బైకును ఢీకొట్టిన పాల వ్యాన్.. గన్‌మెన్ దుర్మరణం

మంచిర్యాల (CLiC2NEWS): జిల్లాలోని జైపూర్ మండలంలో అర్ధరాత్రి రోడ్డుప్రమాదం చోటుచేసుకుంది. విధులు ముగించుకుని ఇంటికి వెళ్తున్న పెద్దపెల్లి కలెక్టర్ గన్‌మెన్ గురువారం రాత్రి 11.30 గంటల సమయంలో రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు.
పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. మండలంలోని ఇందారం చెక్‌పోస్టు వద్ద గురువారం అర్ధరాత్రి ఓ పాల వ్యాను ఓ మోటారు సైకిల్‌ను బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. మృతుడిని మంచిర్యాల జిల్లా హమాలివాడకు చెందిన మల్లేశంగా గుర్తించారు. మల్లేశం.. పెద్దపల్లి జిల్లా కలెక్టర్ గన్‌మెన్‌గా పనిచేస్తున్నాడని తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.