కత్తి దూసిన కోడి పుంజులు.. రూ. కోట్లలో పందేలు
ఏలూరు (CLiCNEWS): ఆంధ్రప్రదేశ్‌లో కోడి పందేలకు అనుమతి లేదని పోలీసులు ఆర్భాటంగా ప్రకటనలు చేసినా బరులు మాత్రం యధావిధిగా కొనసాగుతున్నాయి. ఉభయగోదావరి జిల్లాలతో పాటు కృష్ణా జిల్లా వ్యాప్తంగా కోడి పందేలు భారీ ఎత్తున నిర్వహిస్తున్నారు. గన్నవరం నియోజకవర్గంలోని అంబాపురం వద్ద జరిగిన కోడి పందేల్లో నగదు కోట్లలో చేతులు మారినట్లు సమాచారం. ఇక్కడ నిర్వహకులు రాత్రి వేళల్లో ఫ్లడ్‌లైట్లు ఏర్పాటు చేసి జూదాన్ని కొనసాగించారు.
ఉభయగోదావరి జిల్లాల్లో జోరుగా పందేలు
కోడి పందేలకు ఉభయగోదావరి జిల్లాలు పెట్టింది పేరు. ఇక్కడ పలు చోట్ల పెందేల కోసం పెద్ద ఎత్తును నిర్వాహకులు బరులను ఏర్పాటు చేశారు. ఇక్కడ జరిగే పందేల్లో పాల్గొనేందుకు పలు రాష్ర్టాల నుంచి పెద్ద ఎత్తున పందెం రాయుళ్లు తరలివచ్చారు. పశ్చిమ గోదావరి జిల్లాల్లో దాదాపు 450కి పైగా బరుల్లో పందేలు జరుగుతున్నాయి.
అలాగే తూర్పు గోదావరి జిల్లాలో రూ. 60 నుంచి రూ. 70 కోట్ల వరకు చేతులు మారి ఉంటాయని పలువురు అనుకుంటున్నారు. ముఖ్యంగా కోనసీమలోని కాట్రేనికోన మండలంలోని పల్లంకుర్రులో సకల సౌకర్యాలతో పందెంరాయుళ్లను ఆకర్షించేలా 10కి పైగా బరులను నిర్వహకులు ఏర్పాటు చేశారు.
కోడిపందేలు ఆడేందుకు వచ్చిన వారితో తాడేపల్లిగూడెం, తణుకు పట్టణాల్లోని లాడ్జిలు నిండిపోయాయి. రాత్రి సమయంలో కూడా జూదం పందేలు నిర్వహించేదుకు నిర్వాహకులు బరుల వద్ద ఫ్లడ్‌లైట్లను ఏర్పాటు చేశారు.