Dream: నేను కలగన్నాను తెలుసా…!!

1.
నేను కలగంటాను తెలుసా…!!

నువ్వు నమ్మవు గానీ ఊహ ఎంత గొప్పగా ఉంటుందో…

నిద్దర్లో ఒక్కోసారి నాలోని భావాలను నీలోకి వొంపుకుని

మంచుకొండల్లో తెలికపడిన మబ్బుల్లా హఠాత్తుగా జడివాన వెలసి యుద్ధం ఆగిపోయినట్టు

రైలు బండికి నువ్వొచి ఎత్తుకొని పాలబుగ్గల పిల్లల నుదిటిపై ముత్యపు ముద్దు పెట్టినట్టు కలగంటాను….!!

2.
నీకు తెలుసా నేనూ కలగంటాను…!!

పచ్చని పైరుల మీద ,కొండలలో,

కోనలలో , కీకారణ్యంలో,

నాగేటి సాళ్లల్లో నల్ల తుమ్మ సెట్టోలే అడ్డు నిలబడి,

ఈ ఏటికి పత్తిగింజ పగిలి కాపు బాగా కాసినట్టు

షావుకారు కాడ

అప్పులన్నీ తీర్చినట్టు

సూర్యుని ఎరుపుదనం

అంతా దెచ్చి

కుంకుమ కానుకగా ఇచ్చి

చెల్లిని అత్తవారింటికి పంపినట్టు….!!

3.
అప్పుడప్పుడైతే మరీనూ…!!

ప్రపంచమో మార్మిక రహస్యము

అందుబాటులో ఉన్నదేదీ అందదనే నిగూఢ నిశ్శబ్దం వెనుక

తమ్ముడి ఆకలి కోసం చీకట్లో

జొన్న కంకులు

ఎత్తుకెళ్లి కణ కణ కాలుతున్న బొగ్గు నిప్పుకల్లో

కాల్చి మంటల్లో కాలే కడుపుల

ఆకలి తీర్చినట్లు నిజాన్ని కలగంటాను….!!

 


4.
ఇంకా చిన్నప్పుడు అయితే …..!!

శైశవం ఓ దొంగాట

చిన్నతనంలో చేసిన తప్పులు స్వాగతించి

తెలుసుకునే లోపే

ముగిసిపోయే చిలిపి అల్లరి.

అప్పుడూ కలగనే దాన్ని తెలుసా

పరీక్షలో ఫస్ట్ వచ్చినట్టు రంగులరాట్నం ఎక్కి ఊరంతా చూసినట్టు దీపావళి పండక్కి కొత్తబట్టలు కొన్నట్టు మధ్యలో స్వీట్లు తిన్నట్టు అన్న ఇచ్చిన

రెండు రూపాయల పాకెట్ మనీ తో

బోలెడు రాకెట్లు కాల్చినట్టు కలగంటాను…!!

5.
ఇప్పుడూ కలగంటున్న….!!

తెలుసా నీకు?

ఒక్క నెత్తుటి మరక కూడా నీపై లేకుండా కర్మభూమిలో మంచు దిబ్బలపై గాఢంగా నువ్వు నిద్రపోతున్నట్టు

మంచుకొండలు కరిగి భూమి ఆకాశం ఒక్కటైనట్టు

చీకటినంతా వెలుగులోకి వొంపుకొని వెండిమబ్బుల్ని రెక్కలుగా మార్చి ఎగురుతూ

మా దగ్గరకు వస్తున్నట్టు

నా మాటలన్నీ నువ్వు వింటున్నట్టు

నేను పిలవగానే నా చేతిపట్టుకొని నీ ప్రేమైక హృదయంతో ఏకం చేసుకుని నీ విశ్వ మానవ సమాన సమైక్య లోకంలోకి నన్ను తీసుకెళ్తున్నట్లు…!!

A Man dies but his dream is never end..!!

 

-పద్మజ బొలిశెట్టి

Leave A Reply

Your email address will not be published.