విజయుడు (ధారావాహిక నవల)

ఎందుకో ఏమోలే మనకెందుకన్నట్లుగా వారి మధ్య సంభాషణ జరిగింది. మళ్లీ కారు ఆగి ఉన్న లారీని దాటి ముందుకు వెళ్లడంతో ఆ వెంటనే కొద్ది సేపటికి లారీ కూడా స్టార్ చేసి ముందుకు కదిలించి కారును టార్గెట్ చూస్తూనే వస్తున్నాడు లారీ డ్రైవర్.. ఢిల్లీలోని కరోల్‌బాగ్ లోని ఒక హోటల్‌లో నాలుగు రోజుల ముందు దిగిన విజయ్ వరుసగా హస్తిన నగరంలోని పలు దర్శనీయ స్థలాలకు వెళ్లి చూస్తున్నారు. అయితే ఈ రోజు ఉదయం ఊబర్ టాక్సీని బుక్ చేసుకొని తాజ్‌మహల్ సదర్శానినికి బయలు దేరారు. డ్రైవర్ ఫోన్ చేయగానే సెల్‌ఫోన్ మాత్రం తీసుకొని రూం బయటకు వచ్చి, లాక్ చేసి హడావుడిగా బయలుదేరి కిందికి వచ్చారు విజయ్. ఆగ్రా కొంత దూర ప్రాంతం కావడం, తిరిగి రాత్రికి కరోల్‌బాగ్ హోటల్‌కు రావాలనే ఉద్ధేశ్యం ఉండటంతో ఆదరాబాదరాగా వచ్చి కారులో కూర్చొని పోనియ్ అన్నాడు. కారులో విజయ్ కూర్చోగానే డ్రైవర్ తన సెల్‌ఫోన్ లో జిపిఎస్ ఆన్‌చేసి ఆగ్రాకు రూట్ సెట్ చేసుకున్నాడు. కారు ఉదయమే బయలు దేరడంతో రోడ్డుపై అంతగా ట్రాఫిక్ కూడాలేదు. ఇంతలో డ్రైవర్ ముందు రోడ్డును చూస్తూ కారును ముందుకు నడుపుతూనే విజయ్‌తో మాటలు కలిపారు.
సార్ నేను మిమ్ములన్నీ ఎరుగుదును.
అలాగా, నీవు తెలంగాణ వాడివే కదా బహుశ ఏ టీవీలోనో చూసి ఉంటావు.. కరెక్టేనా
అవును సరు. అసెంబ్లీలో మీరు అదరగొడుతున్నారు.
ప్రజా సమస్యలపై మాట్లాడాలి కదా..
లేదు సరు. మీలాగా ఎవరు కూడా ఇలా ప్రజా సమస్యలను ఉదాహరణలతోపాటు వాదించడం లేదు. అవినీతి ఏ స్థాయిలో ఉన్నా మీరు ప్రస్తావిస్తున్నారు. మీ పార్టీ వారిని వదలడం లేదు. అందుకు హస్తినలో తెలుగు వారు ఎక్కడ కలుసుకున్న అసెంబ్లీ సమావేశాల సమయంలో మీ ప్రస్తావనయే అధికంగా ఉంటుంది. మంత్రులు కొందరి నోళ్లలో పచ్చి వెలక్కాయ పడుతున్నది. ఎవరి స్వార్థం వారిది. అధికార పార్టీలో ఉన్నప్పటికీ మీరు ప్రజాపక్షం వహించిన తీరు మాలాంటి వాళ్ళు టివిలకు అతుక్కుపోయి చూస్తున్నాం సార్.
సరె సరె కారు జాగ్రత్తగదా పోనియ్ నారాయణ అంటూ విజయ్ సీటుకు తల ఆనించి విశ్రాంతి కోసం అన్నట్లుగా కళ్లు మూసుకొన్నాడు. అది కారు అద్దంలో నుంచి కనిపించడంతో నారాయణ ఇక మాటలు వద్దని తన పనిలో ఉండిపోయాడు. కారులో ప్రయాణిస్తున్న విజయ్‌కు తన గతం ఒక్కసారిగా గుర్తుకు వచ్చింది. మారుమూల గ్రామంలో విజయ్ జన్మించాడు. అది ఎంత చిన్న గ్రామం అంటే అక్కడి చిన్న పిల్లలు ప్రాథమిక విద్య కోసం కూడా సమీపంలోని గ్రామానికి రెండు కిలో మీటర్లు నడిచి పోయి రావాలి. పేద కుటుంబంలో పుట్టినప్పటికీ విజయ్ తల్లిదండ్రులు స్కూల్‌కు పంపించి పెద్ద చదువులు చదివి ఉద్యోగం చేస్తూ తమను ఉద్దరిస్తారని తమ వంశానికి పేరుతెస్తారని తలపోశారు. తల్లి దండ్రులు గుర్తుకు రావడంతో విజయ్‌కు ఒక్కసారిగా కళ్లలోకి కన్నీళ్లు వచ్చాయి. ఇది గమనించిన డ్రైవర్ ఉలికపాటుగా ఏమైంది సార్ అంటూ పలకరించారు. వర్తమానంలోకి వచ్చిన విజయ్ ఏమి లేదు పోనియ్ అంటూ తిరిగి ఆలోచనలో పడిపోయాడు. తన హైస్కూల్ చదువులోనూ ఫీజు చెల్లించేందుకు తల్లిదండ్రులు పడిన కష్టం తక్కువేమి కాదు. ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్నప్పటికీ ఎంతో కొంత ఫీజు చెల్లించాల్సిందే. పదో తరగతి పబ్లిక్ పరీక్షకు అదనంగా ఫీజు చెల్లించాలంటే వారు గ్రామంలో ఎందరినో అడిగి అడిగి మరీ అ ఫీజు డబ్బులు సర్దుబాటు చేసిన విషయం విజయ్ మదిలో మెదిలింది. ఇప్పుడు తాను కారులో దర్జాగా ప్రయాణిస్తున్నా, తమ పేరెంట్స్‌కు కనీసం ఎలాంటి సదుపాయాలు లేని దుర్భర పరిస్థితి విజయ్ నెమరు వేసుకున్నారు. పది పబ్లిక్ పరీక్షలు పాస్ కావడం ఆ గ్రామంలో విజయ్ మొదటి వాడు కావడంతో గ్రామ పెద్దలు కూడా విజయ్ ఇంటికి వచ్చి అభినందిస్తుంటే ఆయన తల్లిదండ్రుల ఆనందం అంతఇంత కాదు. తర్వాత ఏమిటనే చర్చ వారి మధ్య జరిగింది. మెరిట్ విద్యార్థి చదువు మధ్యలో ఆగిపోవద్దు పై చదువులకు పంపాల్సిందేనని పట్టుబట్టారు. అన్నింటికి సరే అంటూ విజయ్ తల్లి ఎంతో సంతోషంగా తలాడించిందే కాని ఇంటి ఆర్థిక పరిస్థితులు వారికి చెప్పలేదు కదా. గ్రామానికి 25 కిలో మీటర్ల దూరంలో ఉన్న పట్టణంలో విజయ్ ఇంటర్, డిగ్రీ చదువు పూర్తి అయింది. అన్ని స్థాయిల్లోనూ మంచి మార్కులతో ఉత్తీర్ణుడయ్యాడు. తర్వాత మాస్టర్ డిగ్రీలో చేరేందుకు హైదరాబాద్ నగరానికి రాకతప్పలేదు విజయ్‌కి. ఇది ఆయన తల్లి దండ్రులకు పెద్ద పరీక్షగా అయింది. అప్పుసప్పు చేసి నగరానికి పంపారు. అయితే హైదరాబాద్‌లోని ఉస్మానియా యూనివర్సిటీలో ఎంఎ కోర్స్ కోసం ప్రవేశ పరీక్ష రాయడం రిజల్టు కోసం మూడు వారాల పాటు ఎదురు చూడటం విజయ్‌కు ఇబ్బందిగానే గడిచింది. ఈలోగా తెలిసిన మిత్రుని ద్వారా ఒక ప్రయివేట్ కంపెనీలో చిన్న జాబ్ సంపాదించుకున్నాడు. ప్రవేశ పరీక్షలో మంచి మార్కులతో సీటు లభించడంతో కాలేజీలో ప్రవేశానికి మార్గం సుగమమం అయింది. ఎంతో చారిత్రక ఆర్ట్స్ కాలేజీలో పోస్టు గ్రాడ్యుయేషన్ కోర్స్‌లో తెలుగు పిజి చేయడం ఆయనకు ఎంతో గర్వకారణం అనిపించింది. రోజూ కాలేజీకి వెళ్లుతున్నాడు కానీ ఇంకా హాస్టల్‌లోకి అడ్మిషన్ లభించకపోవడంతో ఇబ్బందిగానే కాలం గుడుస్తున్నది. మరో కొద్ది రోజుల్లో హాస్టల్‌లో వసతి తోపాటు భోజన వసతి అంతా కొత్త వాతావరణం అయినప్పటికీ రోజులు హాయిగా గడిచిపోయాయి. అయితే కాలేజీ ఉదయం ఎనిమిది గంటలకే ప్రారంభమై మధ్యాహ్నం పన్నెండున్నరకే ముగుస్తున్నందున తన పాత ఉద్యోగాన్ని కొనసాగించాలనే నిర్ణయించుకున్నాడు. ఇప్పటివరకు హాస్టల్ లేనందున తన జీతం ఖర్చులకు సరిపోయేది. ప్రస్తుతం మిగిలిన డబ్బులు ఆమ్మనాన్నకు పంపియాలని భావించి చిన్న ఉద్యోగం అయినప్పటికీ దానిని కొనసాగిస్తూ వచ్చాడు. ఇది తనకు ఎంతో సంతృప్తినిచ్చేది. తన పిజి కోర్స్ పూర్తి అయ్యేవరకు కూడా ఉద్యోగం కొనసాంచారు. రిజల్ట్సు వచ్చాక ఆయన ఆనందానికి అవధిలేకుండా పోయింది. ఫస్టు క్లాస్‌లో ఆయన ఉత్తీర్ణులు కావవడంతో సహచర విద్యార్థలు అభినందనలతో ముంచెత్తారు. తర్వాత ఎం.ఫిల్, పిహెచ్.డిలకు ప్రయత్నాలు చేయాలని భావించిన్పటికీ ప్రముఖ పత్రికలో స్టాప్ రిపోర్టర్‌గా పనిచేసేందుకు లభించిన అవకాశాన్ని వదులు కోరాదని నిశ్చయించుకొని ఇప్పటివరకు చేస్తున్న చిన్న ఉద్యోగానికి రాజీనామా చేసి, విలేకరిగా బాధ్యతలు చేపట్టారు. తన సునిశిత వ్యాఖ్యానాలతో రోజు విజయ్ ఇస్తున్న వార్తలకు యాజమాన్యం సంతృప్తి వ్యక్తం చేసేది. ఉద్యోగంతో జీతం రావడంతోపాటు మంత్రులు, ఇతర రాజకీయ నాయకులతో ఏర్పడిన సన్నిహిత సంబంధాలు భవిష్యత్తులో ఆయన జీవితాన్ని మరింత మలుపు తిప్పుతాయని బహుశ విజయ్ అప్పుడు ఆలోచించి ఉండరు.
సార్ టీ తాగుదామా అంటూ డ్రైవర్ నారాయణ పలకరిండంతో విజయ్ తిరిగి వర్తమానంలోకి వచ్చారు. సరే అంటూ తలూపడంతో డ్రైవర్ చిన్న హోటల్ పక్కన కారును నిలిపారు. అయితే కారు ఒక్కసారిగా స్లో అయి ఆగిపోవడంతో ఈ కారును వెంబడిస్తున్న లారీ డ్రైవర్‌కు ఏమి చేయాలో పాలుపోక కొద్ది దూరం వరకు లారీని పోనిచ్చి నిలిపివేశారు. ఆగ్రాకు వెళ్తున్న రోడ్డు రద్దీగా ఉండటంతో తన లక్ష్యం నెరవేరలేదనే విచారంలో లారీ డ్రైవర్ పడిపోయాడు. మరికొద్ది దూరంలోనే ఆగ్రా ఉండటంతో తన ప్రయత్నాలను తాత్కాలికంగా ఆపి తర్వాతి పథకం ఆలోచిస్తూ ముందుకు కదిలాడు. ఈలోగా విజయ్ కూడా టీ తాగి కారు వద్దకు చేరుకోవడంతో అప్పటికే కారు సమీపంలో ఉన్న డ్రైవర్ డోర్ లాక్ తీసి ఓపెన్ చేయగా విజయ్ కారులో కూర్చున్నారు.
కారు నీ స్వంతమా అని విజయ్ ప్రశ్నించడంతో కాదు సర్, ఊబర్ వాళ్లది.. జీతం, ఇన్‌సెంటివ్ వస్తుంది.
హైదరాబాద్‌లోనూ ఊబర్ కార్లు ఉన్నాయి కదా ఇక్కడ ఎందుకు పనిచేస్తున్నావు.
బిఎ చదువుకున్న సార్.. ఢిల్లీలో రైల్వే డిపార్టుమెంట్‌లో నా మిత్రుడొకరు ఉద్యోగం ఇప్పిస్తానంటే ఇక్కడికి వచ్చాను. దీనికి ఆలస్యం అవుతుండటంతో సరదాగా నేర్చుకున్న డ్రైవింగ్ నేడు ఉపాధి కల్పిస్తున్నది. రైల్వే ఉద్యోగం రాకుంటే తిరిగి స్వంత నగరం హైదరాబాద్‌కు వస్తాను సార్. నా తల్లిదండ్రులు అక్కడే ఉన్నారు. నేను అక్కడికి వస్తే అమ్మనాన్నలు కూడా ఆనందిస్తారు.
సరే ఎప్పుడు హైదరాబాద్ వచ్చినా నన్ను కలువు. బిసి కార్పొరేషన్ ద్వారా లోన్ ఇప్పించి కారు స్వంతంగా కొనుగోలు చేసుకో.. నేను మాట సాయం చేస్తా..
చాలా థాక్స్ సార్. కొద్ది రోజుల్లో రైల్వే ఉద్యోగం సంగతి తెలుస్తుంది. మీరు తప్పక సహాయం చేస్తారని నాకు తెలుసు.
ఆగ్రా చేరుకున్న విజయ్‌కు ముఖ్యమంత్రి ఫోన్ కాల్ గుర్తుకు వచ్చింది. సాధ్యమైతే ఇదే రాత్రికి విమానంలో హైదరాబాద్ చేరుకోవాలని భావించాడు. ఈ మేరకు సమయ పాలన చేసుకోవాలని నిర్ణయించుకొని ఆగ్రాలో చూడాల్సిన ప్రాంతాలను సకాలంలో చుట్టి రావాలని అనుకున్నాడు. ముందుగా తాజ్ మహల్ సందర్శనకు వెళ్లాడు. తాజ్ అందాలకు ముగ్దుడవుతూ ఆ కట్టడంలో నైపుణ్యాన్ని అంచనా వేస్తూ పరిశీలించ సాగాడు. సాయంత్రమే బయలు దేరాలనే ఆలోచన రాగానే ఆగ్రాలోని మరికొన్ని దర్శనీయ స్థలాలకు వెళ్లి తొందరగానే పూర్తి చేసుకొని అక్కడే మధ్యాహ్న భోజనం చూడా చేసి తిరుగు ప్రయాణమయ్యారు. త్వరగా పోనియ్ అంటూ డ్రైవర్‌కు చెప్పి వెనకసీటులో విశ్రాంతి తీసుకోసాగాడు విజయ్.
కారు శర వేగంగా ఢిల్లీ వైపు వస్తున్నది. మరో 30 కిలో మీటర్లు ప్రయాణిస్తే కరోల్‌బాగ్ చేరుకొని తన లగేజ్ సర్దేసుకొని విమానాశ్రయానికి వెళ్లాలనే విజయ్ ఆలోచన డ్రైవర్ మాటలతో బ్రేక్‌పడింది.
సార్ ఈ లారీ ఉదయం మనం బయలు దేరినప్పటి నుంచి మన కారును వెంబడిస్తున్నట్లుగా అనుమానంగా ఉంది. కారణం ఏమై ఉంటుందో అర్థం కావడం లేదు. మనలను టార్గెట్ చేస్తున్నాడా నిర్ధారించుకునేందుకు కొద్ది సేపు ఆ కనబడే హాటల్ వద్ద కారు ఆపి టీ తాగుదాం సార్.
(సశేషం)