మూడు కొత్త సాగు చట్టాలను రద్దు చేస్తున్నాం: ప్రధాని మోడీ

హైదరాబాద్ (CLiC2NEWS): సాగు చట్టాలకు వ్యతిరేకంగా దేశ రాజధాని సరిహద్దుల్లో రైతులు కొనసాగుతున్న ఉద్యమానికి ఏడాది పూర్తవుతున్న వేళ.. కేంద్రంలోని మోడీ సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది. రైతుల ఆందోళనలతో దిగొచ్చిన సర్కార్ కొత్త గా తెచ్చిన మూడు సాగు చట్టాలను రద్దు చేసేందుకు నిర్ణయించింది. ఈ మేరకు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ శుక్రవారం కీలక ప్రకటన చేశారు. ఇవాళ జాతి నుద్దేశించి ప్రసంగించిన.. ప్రధాని కొత్త సాగు చట్టాలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా రైతులందరికీ క్షమాపణ చెబుతున్నానని ప్రధాని మోడీ అన్నారు.
ఈ నెలాఖరుకు జరిగే పార్లమెంట్ సెషన్స్‌లో ప్రకటన చేస్తామని మోడీ తెలిపారు. శీతాకాల సమావేశాల్లోనే బిల్లులను వెనక్కి తీసుకుంటామని చెప్పారు. రైతుల అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకొని ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు.
అలాగే, ప్రత్యేక కమిటీని ఏర్పాటుచేస్తామని తెలిపారు. ఇందులో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ అధికారులు, రైతులు, నిపుణులు ఉంటారని చెప్పారు. ఈ కమిటీ నిర్ణయాల ఆధారంగా వ్యవసాయ రంగానికి సంబంధించి చర్యలు తీసుకుంటామని ప్రధాని పేర్కొన్నారు. రైతుల సంక్షేమానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు.
“2014లో నేను తొలిసారి ప్రధాన మంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచే మా ప్రభుత్వం రైతుల సంక్షేమం, అభివృద్ధికి ప్రథమ ప్రాధాన్యం కల్పించింది. మన దేశంలో 80 శాతం సన్నకారు రైతులే అనే విషయం చాలా మందికి తెలియదు. 10 కోట్ల మందికి పైగా రైతులకు 2 హెక్టార్ల కంటే తక్కువ భూమి ఉంది. రైతుల కష్టాలను నేను స్వయంగా దగ్గరుండి చూశా.. అందుకే అనేక రకాలైన సంస్కరణలు తెచ్చాను. ఇకపై రైతుల సంక్షేమం కోసం మరింత కష్టపడి పనిచేస్తాం“ అని ప్రధాని ఈ సందర్భంగా తెలిపారు.
రైతులకు తక్కువ ధరకే విత్తనాలు లభించేలా కృషిచేశామని పేర్కొన్నారు. వ్యవసాయానికి బడ్జెట్‌లో కేటాయింపులు ఐదు రెట్లు పెంచామని తెలిపారు. 22 కోట్ల భూసార కార్డులను పంపిణికి చర్యలు చేపట్టామని, ఫసల్ బీమా యోజనను మరింత బలోపేతం చేస్తామని వివరించారు. రైతులు ఆందోళనలను విరమించి ఇళ్లకు వెళ్లాలని ప్రధాని నరేంద్ర మోదీ కోరారు. రైతులకు లబ్ధి చేకూర్చేలా ఈ చట్టాలను తీసుకొచ్చినా.. అర్ధం చేసుకోవడంలో విఫలమయ్యారని పేర్కొన్నారు.
👌
👌
ఇందిరా గాంధీ జయంతి రోజున రైతు చట్టాలను రద్దు చేసి ఘన నివాళులు అర్పించిన బీజేపీ..
ఇది కాదా రైతు పక్షాన నిలిచిన కాంగ్రెస్ విజయం…