విజయుడు (ధారావాహిక న‌వ‌ల‌ పార్ట్‌-34)

34. ముఖ్యమంత్రి మాయాజాలం

ముఖ్యమంత్రి జానకి రామయ్య కూడా ఏ కార్యక్రమం పెట్టుకోకుండా విజయ్‌తోపాటు లంచ్‌ చేయడానికి వేచి ఉన్నారు. మధ్యాహ్నం విజయ్‌ బంగ్లాకు చేరుకొని సిఎంకు విష్‌ చేసి తర్వాత అమ్మ కాళ్లకు నమస్కారం చేసాడు. కలసి భోజనం చేసే సమయంలో అన్నపూర్ణమ్మ తిరుపతి ప్రయాణం గురించి చెప్పింది.

నాకు కుదరదేమో అమ్మ, అసెంబ్లీ కదా, ఇరిగేషన్‌ శాఖపై చర్చ, నేను లేకుంటే బాగుండదు. ఎలాగమ్మా.
కాదురా విజయ్‌, ఎన్నాళ్ల నుంచో అనుకుంటున్నా, మీ సార్‌ విమానంలో టికెట్టు బుక్‌ చేయిస్తున్నాడు. రేపు ఉదయమే పోయి తొందరగా తిరిగి రావచ్చు, పోదామురా అంటూ దీర్ఘం తీసింది అమె.

మీ అమ్మ ఎప్పటి నుంచో అడుగున్నది విజయ్‌, ఈ సమయంలో వెలితే మంచిదట. నేను తోడుగా వెళ్లడం సబబు, కానీ నీకు తెలుసుకదా ఇలాంటి సమయంలో అసెంబ్లీ వదిలి నేను వెళ్తే ఎంత రసాభాస అవుతుందో… నీవు రాకపోయినా పర్వాలేదు లే. ఎంఎల్‌ఎలు రోజూ సభకు రావడం తప్పనిసరి కాదుగా… ఒకటి రెండు రోజులే కదా అమ్మకు తోడుగా వెళ్లిరా, నీవుంటే అమ్మతో ఉంటే నాకు భరోసా. అక్కడ ఏ లోటు రాకుండా మంచిగా చూసుకుంటావని. అంటూ తన పిఎకు కాల్‌ చేసి రెండు టికెట్టు, అమ్మకు, విజయ్‌కు బుక్‌ చేయి, తిరుపతికి అంటూ పెట్టేసాడు.

విజయ్‌ మరో మాటకు అవకాశం ఇవ్వకుండా భోజనం టేబుల్‌ వద్దనే ఆదేశాలిచ్చి, తాఫీగా కూర్చున్నాడు సిఎం. ఇరిగేషన్‌ కుంభకోణంపై తాను లేవనెత్తిన అంశం సభలో చర్చకు వస్తుండగా తానే గైర్‌హాజరైతే అపార్థాలకు తావిచ్చినట్లు అవుతుందనే …
ఆందోళనలో విజయ్‌ ఉన్నాడు. ఇప్పటికే విపక్ష నేతలకు లంచాలిచ్చి, మ్యానేజి చేశారని ఆధారాలతో సహా మీడియాలో వచ్చింది. నేను లేకపోతే…నాకు ఇదే చెడ్డపేరు వస్తుందేమోననే సందేహం కూడా వచ్చింది.

అసెంబ్లీకి నేను రాకుంటే బాగుండదేమో సార్‌ అంటూ నసిగాడు విజయ్‌, తన ఇబ్బందిని ముఖంలో కనిపించకుండా.

పర్వాలేదు విజయ్‌, నేను చూసుకుంటా అన్నాడు ముఖ్యమంత్రి.

విజయ్‌కు మొదటిసారిగా సిఎంపై అనుమానం వచ్చింది. అన్నీ తెలిసి నన్ను తిరుపతికి పంపడంలో ఆంతర్యం ఏమిటా అని ఆలోచించాడు. అమ్మ మాటను కాదనలేడు అందుకే ఇలా పంపిస్తున్నాడా అనే సందేహంలో పడిపోయాడు. సరే ఏమైతే అది అవుతుందని వెళ్తాను సార్‌ అని సిఎంవైపు తిరిగిన విజయ్‌కు ఆయన ముఖంలో ఎక్కడలేని ఆనందం కనిపించింది.

నీకు పెళ్లి అయి, భార్యతో పాటు ముగ్గురం వెలితే ఎంత బాగుంటుందో కదా అంటూ తిరుపతికి విమానం ఎక్కుతూ అన్నపూర్ణమ్మ అంది.

పెళ్లి గురించి ఇప్పుడే ఆలోచన చేయడం లేదమ్మా. మళ్లీ ఎన్నికల తర్వాతనే వివాహం చేసుకోవాలని అనిపిస్తున్నది. పెళ్లి అయితే కొంత సమయం ఇంట్లో తప్పక గడపాలి కదా, అందుకే ఈ అయిదేళ్లలో ప్రజలకు చేరువగా ఉండే అవకాశం వదులుకోదల్చుకోలేదంటూ ముసిముసిగా నవ్వుతూ చెప్పాడు విజయ్‌. వారి మాటల్లోనే విమానం రన్‌వే నుంచి వేగంగా కదిలింది.

అసెంబ్లీ ప్రాంగణం అంతా కోలాహలంగా ఉంది. సభలో ఏమి జరగబోతుందనే విషయంపై మీడియా వాళ్లు ఎవరికి వారు వారికి తోచిన విశ్లేషణలతో హడావుడి పడుతున్నారు. ఆయా పార్టీల ఎంఎల్‌ఎలను మీడియా పాయింట్‌కు తీసుకువచ్చి వారితో మాట్లాడిస్తున్నారు.ఇంతలో కోరం బెల్‌ మోగడంతో సభ్యులందరూ వెళ్లిపోయారు.

స్పీకర్‌ తన స్థానంలో కూర్చోగానే విపక్ష సభ్యులు ఒక్కసారిగా లేచి, మంత్రి రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు. పోడియం చుట్టిముట్టి, స్పీకర్‌తో వాదనకు దిగారు. అయితే ఆయా పక్షాల నేతలు మాత్రం తమ సీటు వద్దే మౌనంగా ఉండిపోవడంతో అధికార పక్షానికి ఊరట లభించింది.

విజయ్‌ కనిపించకపోవడంతో రంజిత్‌తో పాటు అధికార పార్టీ యువ శాసనసభ్యులు ఆయన కోసం వెతుకుతున్నారు. ఒక సభ్యుడు బయటకు వచ్చి కాల్‌ చేశాడు.నాలుగైదు సార్లు ప్రయత్నించాడు. కానీ ఆ సమయంలో విజయ్‌ విమానంలో ఉండటంతో ఫోన్‌ నాట్‌ రీచబుల్‌ అంటూ వినబడటంతో ఆ సభ్యునికి విసుగు వచ్చింది.

తిరిగి సభ హాల్‌లోకి పోయి రంజిత్‌కు ఇదే విషయం చెప్పాడు. తర్వాత ప్రయత్నిద్దామని వారు మౌనంగా కూర్చున్నారు. అయితే విపక్ష నేతలు సీట్లకు పరిమితం అయినప్పటికీ ఆయా పార్టీల సభ్యులు మాత్రం సభలో నినాదాల జోరు కొనసాగించారు. ఈ దశలో ముఖ్యమంత్రి లేచి సభ్యులు శాంతించాలని, ప్రజాస్వామ్య ప్రక్రియలో ఏ సమస్య అయినా చర్చల ద్వారానే పరిష్కరించుకోవాలని,చట్టసభలు అందుకు వేధికలని చెప్పినా పోడియం నుంచి వారు వైదొలగలేదు. స్పీకర్‌ కూడా పదేపదే కోరినా వారు వినకపోవడంతో అరగంటపాటు సభను వాయిదా వేసి, ఛాంబర్‌లోకి వెళ్లిపోయారు. సిఎం, ఇతర మంత్రులు కూడా వారివారి గదుల్లోకి వెళ్లారు.

అయినప్పటికీ సభలోనే కూర్చున్న ఆయా పార్టీల సభ్యుల చెంతకు వచ్చిన ప్రభుత్వ చీఫ్‌విప్‌ వారిని అనునయించేందుకు ప్రయత్నించారు. సభ జరగకుంటే, ప్రజాసమస్యలపై చర్చ జరగదని, దీంతో మీరు ఇచ్చిన ప్రశ్నలకు సమాధానాలు రావని, మీ సందేహాలన్నింటికి సిఎం సమాధానం చెప్పడానికి ముందుకు వచ్చినా మీరు సహకరించకపోవడం సమంజసం కాదని వారిని మొత్తబరిచేందుకు శతవిధాలుగా ప్రయత్నించారు. కుంభకోణానికి భాద్యుడైన ఇరిగేషన్‌ మంత్రి రాజీనామా చేస్తేనే తమ ఆందోళన విరమించుకుంటామని వారు బల్లగుద్ది చెప్పారు.

ముఖ్యమంత్రి వివరణ తర్వాత మీరు సంతృప్తిపడకపోతే అప్పుడు చూడండి, ప్రభుత్వంతో మీకు పనులుంటాయి, ఇలా చేస్తే భవిష్యత్తులో మీకు కూడా ఇబ్బందుల వస్తాయంటూ కొంత బెదిరింపు దోరణిలోనే చెప్పాడు చీఫ్‌విప్‌.

దీంతో వారిలో కొంత కదలిక వచ్చినట్లు అయింది. సిఎం సమాధానం వింటామని అంగీకరించారు.వెంటనే ఆయన నేరుగా సిఎంకు వెళ్లి తన మంతనాలు ఫలవంతమైనట్లు చెప్పాడు. అరగంట తర్వాత తిరిగి కోరం బెల్‌ మోగింది. స్పీకర్‌ తన అధ్యక్షస్థానంలో కూర్చోగానే పోడియం వద్ద ఉన్న సభ్యులు మరోసారి నినాదాలు చేశారు. ఈ దశలో చీఫ్‌విప్‌ లేచి,

అధ్యక్షా, సభ్యుల ఆందోళనను ప్రభుత్వం గమనించింది. అందుకే ముఖ్యమంత్రి గారు స్వయంగా దీనికి వివరణ ఇవ్వాలని అనుకుంటున్నారు. సభ్యుల అంగీకరించి తమతమ సీట్లలో కూర్చుంటే చర్చ ప్రజాస్వామ్యబద్దంగా జరగడానికి అవకాశం ఉంటుంది. అందుకే నేను అక్కడ ఉన్న సభ్యులను కోరుతున్నాను. దయచేసి వచ్చి, మీ సీట్లలో కూర్చోండి అంటూ కోరారు. స్పీకర్‌ కూడా అదే సూచించడంతో సభ్యులందరూ వచ్చి కూర్చున్నారు.

ముఖ్యమంత్రి లేచి,
అధ్యక్షా, గౌరవ సభ్యులకు,
మీడియా అంటే అందరికీ గౌరవమే. ప్రజాస్వామ్యంలో నాలుగో స్తంభం పత్రికలే. నీటిపారుదల ప్రాజెక్టులపై మా పార్టీ సభ్యుడు లేవనెత్తిన అంశంపై చర్చ ప్రారంభమైన రాత్రి ఎవరో తెలియదు, విపక్ష నేతలకు సూట్‌కేసులు ఇచ్చారట. ఇది నిజంగా దురదృష్టకరం. మా ప్రభుత్వం అవినీతిని నిర్మూలించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నది. ఎసిబి అధికారులు ఇటీవలి కాలంలో పెద్దయెత్తున దాడులు జరిపారనడానికి ఈ గణాంకాలే నిదర్శనమని కేసుల వివరాలను వెల్లడిరచారు. విజిలెన్స్‌ విభాగం కూడా దర్యాప్తులు సాగిస్తున్నది.

రైతుల శ్రేయస్సు కోసం కట్టుబడిన మా ప్రభుత్వం రెండు లక్షల కోట్ల రూపాయల అంచనా వ్యయంతో భారీగా నీటిపారుదల ప్రాజెక్టులను నిర్మిస్తున్న సంగతి మీకు తెలుసు. ఈ బృహత్తర పథకంలో ఎక్కడ లోటుపాట్లకు అవకాశం లేకుండా మంత్రి స్వయంగా అనేక సార్లు తనిఖీలు కూడా చేశారంటూ ఇరిగేషన్‌ మంత్రిని చూపుతూ, ఇలాంటి వ్యక్తిపై ఆరోపణలు రావడం ఎంతో విచారకరం. తప్పు జరిగినట్లు రుజువు అయితే నేనే ఈ మంత్రిని భర్తరఫ్‌ చేస్తాను. కానీ ఎలాంటి ఆధారాలు లేని ఆరోపణలకే పదవి నుంచి వైదొలగాలని మీరు డిమాండ్‌ చేయడంలో ఔచిత్యం ఉందా? అసలు ఆ సూట్‌కేసులు పంపిణీ చేసింది ఎవరో ఇప్పటికే ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. సిఐడి దర్యాప్తు ప్రారంభించింది. ఈ రిపోర్టు రాగానే దోషులు ఎంతటి వారైనా ప్రభుత్వ వదిలిపెట్టదు. సహకరించండి,

ప్రభుత్వంపై విశ్వాసం ఉంచండి. ప్రజాధనం దుర్వినియోగం అవుతుంటే ప్రత్యేకంగా నేను కూడా ఏమాత్రం సహించను. మీరు డిమాండ్‌ చేసినట్లుగా మంత్రి రాజీనామా డిమాండ్‌ ఈ సమయంలో కరెక్టు కాదు. సిఐడి రిపోర్టు ఈ వారంలోనే వస్తుంది, రిపోర్టు రాగానే చర్యలు తీసుకుంటానని సభ్యులకు భరోసా ఇస్తున్నానని, అందరిని ఒకసారి కలియజూసి కూర్చున్నాడు సిఎం.

ముందుగా చీఫ్‌విప్‌తో మాట్లాడినందున విపక్ష సభ్యులు ఇక మౌనం వహించడంతో స్పీకర్‌ మరో అంశంపై చర్చకు ఉపక్రమించారు. ఈ దశలో ఒక్కసారిగా అధికార పక్ష సభ్యుల నుంచే అలజడి ప్రారంభమైంది. యువ ఎంఎల్‌ఎలు దాదాపు 40 మంది లేచి నిలబడ్డారు. ఏమిజరుగుతున్నదో స్పీకర్‌కు కానీ,ముఖ్యమంత్రికి కానీ అర్థం కాలేదు. ఇరిగేషన్‌ మంత్రి రాజీనామా చేయాల్సిందే నంటూ వారు గట్టిగా నినధించడంతో మంత్రులు,సిఎం అవాక్కయ్యారు.ఊహించని పరిణామం వారిని షాక్‌కు గురిచేసింది. స్పీకర్‌ వెంటనే సభను గంటసేపు వాయిదా వేసాడు. పరోక్షంగా ముఖ్యమంత్రి ఇచ్చిన సంజ్ఞతోనే స్పీకర్‌ ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా ఉంది.

నిలబడి ఉన్న యువ ఎంఎల్‌ఎలను కోపంగా చూస్తూ ముఖ్యమంత్రి తన ఛాంబర్‌లోకి వచ్చారు.బిలబిల మంటూ ఇతర మంత్రులు,చీఫ్‌విప్‌, విప్పులు కూడా వచ్చి కూర్చున్నారు. ఏమిమాట్లాడాలో ఎవరికి అర్థం కావడం లేదు. సమావేశానికి రాకుండా విజయ్‌ను వ్యూహాత్మకంగా యువ ఎంఎల్‌ఎలను ప్రోత్సహిస్తున్నాడా? తాను ఎంతో ఆలోచించి వాన్ని తిరుపతికి పంపినా, తన ఎత్తు పారలేదనే ఆందోళన సిఎంలో వ్యక్తమవుతున్నది.

ఏమిటి సార్‌ ఇదంతా? విపక్షాలను ఎదో విధంగా చిత్తు చేసినట్లుగా మనం సంతోషపడుతుంటే ఇదేమిటీ, మన సభ్యులే తిరుగుబాటు చేసినట్లుగా సభా కార్యక్రమాలకు అడ్డుపడుతున్నారు?అంటూ సిఎం పై ప్రశ్నల వర్షం కురిపించారు మంత్రులు

ఈ సభ్యులకు ఇంత ధైర్యం వచ్చిందంటే దీని వెనుక ఎవరో ఒకరు ఉండాలి. పార్టీలో ఈ లుకలుకలు మంచిది కాదు. ఒక్కసారిగా వీరందరిపై చర్యలు తీసుకోవడానికి అవకాశం ఉండదు. వీరికి లీడర్‌ ఎవరు? ఆ విజయ్‌ కావచ్చు, ఏడీ ఆయన కనిపించలేదు కదా అంటూ మంత్రులు తమలో తామే చర్చించుకుంటున్నారు.

ముఖ్యమంత్రికి కూడా ఏమి చేయాలో పాలుపోలేదు. వారిని పిలిచి మాట్లాడితే మంచిదనుకున్నాడు. ఇదే విషయం మంత్రులతో ప్రస్తావించారు. వారికి వేరే ఆలోచన లేదు కాబట్టి, సరే పిలువండి అన్నారు. నలుగురైదుగురిని పిలిస్తే సరిపోతుంది. వారిలో వారే నిర్ణయించుకొని తక్కువ మందిని రమ్మని చీఫ్‌విఫ్‌కు చెప్పాడు సిఎం. దీంతో ఇతర మంత్రులంతా ఛాంబర్‌ నుంచి బయటికి వెళ్లిపోయారు. వారితో ఎలా చర్చించాలి,వారి డిమాండ్లు ఏముంటాయో ఊహించడానికి సిఎం ప్రయత్నిస్తున్నారు.

సభ వాయిదా పడగానే రంజిత్‌, తానే స్వయంగా విజయ్‌తో సంప్రదించేందుకు కాల్‌ చేసినప్పటికీ అందుబాటులో లేదనే సమాధానం రావడంతో ఆయనలో ఆందోళన వ్యక్తమైంది. ఎవరైనా దాడి చేసి ఉంటారా? ఇప్పటికే అటాక్‌ చేశారు దుండగులు.విజయ్‌ ఏ పరిస్థితిలో ఉన్నారో? పోలీసు రక్షణ ఉన్నందున ఏదైనా జరిగితే ఇప్పటికే తెలిసేది అనుకున్నాడు రంజిత్‌.

యువ శాసనసభ్యులు ఇంకా సభలో ఉండి తమలో తాము మాట్లాడుకున్నారు. విజయ్‌ ఫోన్‌ అందుబాటులో లేదని, ఎక్కడ ఉన్నాడో తెలియడం లేదని రంజిత్‌ వారికి చెప్పాడు. విజయ్‌ లేవనెత్తిన ఈ కుంభకోణంపై ప్రభుత్వం మసిపూసి మారేడు కాయలు చేస్తున్నదని, దీనిని ఇలాగే వదలి వేయరాని,విజయ్‌ లేకపోయినప్పటికీ మనమందరం ఈ సమస్యపై పరిష్కారం ఒక కొలిక్కి వచ్చే వరకు వెనుకంజ వేయరాదని ఆయన తెలిపారు. అయితే ఇరిగేషన్‌ మంత్రి రాజీనామా చేయడమే దీనికి సరైన పరిష్కారమని, యువ ఎంఎల్‌ఓ ఒకరు అనడంతో ఇతరులు కూడా ఇదే డిమాండ్‌కు ఆమోదం తెలిపారు. దీనికి ముఖ్యమంత్రి అంగీకరించనట్లయితే సభను స్తంభింపచేయాలని వారు ఏకగ్రీవంగా నిర్ణయించుకున్నారు.

(సశేషం)

త‌ప్ప‌క‌చ‌ద‌వండి: విజయుడు (ధారావాహిక న‌వ‌ల‌ పార్ట్‌-33)

Leave A Reply

Your email address will not be published.