సింగరేణి కాలనీ ఘటన బాధాకరం: మంత్రి కెటిఆర్‌

హైదరాబాద్‌ (CLiC2NEWS): సైదాబాద్​లోని సింగరేణి కాలనీలో ఆరు సంవత్సరాల చిన్నారిపై అత్యాచారం, హత్య చేసిన ఘటనతో తను తీవ్ర మనస్తాపానికి గురయ్యానని ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్​ తెలిపారు. ఈ ఘటన చాలా బాధాకరమని, నేరస్తుడిని గంటల వ్యవధిలో అరెస్టు చేసినట్టు ట్విట్టర్‌ ద్వారా తెలిపారు. బాధిత కుటుంబానికి త్వరగా న్యాయం చేయాలని హోం మంత్రి మహమూద్ అలీ, డీజీపీని కోరారు.

హైదరాబాద్‌ సైదాబాద్‌ సింగరేణి కాలనీలో ఓ కిరాతకుడు ఆరేళ్ల చిన్నారిని అత్యాచారం చేసి హత్య చేశాడు. యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడురుకు చెందిన రాజుకు వివాహమైంది. ఆరు నెలలుగా సైదాబాద్​లోని సింగరేణి కాలనీలో నివాసం ఉంటున్నాడు. చెడు వ్యసనాలకు బానిసైన రాజు వేధింపులు తట్టుకోలేక.. భార్య అతడిని వదిలి వెళ్లిపోయింది.

కాలనీకి చెందిన ఓ చిన్నారి గురువారం సాయంత్రం నుంచి కనిపించకుండా పోయింది. దీంతో తల్లిదండ్రులు చుట్టుపక్కల అంతా గాలించారు. రాత్రయ్యే వరకూ ఆచూకీ తెలియకపోవడంతో ఆ ఏరియాలో జులాయిగా తిరిగే ఆటో డ్రైవర్‌ రాజుపై స్థానికులకు అనుమానం వచ్చింది. దీంతో అతడే పాపను ఏమైనా చేశాడేమోనన్న అనుమానంతో అర్ధరాత్రి సమయంలో ఇంటి తలుపులు పగలగొట్టి చూడగా బాలిక విగతజీవిగా పరుపులో చుట్టి ఉంది.

ఈ ఘ‌ట‌న‌పై కుటుంబ‌సభ్యులు, స్థానికులు చంపాపేట నుంచి సాగ‌ర్ వెళ్లే రోడ్డులో దాదాపు 7 గంట‌ల పాటు భైఠాయించారు. క‌లెక్ట‌ర్ హామీతో ఆందోళ‌న విర‌మించారు. ప్ర‌భుత్వం త‌ర‌ఫున బాధిత కుటుంబాన్ని ఆదుకుంటామని క‌లెక్ట‌ర్ హామీ ఇచ్చారు.

కాగా చిన్నారి మృత‌దేహానికి ఉస్మానియాలో పోస్టు మార్టం పూర్తిచేశారు వైద్యులు. అత్యాచారం చేసి గొంతు నులిమి చిన్నారిని హ‌త్య చేసిన‌ట్లు పోస్టుమార్టం నివేదిక‌లో వెల్ల‌డ‌యింది.

Leave A Reply

Your email address will not be published.