Mandapet: సిసి రోడ్డు నిర్మాణానికి చర్యలు తీసుకోవాలి

మండపేట (CLiC2NEWS): మున్సిపల్ పరిధిలోని 26వ వార్డులో ప్రజలు గ్రావెల్ రోడ్డుతో అనేక ఇబ్బందులు పడుతున్నారు. రైతు బజార్ ఎదురుగా ఉండే వీధిలో సుమారు 15నుంచి 20 కుటుంబాల ప్రజలు నివాసం ఉంటున్నారు. దశాబ్ద కాలంగా ఆ వీధి ఎర్ర గ్రావెల్ దారిగానే మిగిలి ఉంది. కనీసం డ్రెయినేజీ సౌకర్యం కూడా లేదు. ఇళ్లల్లో వాడకం నీరు పోయే దారి లేదు. మురుగు నీటిని బకెట్లతో ఎత్తి పోసుకుంటున్నారు. వర్షాకాలంలో ఈ వీధి ప్రజలు పడే బాధలు వర్ణనాతీతం. వర్షానికి రోడ్డుపై ఉన్న గ్రావెల్ మట్టి కొట్టుకుని పోయి పెద్ద పెద్ద కంకర రాళ్ళు పైకి తేలాయి. నడిచే సమయంలో ఈ కంకర రాళ్ళు కాళ్ళకు తగిలి చిన్నారులు, వృద్ధులు గాయాల పాలవుతున్నారు. పట్టణంలో దాదాపుగా అన్ని వీధులు సీసీ రోడ్లతో చక్కగా రూపుదిద్దుకున్నాయి. కేవలం ఈ ఒక్క వీధి లోనే గ్రావెల్ రోడ్డు దర్శనం ఇస్తుంది. మా వీధికి కూడా మంచి రోజులు ఎప్పుడు వస్తాయా అని అక్కడి ప్రజలు గంపెడాశతో ఎదురు చూస్తున్నారు. మున్సిపల్ ఎన్నికల సమయంలో శాసన మండలి సభ్యులు తోట త్రిమూర్తులు సిసి రోడ్డు నిర్మించి సమస్య పరిష్కరిస్తానని చెప్పారని స్థానికులు వివరించారు. ఈ సమస్యపై మున్సిపల్ చైర్ పర్సన్ పతివాడ దుర్గారాణి కూడా దృష్టి సారించి సిసి రోడ్డు నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని వేడుకుంటున్నారు.

Leave A Reply

Your email address will not be published.