్ సెంట్రల్ వర్సిటీలో ఉన్నత విద్యను అభ్యసించారు. దర్శకుడు అవ్వాలన్న ఉద్దేశంతో పలు ప్రయత్నాలు చేశారు. 2011లో దేవరకొండ బాలగంగాధర తిలక్ రచించిన ‘ఊరు చివర ఇల్లు’ కథ ఆధారంగా షార్ట్ ఫిల్మ్ రూపొందించారు. ‘మిణుగురులు’ చిత్రానికి సహ రచయితగా వ్యవహరించారు. ఆయన దర్శకత్వం వహించిన ‘పెసరట్టు’ పెద్దగా ఆకట్టుకోలేదు. దీంతో నటుడిగా మారారు. ముఖ్యంగా ‘హృదయకాలేయం’లో పోలీస్ ఆఫీసర్‌గా, ‘నేనే రాజు నేనే మంత్రి’లో టీ అమ్మే వ్యక్తిగా, ‘కొబ్బరిమట్ట’లో రైతుగా నటించి మెప్పించారు. ఆ తర్వాత ‘అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు’, ‘క్రాక్’ తదితర చిత్రాల్లోనూ మెరిశారు.