మానేరులో గల్లంతైన విద్యార్థులు.. ఐదు మృతదేహాలు లభ్యం

సిరిసిల్ల (CLiC2NEWS): రాజన్న సిరిసిల్ల జిల్లాలోని తంగాళ్లపల్లి మండల శివారులోని చెక్ డ్యాంలో 9 మంది విద్యార్థులు ఈతకు వెళ్లగా వారిలో ఆరుగురు గల్లంతైన సంగతి తెలిసిందే. కాగా ఇప్పటి వరకు ఐదుగురి మృతదేహాలు లభ్యమయ్యాయి. మారులో ఈతకు వెళ్లిన 9 మందిలో వాసల కళ్యాణ్, కోట అరవింద్, దిడ్డి అఖిల్ క్షేమంగా ఉన్నారు. మిగతా ఆరుగురి కోసం నిన్నటి నుంచి ముమ్మరంగా గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.
సోమవారం 8వ తరగతి విద్యార్థి కొలిపాక గణేష్(14) మృతదేహం దొరికింది. మిగిలిన వారి కోసం రాత్రి పూట కూడా గాలింపు చేపట్టారు. ఈ క్రమంలో ఈరోజు (మంగళవారం) ఉదయం జడల వెంకట సాయి (14) , కొంగ రాకేష్(12), శ్రీరామ్ క్రాంతి కుమార్(14), అజయ్(13) మృత దేహాలు లభించాయి. వీరందరూ కూడా సిరిసిల్ల పట్టణానికి చెందిన రాజీవ్ నగర్ వాసులని అధికారులు గుర్తించారు. ప్రభుత్వ స్కూల్లో చదువుతున్న వీరంతా సరదాగా ఈత కొట్టేందుకు మానేరు వాగుకు వెళ్లినట్లు తెలుస్తోంది. కాగా ఇప్పటి వరకు ఇంటర్మీడియెట్ విద్యార్థి అయిన సింగం మనోజ్(16 ) ఆచూకీ ఇంకా తెలియరాలేదు. అతని మృతదేహం కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.