కుటుంబ సభ్యులే రోడ్డు ప్రక్కన వదిలేశారు..
విశాఖపట్నం (CLiC2NEWS): కదలలేని పరిస్థితిలో ఉన్న ఓ వృద్ధుడిని సొంత కుటుంబ సభ్యులే నడిరోడ్డుపై వదిలివెళ్లారు. ఈ అమానవీయ ఘటన విశాఖలోని ఎంపిపి కాలనీలో చోటుచేసుకుంది. ఓ వృద్ధుడు కొద్ది రోజులుగా కదలేని స్థితిలో రోడ్డుప్రక్కనే ఉంటున్నాడు. స్థానికులు మొదట భిక్షాటన చేసుకునే వ్యక్తిగా భావించి పట్టించుకోలేదు. ఎన్నిరోజులైనా అతను అక్కడే ఉండటం, రాత్రిపూట చలికి తట్టుకోలేక వణికిపోవటాన్ని గమనించి పోలీసులకు సమాచారం అందించారు.
పోలీసులు ఆ వృద్ధిడిని వివరాలు అడిగే ప్రయత్నం చేశారు. తనది అప్పుఘర్ ప్రాంతమని, తన కుటుంబ సభ్యులే ఇక్కడ వదిలేసి వెళ్లారని తెలిపాడు. అయితే అతను పూర్తి వివరాలు తెలిపే పరిస్థితిలో లేకపోవటంతో ఇండియన్ రెడ్‌క్రాస్ సంస్థకు సమాచారం ఇచ్చారు. రెడ్‌క్రాస్ ప్రతినిధి,కానిస్టేబుల్ సహాయంతో ఆ వృద్ధుడిని ఆశ్రమానికి తరలించారు.