పేలుడు ఘటనలో గాయపడ్డ వ్యక్తి మృతి..

మండపేట (CLiC2NEWS): మండపేట ఏడిద రోడ్డులోని ఓ బాణసంచా తయారీ కేంద్రంలో పేలుడు సంభవించిన విషయం తెలిసినదే. ఈ ఘటనలో తీవ్రగాయాలపాలైన వ్యక్తి మృతిచెందారు. ఈ ఘటనలో నలుగురు వ్యక్తులు తీవ్ర గాయాల పాలవ్వగా వారిని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యం అందించిన దరిమిలా మెరుగైన వైద్యం కోసం వైద్యులు కాకినాడ తరలించారు. జీజీహెచ్ లో ఆ నలుగురికీ చికిత్స అందిస్తుండగా అందులో బాణసంచా తయారీ నిర్వాహకుడు అన్నవరపు అయ్యప్ప రాజు మృతి చెందాడు. పరిస్థితి విషమించడంతో రాజు మృతి చెందినట్లు యువకుడి స్నేహితులు ద్వారా తెలిసింది. కాగా ఆ యువకుడి తల్లి ఆసుపత్రిలోనే కాలిన గాయాలతో కొట్టి మిట్టాడుతోంది. ఓ పక్క తల్లి పడే నరకయాతన మరో పక్క చేతికి అందివచ్చిన కుమారుడు కళ్లెదుటే ప్రాణం విడవడంతో చుట్టుపక్కల వారిని కలిచివేసింది. ఆ కుటుంబానికి దిక్కు లేకుండా పోయింది. ఈ విచారకర సంఘటనతో మండపేట పట్టణంలో విషాదఛాయలు అలుముకున్నాయి.