సెప్టెంబర్ 1 నుంచి విద్యాసంస్థలు పునఃప్రారంభం: మంత్రి సబితా ఇంద్రారెడ్డి
హైదరాబాద్ (CLiC2NEWS): సెప్టెంబర్ 1వ తేదీ నుంచి పాఠశాలలు పునఃప్రారంభించాలని తెలంగాణ సర్కార్ నిర్ణయించిన నేపథ్యంలో సన్నద్ధతపై మంత్రులు సమీక్ష నిర్వహించారు. మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావు మంగళవారం జిల్లాల కలెక్టర్లు, విద్య, వైద్యం, పంచాయతీరాజ్, పురపాలకశాఖ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ.. ఈ నెల 30 నాటికి విద్యా సంస్థల ప్రారంభానికి ఏర్పాట్లు చేయాలని పాఠశాలల యాజమాన్యాలను ఆదేశించినట్లు చెప్పారు. 65 లక్షలమంది విద్యార్థులు పాఠశాలలకు హాజరు కానున్నట్లు చెప్పారు. ఈ క్రమంలో తల్లిదండ్రులకు విశ్వాసం కల్పించాల్సిన అవసరం ఉందని మంత్రి అభిప్రాయపడ్డారు. ఈ మేరకు తల్లిదండ్రులకు వారి పిల్లల ఆరోగ్యం పట్ల విశ్వాసం కల్పించాల్సిన అవసరం ఉందన్నారు.
అధికారులు, ప్రజాప్రతినిధులను అప్రమత్తం చేసినట్లు తెలిపారు. ఈ విషయంలో స్థానిక ప్రజాప్రతినిధులంతా భాగస్వామ్యం కావాలని, సర్పంచులు బాధ్యత తీసుకోవాలని కోరారు. పరిశుభ్రతను నిరంతరం కొనసాగించాలన్నారు. ఈ అంశంలో ప్రధానోపాధ్యాయులు బాధ్యత తీసుకోవాలన్నారు.
ఆ బాధ్యత స్థానిక ప్రజాప్రతినిదులదే: మంత్రి ఎర్రబెల్లి
పాఠశాలలు శుభ్రంగా ఉండేలా చూడాల్సిన బాధ్యత స్థానిక ప్రతినిదులదేనని మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు స్పష్టం చేశారు. పంచాయతీల ద్వారా మాస్కులనుకొనుగోలు చేస్తామని.. ప్రతి విద్యార్థికి మూడు చొప్పున అందించాలని ఆదేశించినట్లు చెప్పారు. అలాగే పాఠశాలలు శుభ్రంగా ఉన్నట్లు హెచ్ఎంలు ధ్రువపత్రం ఇవ్వాలన్నారు. ఏఎన్ఎంలు, వైద్య సిబ్బందిని కూడా సిద్ధం చేసినట్లు మంత్రి పేర్కొన్నారు.