భాగ్య‌న‌గ‌రంలో కుండ‌పోత‌ వ‌ర్షం

లోత‌ట్టు ప్రాంతాలు జ‌ల‌మ‌యం..

హైద‌రాబాద్ (CLiC2NEWS): భాగ్య‌న‌గ‌రంలో ఆదివారం భారీ వ‌ర్షం కురిసింది. గ‌త కొన్ని రోజులుగా దేశంలో భారీ వ‌ర్షాలు కురుస్తున్నాయి. ఇటు తెలంగాణ రాష్ట్రంలో కూడా విస్తారంగా వ‌ర్షాలు కురుస్తున్న సంగ‌తి తెలిసిందే. హైదార‌బాద్‌లో ఈ మ‌ధ్య ప్ర‌తిరోజూ వ‌ర్షం కురుస్తున్న‌ది. ఇవాళ కూడా న‌గ‌రంలో కుండ‌పోత‌గా వ‌ర్షం కురుస్తున్న‌ది. దాదాపుగంట‌న్న‌ర పాటు ఎడ‌తెరిపిలేకుండా కురిసిన వ‌ర్షంతో లోత‌ట్టు ప్రాంతాలు జ‌ల‌మ‌యం అయ్యాయి. హైద‌రాబాద్‌లోని జూబ్లీహిల్స్‌, బంజారాహిల్స్, మాదాపూర్‌, పంజాగుట్ట‌, అబిడ్స్‌, సికింద్రాబాద్‌, బేగంపేట‌, నాంప‌ల్లి, ఎంజే మార్కెట్‌, పాత‌బ‌స్తీలో కుండపోత‌గా వ‌ర్షం కురిసింది. ఖైర‌తాబాద్‌-బంజారాహిల్స్ ర‌హ‌దారిపై మోకాళ్ల లోతు నీళ్లు నిలిచాయి. ల‌క్డికాపూల్ వ‌ర‌కు కిలోమీట‌ర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోయింది. బాలాన‌గ‌ర్‌, చింత‌ల్‌, జీడిమెట్ల‌, జ‌గ‌ద్గిరిగుట్ల‌, కుత్బుల్లాపూర్‌, కొంప‌ల్లి, కోఠీ సుల్తాన్ బ‌జార్‌, బేగం బ‌జార్‌, అబిడ్స్‌, నాంప‌ల్లి, బ‌షీర్‌బాగ్‌, హిమాయ‌త్‌న‌గ‌ర్‌, నారాయ‌ణ‌గూడ‌, బాగ్‌లింగంప‌ల్లి త‌దిర ప్రాంతాల్లో భారీ వ‌ర్షం కురిసింది. ఈ ప్రాంతాల్లోని రోడ్ల‌న్నీ వ‌ర్ష‌పునీటితో జ‌ల‌మ‌య‌మ‌య్యాయి. కాగా భారీ వ‌ర్షాల కురుస్తుండ‌టంతో అధికారులు అప్ర‌మ‌త్త‌మ‌య్యారు. అవ‌స‌ర‌మైతే త‌ప్ప ప్ర‌జ‌లు బ‌య‌ట‌కు రావొద్ద‌ని జీహెచ్ఎంసీ అధికారులు హెచ్చరిస్తున్నారు.

Leave A Reply

Your email address will not be published.