ఘనంగా ఇందిరా గాంధీ జయంతి వేడుకలు

మండపేట(CLiC2NEWS): దేశం కోసం దేశ ప్రజల కోసం ప్రాణాలర్పించిన మహనీయురాలు ఇందిరాగాంధీ అని టౌన్ కాంగ్రెస్ అధ్యక్షుడు అప్పురబోతు దుర్గాప్రసాద్ అన్నారు. శుక్రవారం భారత దేశ తొలి మహిళా ప్రధాని ఇందిరా గాంధీ జయంతి సందర్భంగా ఏఐసీసీ సభ్యులు, నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ చార్జి కామన ప్రభాకరరావు ఆదేశాలతో ఇందిరా గాంధీ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. టౌన్ అధ్యక్షుడు ప్రసాద్ ఏడిద రోడ్డులో ఉన్న కాంగ్రెస్ కార్యాలయంలో ఆమె చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆమె సేవలను స్మరించుకున్నారు. ఇందిరా గాంధీ దేశానికి 16 సంవత్సరాల పాటు ప్రధానమంత్రిగా పనిచేసి ప్రజలకు విశేష సేవలు అందించిందన్నారు. ఈ దేశంలోని బడుగు, బలహీన వర్గాలకు, ఎస్సీ ఎస్టీ వర్గాలకు శ్రేయస్సుకు అనేక సంస్కరణలు ప్రవేశపెట్టింది అన్నారు. భూమిలేని పేదలకు భూ పంపిణీ చేసిందని అన్నారు. దేశవ్యాప్తంగా ఇల్లు లేని పేదలకు ఇల్లు కట్టించి ఇచ్చిందన్నారు. గరీబ్ హటావో నినాదంతో పేదరిక నిర్మూలన కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు ప్రవేశ పెట్టిందన్నారు. 14 ప్రైవేటు బ్యాంకులను జాతీయం చేసి, పేద ప్రజలందరికీ బ్యాంక్ సేవలను చేరువ అయ్యేలా చేసిందన్నారు. 20 సూత్రాల ఆర్థిక కార్యక్రమం అమలు చేసిందని, ఆమె తుది రక్తపుబొట్టు వరకూ ఈ దేశ సమైక్యత కోసం సమగ్రత కోసం అర్పిస్తానని చెప్పి తన ప్రాణాన్ని త్యాగం చేసిన గొప్ప నాయకురాలు అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో లంక అశోక్, ఆకుల ప్రకాష్, పలివెల సుధాకర్, పడాల జానూ ,తదితరులు పాల్గొన్నారు.