Mandapeta: సచివాలయ కార్యదర్శి ఉదార‌త‌..

తిరుపతికి వెళ్ళి పింఛన్ అందజేసిన సచివాలయ కార్యదర్శి

మండపేట (CLiC2NEWS): ఇంట్లో తల్లి దండ్రులు, కుటుంబ సభ్యులు లేదా పక్కింటి వారు గాని ఏదైనా పని మీద మార్కెట్ కు వెళ్ళాలని చెబితే బాబోయ్ అని తప్పించుకు పారిపోయే రోజులు నేడు నడుస్తున్నాయి. అటువంటిది ఏకంగా మండపేట సచివాలయ కార్యదర్శి 700 కిలో మీటర్లు దూరం వెళ్ళి ఫెన్షన్ అందజేసి
అంద‌రి మ‌న్న‌ల‌నందుకున్నాడు. కార్యదర్శి ఉదారత్వానికి పట్టణ ప్రజలు ఆయనను ప్రశంసలతో ముంచెత్తు తున్నారు.

వివరాల్లోకి వెళితే పట్టణంలోని 11వ వార్డుకు చెందిన మేడిశెట్టి కిషోర్ గత కొంతకాలంగా కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతూ తిరుపతి లోని ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. కిషోర్ ఆలనాపాలనా చూడడానికి భార్య అతని తల్లి కూడా స్విమ్స్ ఆసుపత్రిలోనే ఉన్నారు. కిషోర్ భార్యకు కూడా అంగవైకల్యం ఉండడంతో ఆమెతో పాటు కిషోర్ తల్లి వితంతు పింఛన్ను అందుకుంటున్నారు. వారు స్థానికంగా అందుబాటులో లేక పోవడంతో ఆ ముగ్గురికి పింఛన్ ఇచ్చే అవకాశం లేకపోయింది. అయితే ఆ వార్డ్ కౌన్సిలర్ కొవ్వాడ బేబి అప్పన్నబాబులు ఆ కుటుంబం కష్టాల్లో ఉందని భావించి ఎలాగైనా ఫెన్షన్ సొమ్ములు ఇవ్వాలని తలంచారు. దీంతో సచివాలయం వెల్ఫేర్ సెక్రటరీ డి లోకేష్ వద్దకు వెళ్లి విషయాన్ని వివరించారు. అందుకు కార్యదర్శి లోకేష్ సానుకూలంగా స్పందించి తిరుపతి వెళ్లి అందజేయడానికి సిద్ధపడ్డారు. కౌన్సిలర్ ప్రయాణానికి అయ్యే ఖర్చులు పింఛన్ సొమ్ములు కార్యదర్శి చేతికి ఇచ్చి తిరుపతి పంపారు. లోకేష్ తిరుపతి ఆసుపత్రిలో ఉన్న ఆ ముగ్గురికి ఫెన్షన్ సొమ్ములు అందజేసి ఉదారతను చాటుకున్నారు. దీంతో లబ్ధిదారుల ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. అప్పటికే ఆర్థిక ఇబ్బందులతో సతమతం అవుతున్న పింఛనుదారులకు సొమ్ములు తీసుకెళ్ళి ఇవ్వడంతో వారు ఆశ్చర్యానికి గురై ఆనందబాష్పాలతో ఉక్కిరి బిక్కిరి అయ్యారు.

సచివాలయ కార్యదర్శిగా విధులు సక్రమంగా నిర్వర్తించడమే కాకుండా సుదూర ప్రాంతానికి వెల్లి పింఛన్ అందజేసిన లోకేష్ ను మున్సిపల్ చైర్ పర్సన్ పతివాడ దుర్గారాణి, కమిషనర్ రామ్ కుమార్ లు ప్రత్యేకంగా అభినందించారు. సచివాలయ ఉద్యోగులు లోకేష్ ను స్ఫూర్తిగా తీసుకుని మానవతా విలువలు కూడా పెంచుకుని ఇటువంటి సేవల ద్వారా ప్రజల మన్ననలు కూడా పొందవచ్చని కితాబునిచ్చారు.

Leave A Reply

Your email address will not be published.