మండ‌పేట‌లో ఘనంగా విశ్వకర్మ జయంతి వేడుకలు

మండపేట (CLiC2NEWS): మండ‌పేట‌లో ఘ‌నంగా విశ్వ‌క‌ర్మ జ‌యంతి వేడుక‌లు నిర్వ‌హించారు. భగవాన్ శ్రీ విరాట్ విశ్వకర్మ జయంతి ఉత్సవాలను పురస్కరించుకుని మండపేట మండలం, మండపేట విశ్వబ్రాహ్మణ సంఘాల ఆధ్వర్యంలో శుక్రవారం వైభవంగా నిర్వహించారు. పట్టణంలోని పురాణ ప్రసిద్ధి చెందిన శ్రీ కామాక్షి ఏకామ్రేశ్వర స్వామి వారి దేవస్థానం వద్ద మణు, మయ, తృష్ట, శిల్పి, విశ్వజ్ఞ పంచ వృత్తుల విశ్వబ్రాహ్మణులు పాల్గొని జెండాను ఆవిష్కరించారు. విశ్వకర్మ చిత్ర పటాన్ని ఏర్పాటు చేసి పుష్పాలు అలంకరించి భక్తి శ్రద్ధలతో పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఆలయ ప్రధాన అర్చకులు బంటుమిల్లి చంద్రశేఖర్ స్వామివారికి విశేష పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీ కామాక్షి వడ్రంగి యూనియన్ గౌరవ అధ్యక్షుడు వేముల శ్రీరామమూర్తి మాట్లాడుతూ విశ్వకర్మ చరిత్రను వివరించారు. ముక్కోటి దేవతల కంటే ముందే అవతరించిన పుణ్య పురుషుడు భగవాన్ శ్రీ విశ్వకర్మ అని అన్నారు. సకల దేవతలు కొలువైన ఆది దేవాలయాలు అన్నీ కూడా ఆయన నిర్మించినవేనని పురాణాలు చెబుతున్నాయని అన్నారు. దేవతల గురువైన భగవాన్ విరాట్ విశ్వకర్మ సైన్సు కూడా కనిపెట్టలేని ఎన్నో అద్భుతమైన కట్టడాలు సృష్టించారని తెలిపారు. ఆయన దేవతలచేత కూడా పూజలు అందుకున్నారన్నారు. చేతి వృత్తి దారులకు ఆరాధ్య దైవం విశ్వకర్మ అన్నారు. సైన్స్ ఇంతగా అభివృద్ధి చెందినప్పటికీ విశ్వకర్మ సృష్టించిన అధ్భుత కట్టడాల నిర్మాణ శైలిని ఇప్పటికీ కనిపెట్టలేక పోయారని పేర్కొన్నారు. కార్యక్రమంలో కామాక్షి వడ్రంగి యూనియన్ అధ్యక్షుడు కోటిపల్లి కృష్ణమాచార్యులు, ఉపాధ్యక్షుడు గోడి సుబ్రహ్మణ్యం, కార్యదర్శి దార్ల నాగు, సంయుక్త కార్యదర్శి రామోజు కృష్ణ, కోశాధికారి అరిపిరాల నానాజీ, మండల విశ్వబ్రాహ్మణ సంఘం కార్యదర్శి ఒంపోలు పోలరాజు, నాయకులు పట్నాల శ్రీను తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.