విజయుడు (ధారావాహిక న‌వ‌ల‌ పార్ట్‌-13)

ఎన్నికల సమయంలో ఈ ప్రముఖులందరూ నాకు ఎంతో సహకరించారు. పైగా ఎన్నికలంటేనే అధిక వ్యయంతో కూడిన వ్యవహారం అని స్వయంగా వారికి వారే ఆర్థిక సహాయం చేస్తామని ముందుకు వచ్చారు. ప్రజలతో నాకున్న పలుకుబడి కూడా వారికి తెలుసు. పైసా ఖర్చు లేకుండా శాసనసభ్యునిగా ఎన్నికయ్యాను. వారితో అనేక సమావేశాల్లో పాలుపంచుకున్నాను. విద్యా వేత్త కుటుంబరావు నాతో మరింత స్నేహంగా ఉంటున్నారు. ఆరుగురం మాత్రమే ఆనాడు నూతన సంవత్సరానికి స్వాగతం పలికేలా హోటల్‌లో కూర్చున్నాం. ఆ హోటల్ యజమాని పెద్ద మనిషి భుజంగరావు. పైగా హోటలర్స్ అసోషియేషన్‌కు అధ్యక్షుడు కూడా. వైద్య రంగంలో నేరుగా ప్రవేశం లేకపోయినా చిన్నప్పుడు చదువుకున్న బి.ఫార్మసీ సర్టిఫికేట్‌తో చిన్న మెడికల షాపుతో జీవితం ప్రారంభించి డ్రగ్స్ ఉత్పత్తి వరకు ఎదిగిన శేషగిరి రావు కూడా సంఘంలో పలుకుబడి ఉన్న వారే. మరొకరు లిక్కర్ వ్యాపారి షణ్ముఖరావు. మద్యం వ్యాపారంలో ఉన్నా మంత్రులతో సన్నిహిత సంబంధాలున్న వ్యక్తి. అక్రమాలకు పాల్పడుతున్నట్లుగా ఆయనపై నేరుగా ఎలాంటి ఆరోపణలు ఇప్పటివరకు బయటకు రాలేదు. ఇక మరో పోలీసు అధికారి డిసిపి ఠాకూరు ెదాలో ఉన్నారు. సివిల్స్‌లో సెలెక్టు అయి ఐఎఎస్ మిస్ కావడంతో పోలీసు సర్వీసును ఎంచుకున్న డిసిపి కొంత నిజాయితీ కలవారనే పేరుంది. స్వంత రాష్ట్రం కాకపోయినా మన రాష్ర్టంలో గత కొంత కాలంగా పనిచేస్తున్నారు. ఇతర పోలీసు అధికారులపై వస్తున్న విమర్శలు కూడా ఆయనపై నేను పత్రికల్లో చదవలేదు. అందరూ గౌరవనీయులే. వీరందరూ లేదా విడివిడిగా అయినా నాపై కుట్రపన్ని హత్య చేయించాలనే స్థాయిలో ఆలోచిస్తారనడానికి నాకు ఎలాంటి కారణం కనిపించడం లేదు. మరి ఎవరు ఆ లారీ డ్రైవర్‌ను పురమాయించింది. నేను ఢిల్లీకి వెళ్లిన విషయం మన ముఖ్యమంత్రికి తప్ప ఇతరులకు చెప్పాల్సిన అవసరం కూడా నాకు లేకపోవడంతో వారం రోజుల పాటు హస్తినలో ఉండి ఆయా పర్యాటక ప్రదేశాలు చూడాలని వెళ్లాను. చెప్పలేము ఈ అయిదుగురిలో ఎవరైనా నా వల్ల ఇబ్బంది పడి… ఏ రౌఢీకో సుఫారి ఇచ్చి హత్యకు పథక రచన చేసి ఉండవచ్చు. ఆ రౌఢీ గ్యాంగ్ నా రాకపోకలపై నిఘా పెట్టి ఢిల్లీకి వారి మనిషిని పంపించి ప్లాన్ చేసి ఉండవచ్చు. వారు నిజంగానే చేశారా? మరి ఎవరూ చేయకుంటే లారీ మా కారును పాలో చేసి తిరుగు ప్రయాణంలో రాంగ్ రూట్‌లో కావాలనే వచ్చి ఢీ కొనిదంటే తప్పకుండా అంతా ప్లాన్ ప్రకారమే జరిగింది. ఎవరు ఎవరు ఎవరు అంటూ ఆలచిస్తూనే ఆ రాత్రి విజయ్ నిద్రలోకి జారుకున్నారు.

మర్నాడు ఉదయం నిద్ర లేచిన తర్వాత యోగా, కసరత్తులు చేసి స్నానం చేసి కూర్చున్నా… తిరిగి తన హత్యోదంతమే గుర్తుకు వచ్చింది. పిఎ కు కూడా నా ఢిల్లీ టూర్ తెలుసు. ఆయన ద్వారా ఎవరైనా సమాచారం తీసుకొని ఉంటారా అని అనుమానం తలెత్తింది. వెంటనే తన పిఎ నగేష్ కు కాల్ చేశాడు. పిఎ ఫోన్ ఎంగేజీ రావడంతో కట్ చేసి ఆలోచనలో పడ్డాడు. మరోసారి కుటుంబరావుతోనే మాట్లాడితే కొంత సమాచారం లభించవచ్చు. నిన్ననే వెళ్లాను మళ్లీ వస్తానని ఆయనను అడిగితే బాగుండదు. నన్ను హత్య చేయించేందుకు కుట్ర పన్నిన వారు ఎవరో, ఎలా కనిపెట్టడం అంటూ పచార్లు చేస్తుండగా సెల్‌ఫోన్ రింగ్ అయింది. పిఎ నే కాల్ చేసి ఉంటారని భావిస్తూ కాల్ తీసుకోగానే మహిళ గొంతు వినబడింది. నాకు ఫోన్ చేసే స్త్రీ ఎవరా అంటూ ఆలోచనలో ఉండగానే… ఏమండీ, లైన్‌లో ఉన్నారా, ఫోన్ వినబడుతున్నదా? అంటూ అవతలి వైపు నుంచి ప్రశ్న.

ఆ మాటలు విజయ్‌కు ఎంతో మధురంగా తోచాయి. కంఠ స్వరం కొంత పోల్చుకోగలిగాడు. అప్పుడు హలో అనగానే చెప్పండి చూద్దాం ఎవరో న ఏను అంటూ అవతలి వైపు మహిళ ఉడికించే ప్రయత్నం చేసింది.

అదే ఆలోచిస్తున్న ఎవరిదీ ఈ తియ్యని గొంతు. మాటలే ఇంత సుమధురంగా ఉన్నాయంటే మనిషి ఎంత అందంగా ఉంటుందో ఊహిస్తున్నా.. ఏదీ మరోసారి మాట్లాడండి..మీ కమ్మని స్వరం పదేపదే వినాలని పిస్తున్నది.

ఏమండి మరీ అలా అంటే ఎలా.. ఫోన్‌లో రాంగ్‌కాల్స్ రావచ్చుగా.. ఇలా వచ్చిన కాల్స్ అన్నింటికీ మీరు పొగడుతూ పోతే ఏ అమ్మాయి అయినా ఏమనుకుంటుంది చెప్పండి. ఇప్పటికైనా నన్నుగుర్తుపట్టారా? అంటూ నవ్వింది. ఆ స్త్రీ.

ఏమో మీ మాటల తియ్యదనమే వినిపిస్తుంది తప్ప మీరు ఎవరో పోల్చుకోవాలనిపించడం లేదు. టెలిపోన్ ధ్వనిలా నవ్వేదానా అనే పాట మాత్రం గుర్తుకు వచ్చిందండీ ఇంతకు మీరు ఎవరు? నాకే ఫోన్ చేశారా ? అన్నాడు విజయ్

అయ్యో నేనండి, విరంచిని. నాన్నా దగ్గర మీ నెంబర్ తీసుకొని మాట్లాడుతున్నా.. సరేనా… నిజంగా వెరీసారీఅండి.. ఎవరో అనుకొని ఏదేదో మాట్లాడినా
మనస్సులోనే నవ్వుకుంటూ… సాయంత్రం మీకు వేరే ప్రోగ్రామ్స్ ఏవీ లేవుగా .. నాన్న గారు మిమ్ములను ఢిన్నర్‌కు రావాలని ఆహ్వానించమన్నారు.

ఓ.. నిన్ననే మీ కాఫీ తాగాను ఆ రుచి ఇంకా నా నోటిలో నానుతున్నది. మీరు భోజనానికి పిలిస్తే…ఇతర ఏపనులున్నా మానుకొని మీ ముందు వాలుతాను కాదు కాదు మీ ఇంట్లో వాలుతాను. ఎందుకో కానీ మీ ప్రస్తావన రాగానే నాకు మాటలు కొంత అధికంగా వస్తున్నాయి. సారీ

దానిదేముంది. అమ్మాయిలు కనిపిస్తే లేదా మాట్లాడితే అబ్బాయిలు ఇలాగే మాట్లాడుతారని కాలేజీ చదువుల సమయంలోనే అనుభవం. అందులో మీరు ఒకరని అనకుంటా అని గడుసుగా సమాధానం ఇచ్చింది విరంచి.

ఎంతమాట ఎంత మాట నేను కాలేజీ కుర్రాడిలో మిమ్ములను ఆటపట్టించే వానిలా కనిపిస్తున్నానా? నేను కాలేజీలో ఉన్నప్పుడు ఏనాడు కూడా అమ్మాయిలతో జాగ్రత్తగానే ఉండే వాన్ని. క్లాస్‌లో తక్కువ మంది ఉన్నా అందరం చనువుగా మాట్లాడుకున్నా ఎవరిని ఎప్పుడుకూడా నొప్పించి ఎరుగను. సబ్‌జెక్టులకు సంబంధించి ఏవైనా అనుమానాలుంటే వాళ్లు నా వద్దకు వచ్చి అడిగేవారు. అమ్మాయిల పట్ల ఎంతో మర్యాదగా ప్రవర్తిస్తానని నాకు మంచి పేరు కూడా ఉండేది తెలుసా.. బాధ్యత కలిగిన శాసనసభ్యుని నేను. అంటూ విజయ్ మాట్లాడుతుండగా.. మీకు మీరే సర్టిఫికేట్ ఇచ్చుకోవడం కాదు ఎంఎల్‌ఎ గారు. ఎదుటి వాళ్లు ఇవ్వాలి. నిన్న మాయింటి వద్ద మీరు నాపై చేసిన కామెంట్స్‌ను అప్పుడే మరిచిపోయారా? ముక్కు మొఖం తెలియని అప్పుడే చూసిన ఒక అమ్మాయిని అలాగే అంటారా? అది కూడా నేను వినేటట్లు. విరంచి గారు మీకు అప్పుడే సారీ చెప్పాను కదా. ఫ్రండ్స్ అనుకున్నాం. స్నేహితుల మధ్య కోపతాపాలుండరాదు సుమండి అని విజయ్ అనడంతో ఫోన్‌లో మరోసారి విరంచి…విరగబడి నవ్వింది. ఈనవ్వులోని మాధుర్యాన్ని గ్రోలుతూ విజయ్ మౌనంగా ఉండి పోయారు.

ఏమండి, ఫోన్ పెట్టేశారా..

లేదు మీ నవ్వు నన్ను అలా కట్టిపడేసింది, నాకు మాటలు పెగలడం లేదు మరి.

విజయ్ గారు ఎప్పుడు భావుకతలోనే ఉంటారా.. అవే మాటలా… అంటూ నవ్వింది విరంచి… సాయంత్రం త్వరగా ఇంటికి రండి. కాఫీ తాగుతూ మాట్లాడుకుందామని ఊరించి ఫోన్ పెట్టేసింది, విరంచి.

విజయ్ ఒక్కసారిగా మానసిక సంఘర్షణలో పడిపోయాడు. ఇప్పటివరకు ఏ అమ్మాయి పట్ల ఇలా చనువు తీసుకోని నేను విరంచి విషయంలో ఎందుకో అలా మారిపోతున్నాను. పరిణతి చెందిన చదువుకున్న అమ్మాయి కావడంతో అపార్థం చేసుకోవడం లేదు విరంచి. మరోసారి అలా జరగకుండా జాగ్రత్త పడాలని మనస్సు సరిపెట్టుకున్నాడు. ఏమైతేనేమి విరంచి ఫోన్ చేసి మంచి పనిచేసింది. కుటుంబరావు ఇంటికి మరోసారి వెళ్లి హత్యోందతంపై కూఫీలాగాలని అనుకున్నాను కానీ, వెంటనే మరోసారి వస్తానని అడగడం బాగుండదనుకొన్నాను, ఆమె ఫోన్ చేయడం కలసి వచ్చిందని, ఢిన్నర్‌కు వెళ్లాలనే నిర్ణయించుకున్నాడు.

కుటుంబరావుతో తన ప్రమాదం గురించి ఎలాంటి ప్రస్తావన తేకుండా పరోక్షంగానే ఎలా వివరాలు రాబట్టాలో కార్యాచరణ ఎలా ఉండాలో విజయ్ ఆలోచనలో పడ్డాడు.

(సశేషం)

త‌ప్ప‌క‌చ‌ద‌వండి: విజయుడు (ధారావాహిక న‌వ‌ల‌ పార్ట్‌-12)
Leave A Reply

Your email address will not be published.