అడ‌విలో ఆ ఏడుగురు..

అనేకానేక దూరపు ప్రదేశాలు తిరుగుతుంటారు, వాటి గురించి అనుభూతులను, అనుభవాలను పంచుకుంటారు. ఖరీదైన ఖర్చులు చేసి ప్రయాణాలు చేస్తుంటారు. కానీ అందుబాటులో ఉన్నవి వాటిని చూడడంలో ఆనందంలో వేరే.

“యాత్ర అంటే ప్రఖ్యాత స్థలాలకు వెళ్లి ఫోటోలు దిగడం కాదు-ఏ ప్రదేశం కెళ్ళినా దాంట్లో కలిసిపోవడం”

నాలుగురోజుల కిందా ఏడుగురు సాహసికుల యాత్ర అనుభవం, ఉద్వేగాలను జీవితానికి , సుఖమూ అర్ధమిస్తాయని తెలుసున్న యాత్రికులు.

కరోనా తర్వాత ప్రపంచం మొత్తం ప్రకృతి వైపు ప్రయాణం చేయాలనే ధోరణి పెరిగింది.కొందరు ఇంకా తప్పని పరిస్థితుల్లో పట్టణాలలో చిక్కికుపోయారు. మరికొంతమంది ఫలాయనం చెందుతున్నారు.

అక్కల చంద్రమౌళి సినిగీతరచయిత, సంతోష్ పడాల ,సినియర్ జర్నలిస్టు, సురేష్ చౌద‌రి (వెలుగు రిపోర్టర్), రవి సాక్షి, వెంకటేష్ ఇట్యాల (ప్రభుత్వం ఉద్యోగి, రచయిత), వెంకట్ (అర్టిస్ట్) , రామ్ ప్రసాదు ఈ ఏడుగురు సాహస‌ పిపాసులు గత ఐదేళ్లుగా మంచిదోస్తులే. యాత్రికులంతా మంచిర్యాల పట్టణానికి అతి సమీపంగా జీవనం సాగీస్తున్నవారు. వ్రృత్తి రిత్యా ఒత్తిడిలు కలిగిన వారే.

ముప్పైదు పైబడిన అటు ఇటు వయస్సంతే, చాలా ఉషారుగా ఉన్నారు. ఒకరు చేయి ఒకరు పట్టుకుని దుర్గమారణ్యంలో ప్రవేశించడానికి సిద్దమైనారు

గత రెండు రోజుల ముందుగానే సంతోష్ పడాల, తెలంగాణ టుడే , ఇంగ్లీష్ పేపర్ సినీయర్ జర్నలిస్టు, మంచిర్యాల. ఈ సాహస యాత్రకు శ్రీకారం చుట్టాడు.అందులో ఇంట్రెస్ట్ గల వారిని యాత్రకు సంసిద్ధత చేశారు.

తేదీ పదునాలుగు, మంగళవారం రోజూ, ఉదయం ఆరుగంటలకల్లా గాంధారికి చేరాము. మా కన్నా ముందే అడవుల్లోని చెట్లమీద నిద్రలేసిన పక్షులెక్కా ఆ కోమ్మ ఈ కోమ్మకు ఎగిరే తీరుగా మనసులను అడవితో మమైకం చేసుకున్నాము.పొద్థున్నే ఎన్ని రకాల పక్షులో, ఎన్నెన్నో వన్నెల పక్షులో లెక్కనే లేదు. పిచ్చుకలు, పాలపిట్టలు, కొంగలు, పెద్దముక్కు కొంగలు, పెద్ద పెద్ద చిటారుకొమ్మల్లోనా నీటి ఒడ్డున, నీటిలోన సంచరించేటివి కనబడుతున్నాయి. ఉల్లాసమైన కూజితాలకు చెవులు ప్రతిధ్వనిగా మారింది. మేము ఆ తోవ గుండా పోతుంటే మనిషి ఉనికిని గమనించలేదు.మా వైపు కన్నైతైనా చూడవు.

కుందేళ్ళ గుంపు కనబడింది.క్షణం సేపు గడిచింది.

ఇదివరకైతే వందలు, వేల మంది గాంధారి ఖిల్లా అభిముఖంగా కొండపైకి ఎక్కి ఆనందిచ్చినవారున్నారు. కానీ జంగిల్ ట్రెక్కింగ్, మరియు సాహసయాత్ర ఎవరు చేయలేదన్నది నిజం.

ఇపుడు చేసే సాహస యాత్ర ఉత్కంఠ భరితమైనది, కొంచెం కష్టతరమైనదని మాకు తెలుసు. ట్రెక్కింగ్ ఇరవై కిలోమీటర్లు ఉంటుంది ఇది గాంధారి ఖిల్లా వెనుక భాగంలో దట్టమైన అడవుల్లో , కొండల్లో, పారే సెలయేరు, భయం పుట్టె శబ్దంలో ప్రయాణం చేయడం. రెండు పక్కలా కొండల పానుపులపై కీకారణ్యంలో, దారికటూ ఇటూ మార్గమంతటా ఎగుడుదిగుళ్లు, మధ్యలా రాళ్లు గుట్టలమీద గలగల ప్రవహించే కొండవాగులు, చెట్లనిండా పువ్వు లు గుత్తులు గుత్తులుగా వేలాడుతున్నాయి. చెట్ల తలలనిండా విరబూసిన పువ్వులు, వర్షాకాలంలో ఇంకెన్ని అడవి చెట్లు, ఎన్నెన్నో రకాల పువ్వులు విరగబూసాయి

పదిరోజుల ముందే అక్కల చంద్రమౌళి, సంతోష్ పడాల ,శ్యామ్ అడవిలోలోపల దారులలో మైళ్ళదూరం ట్రెక్కింగ్ ప్రయాణం చేసి అనుభవముంది అయినా అడవెప్పుడు చిక్కుముడులనే చూపిస్తుంది. అంతుచిక్కని ప్రశ్నలే వలయాలే తీరులాగా మారుస్తుంది.

కాకతీయుల మేడ చెరువు కనుచూపు మేరంతా నీటితో అలుముకుంది. చెరువుకానుకొని అద్భుతమైన కొండలే,గుట్టల శిఖరాగ్రకొన అంతా తెల్లటి పొగమంచు తోటి దుప్పటి కప్పుకుంది. ఆ ద్రృశ్యం చూస్తుంటె కొండపైకి ఎక్కి పొగమంచు తాకాలన్న ముచ్చటెసింది. ఇంతకు ముందు చెరువును అవలీలగా దాటి పోయే వీలుండేది. ఈ సారి అధిక వర్షం కారణంగా దాటడం కష్టమైంది. అయినా చాకచక్యంగా దాటాము అంతకష్టమేమి కాదు.

ఎసిసి, పరిశ్రమలు,బొగ్గుగనులు చూసిన కనులు ఇపుడు పచ్చని పచ్చదనం రంగు తప్పా కంటికేమి కనబడటం లేదు. రోజూ గంటలకొద్ది ఎల్ ఈ డి, టి.విలు డిజిటలో వస్తువుల చూపుతోనే కండ్లకు అలసత్వం ఆవరించింది.ఇప్పుడు కండ్లు ఆనంతానంత ప్రకృతి ద్రృష్టిలో ఒక్కసారి చూపుకి, మనసుకి జీవత్వం వచ్చింది.

ఒక్కసారి అడవిలో అడగడుగు కదులుతుంటూ లేలేత టేకాకులు రమ్మని పిలిచాయి. అందరు నిశబ్దంగా ఉంటే నేను మాత్రం గలగలమని అడవితోటి,మనుషుల తోటి మాట్లాడుతున్నాను. ఎనకచ్చేవారు దానికి ఊ.. అంటున్నారు. అడవి సంబంధించిన కొమురం భీం,వసంత గీతం, అడవి, సాహిత్యం, నవలల గత రెండెండ్లుగా చదువుతున్నాను. అడవంటే ఇష్టమై తిరుగుతున్నాను. దాన్ని అర్ధం చేసుకోవడంలో నేనింకా పరిణితి చెందలెని తెలుస్తోంది.
నాకొన్ని సందేహాలు ఉన్నాయి.

ఆల్లం రాజయ్య రాసిన “అడవి మీద మనకు ఆకాంక్ష తప్పితే ఖచ్చితమైన అభిప్రాయం జ్ణానమేమి లేదన్న”ఆ మాటలు నన్ను నిలుసోనిత్తలేదు.ఏడ కూసోత్తలేదు. అది నాకు అర్ధం కావట్లేదు అని కిషన్ సార్ లోలోపలది గూడుకట్టుకుని ఉన్నది ఆయనతో సెప్పినాను.

“ఆయన అడవిని మనం రోమాంటిక్ సైజ్ చేసి మాత్రమే చూస్తంగానీ,వాస్తవంగా చూడము కదా అని బదులిచ్చాడు”

అలా అనేక ప్రశ్నలు జవాబులు అడవిలో దొరికినాయి అనిపించింది. మేమంతా ఒక దగ్గర కలవడానికి ప్రక్రృతి గట్టిగానే కుట్రపన్ని కలిపిందనీ నాకర్ధమైంది.

చిన్న సెలయేరు సంగీత కచేరి పాడుతున్నట్టూ, మమల్ని అనుసరిస్తూ పలకరిస్తూ ఉంది. మాకెదురుగా కిందివైపు జారుతుంది.దానికి ఎదురుగా మా తోవ కదిలింది.అలా సెలయేరు తోటి మూడు కిలోమీటర్లు ట్రెక్కింగ్ జరిగింది.అపుడూ మేమంతా బాల్యంలోకి తొంగిచూశాము.రకరకాలుగా పాదాలకు నీరు తగులుతుంటే ప్రాణం లేచిచ్చిన తీరాయే.

సెలయేరు నీటిలోన ఆడుతూ,పాడుతూ తుళ్ళుతూ, గెంతులేస్తున్నారు. దాని తోవ‌ జాడలోనే ఎత్తైన జలపాతమనీ ఆచూకీ చూపగలదనీ మాకు ముందు ఎరుకే , కానీ ఆ సంగతి మిగతా వారికి తెలియదు.

స్వచ్చమైన ప్రాణవాయువును అతి స్వచ్ఛమైన అరణ్య వ్రృక్షాల మీద నుంచి సభ్యసమాజం నాగరికత సోకని ప్రదేశంలో తిరుగుతున్నాము. అడవి మమల్ని ఆవహించింది.

మంచిర్యాల పట్టణానికి ఏమాత్రం సంబంధం లేకుండా, కనుచూపు మేర వ్యాపించిన అడవి, భయంకరమైన ఏకాంతం కానీ ఇంటిమీద బెంగెవరికి లేదు.

క్రమ‌క్రమంగా మార్గానికి రెండు పక్కలా అడవి మరింత దట్టమౌతోంది.మార్గం కనబడకుండా చెట్లుకోమ్మలూ క్రమ్మేసాయి.చూపులన్నీ అన్వేషణ తీరుగానే మారాయి.అక్కడక్కడ ఎత్తైన గుబురుగా ఉన్న పొదల మధ్యన అడవిపందుల సమూహం ఆనవాళ్లు కనబడ్డాయి.అవి దాటుకుని పోయాము.అడవిలో మానవీయ కోణం స్రృశించే పాత్రలే ఎదురౌతున్నాయి.

వర్షాకాలంలో అడవులు,చెట్లు ఆనందోత్సాహాలతో ఇతరులను కూడా ప్రేరేపిస్తాయి. అడవిలోపల సాగుతుంటే ఆకులు, రెమ్మలు, ఫలపుష్ఫాలు, చెట్లు,పుట్టలు స్వయంగా సందేశమిచ్చాయి.

స్వేచ్ఛా వాతావరణాన్ని ఊపిరితిత్తులకు పరిచయం చేసుకుంటూ సెలయేరులా దారులూ దాటి కొంచెం ఎడమవైపు ప్రయాణం చేస్తున్నాము.

భయంకరంగా ఒకేసారి కుక్కలు అతిభయంకరంగా మొరిగాయి. నాకనిపిచ్చింది మేకల కాపారి కావచ్చనీ, మీదమీదకు కుక్కలు భౌ భౌ మంటూ ఎగబడేందుకు తయారుగున్నాయి. అయినా మా చేతుల్లో కంకబొంగుల కర్రలుండటం చేత ధైర్యమనిపిచ్ఛి కదిలాము.

అకస్మాత్తుగా నలుగురు ఆదివాసి నాయక్పోడ్ వంశస్థులు ఇతనే గాంధారి ఖిల్లా పూజారనీ వెంకట కిషన్ అందరికి పరిచయం చేసాడు.. వారితో ఒక ఫోటో దిగాము.

ఆ నలుగురు పొద్దున తెల్లారక ముందే నాలుగు గంటలకే అడవికచ్చినట్టుంది. కంకబొంగులను చీలుస్తూ, వాటిని కట్టగడుతున్నారు. వంటసామాగ్రి కూడా ఉంది. అవి మైదానం ప్రాంతంలో అమ్ముకుని డబ్బు సంపాదించుకుంటారు. జీవనం సాగిస్తారు

అందులో ఒకాయన నడీడు మనిషి,ఎటూబోతున్నారు ఈనంగబోతే మస్తు దూరమైతది. సెలయేరు తోవతోటి కుడికి పోతే బాగ దగ్గరైతే అని చెప్పడంతో సంతోష్ పడాల టీం సభ్యులు దారి మలిపిండు.

కొన్ని ఏకరాల గడ్డిమైదానం మచ్చింది.గడ్డిమైదానం మీద సూర్యకాంతి కిరణాలు బంగారు తీగలాగ పడి అడవిమీద పడుతున్నాయి. ఇలాంటి ప్రపంచంలో తిరుగుతామనీ నేననుకోలేదు. అందరికి ఉత్సాహం ఇచ్చింది.

కొండవాలు దిగగానే లోయల్లో వై ఆకారం గల ప్రదేశం కనిపించింది. దానికి మేమంతా” వై-వ్యాలీ”నామకరణం చేశాము.

అది దాటంగనే దగ్గరగా చెవులకు జలపాతం బొయ్యిమని శబ్ధం వినిపించింది కానీ ఆ కొండల మధ్య , లోయల్లో దాన్ని గురుతు పట్టడం దాన్ని చేరడం అంతా సులభమేమి కాదనీ ప్రయత్నం పూర్వకంగా అర్ధమైంది.ఎంతకాలం నుంచి,ఎన్ని యుగాల నుంచి ఈ కొండలు , లోయలో ఇలాగే ఈ రీతిలో ఉన్నాయో!

ఎంత ప్రకృతి ఆరాధకులం కాకపోతే వరుసగా రెండూ గంటలు నుంచి నడుస్తునే ఉన్నా కించిత్ ముఖం మీద చిరునవ్వు పోలేదు.. ఇక్కడ అడవి కాచిన వెన్నెల వ్యర్థం కాదు.

ఇంకా విమానాలు, రేడియో ధ్వనులు, తాజ్మహల్, విద్యుచ్ఛక్తి, దర్బారీ కన్నడ రాగాలు కంటే‌ ఎన్నో వేలెండ్ల ముందే ఆదిమ జాతులు ఇదే అడవుల్లో జీవనం సాగించారు.అదే అడవిలో మా ప్రయాణం.

గొండు, కొలాం, పరదాన్, తోటి, నాయక్ పోడుల ఉన్న అడవుల్లో ప్రయాణించడం అటు అవతల దాటితే కుర్రేగడ్, మంగీ,దేవాపూర్,తిర్యాణి, అర్జున్ లొద్ది అడవులే దగ్గరగా ఉన్నాము.

ఎంతటి గాఢ ప్రశాంతగా ఉంది!ఎంత అద్భుతంగా ఏకాంతం!ముందుకు పోవాలని అనిపించడం లేదు.

నిండు హ్రృదయంతో చూచిన దాని మనసులో హత్తుకుంటున్నారు. ప్రతిక్షణం విహారానుభూతి స్వయంగా అనుభవిస్తున్నారనే వారి కళ్లలో చూస్తే తెలిసే సత్యమిదే.

రాత్రివేళలో ఎలుగుబంట్లు తప్పకుండా తిరుగుతాయి.అడవి దున్నలున్నాయి.
పెద్దపులి అయితే కనబడలేదు కానీ,వనదేవతలు గాఢరాత్రి జలము కోసం నిజంగానే భూమికి దిగివస్తాయని ఆ రోజున అనిపించింది.

ఏడుగురు యాత్రికులు ఆకులను,రెమ్మలనూ రెప్పవాల్చకుండా తనివితీరా ఆస్వాదిస్తూ ప్రతిక్షణం ఫోటోలలో బందిస్తున్నారు. సెలయేరు గుండా పోతావుంటే ,పోతావుంటే ఒక మిరాకిల్ గోచరించింది.కుడివైపున యాభై అడుగుల ఎత్తులో చతురాస్త్రాకారాల్లో, నిటారుగా నునుపుగా గోడకట్టిన తీరుగా కొండచెక్కి తోలిచినదిగా సాపుగా ఉంది. మహాద్భుథమైన కొండ ఆ చిత్రాన్ని ఏ కళాకారుడు స్రృష్టించాడో ఈ అడవిలో అనిపించింది.

ఆ చిత్రం మమల్ని ఓ గంటసేపు అక్కడ నుంచి పోనీయ్యలేదు. అయినా గమ్యం వేరు కాబట్టీ అక్కడ నుంచీ వెళ్ళక తప్పని పరిస్థితి.

ఇపుడు ఏటవాలు కొండవైపుగా ప్రయాణం మరికొద్ది సేపట్లో అడవిలోని అందమైన జలపాతం చేరుకుంటామనీ నేనన్నాను. ఇంకా‌ నలభైనిముషాల తోవ ఉంది.

ఆ తోవలో రంగు రంగుల అడవి గునుగుపూలు, ఆయుర్వేద ఆకులు కొంతమంది గుర్తుపడుతున్నారు. మరికొంతమంది తెలుసుకునే పనిలో ఉన్నారు.

అడవంతా కలియ తిరుగుతుంటే ప్రక్రృతిమాత ఒడిలోని గాఢత ఏమిటో అర్ధంచేసుకోగలుగుతాము. ఈ అడవి ఆత్మల మీద పొరలను తొలగిస్తుంది ఈ ప్రయాణంలోనూ.

జలపాతం దగ్గర ఒక జువ్వి చెట్టు ఉంది.కొంతసేపు మౌనంగా కూర్చుని సేద తీరారు. ఇరవై మీటర్ల దూరంలోనే చేరాలసిన జలపాతం ఉంది.

కోండెక్కి దిగిన వాలు లోయలో జలపాతం పడుతూనే ఉంది.రెండు గంటల నడక ఒక జలపాతం చుక్క చెమటను తుడిచింది. యాభై అడుగుల ఎత్తు నుండి కొండ లనుండి, నునుపైన బండరాళ్లు మీద నుంచి పాలనురగలతోటి క్షీరము వలే,పాలధారవలే పడుతుంది.

“నడిచి నడిచి, ఏమైతైనేం చివరకు జలపాతం చేరుకున్నాము. డిప్ అండర్ స్టాండింగ్ రియాలటీ తెలిసింది.

జలపాతంలో పచ్చని ప్రకృతిలో పొద్దున్న నుంచి రెండు గంటల వరకు గడిపాము.వేళ మించిపోతోందనీ ఇంక రెండు మైళ్లు వెనక్కి బయలుదేరి ఇళ్ళకు బయలు దేరాము. మళ్ళీ వెన్నెల రాత్రుల్లో ఒక రాత్రంతా హాయిగా అడవిలో, ఎత్తైన జలపాతం మధ్యలో గూడారం ఏసుకుని ముచ్చట్లతో మరికొద్ది రోజుల్లోనే ఆ మరో యాత్రకు కొనసాగింపుగా ఉంది

ఆ సాహస యాత్ర ఎన్నటికి,ఎప్పటికీ మరిచిపోలేనిది.

-అక్కల చంద్రమౌళి
సినిమా గీత రచయిత
(19 సెప్టెంబ‌రు 2021)

Leave A Reply

Your email address will not be published.