ఉగాది నుండి కొత్త జిల్లాల్లో పాలన ప్రారంభం: ఎపి సర్కార్

అమరావతి (CLiC2NEWS): ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉగాది నుండి కొత్త జిల్లాల్లో పాలన ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రాష్ట్ర మంత్రులు, అధికారులతో కొత్త జిల్లాల ఏర్పాటుపై సమీక్ష నిర్వహించారు. ఉగాది నుండి కలెక్టర్లు, ఎస్పీలు విధులు నిర్వహించాలని సిఎం నిర్ణయించారు. ప్రస్తుతం ఉన్న కలెక్టర్లు, ఎస్పీలను కొత్త జిల్లాలకు పంపాలని అధికారులను ఆదేశించారు. కొత్త జిల్లాలపై తుది నోటిఫికేషన్ వచ్చిన రోజు నుండే పాలన నిర్వహించాలని సిఎం సూచించారు.
కొత్త జిల్లాల ఏర్పాటు తర్వాత యంత్రాంగం సమర్థవంతంగా పనిచేయాలి. పాలన ప్రారంభమైన తర్వాత ఎలాంటి ఆయోమయం ఉండకూడదన్నారు. ఉగాది నుండి కొత్త జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు ఆయా జిల్లాల కేంద్రాల నుండి పనిచేయాలన్నారు. కొత్త భవనాల నిర్మాణంపై ప్రణాళికలు ఖరారు చేయాలని, అభ్యంతరాల విషయంలో హేతుబద్ధత ఉన్నప్పుడు దానిపై నిశిత పరిశీలన చేయాలన్నారు. రాష్ట్రంలో 26 జిల్లాలను ఏర్పాటుచేస్తూ ప్రభుత్వం గత నెల 25వ తేదీన నోటిఫికేషన్ జారీ చేసింది. నోటిఫికేషన్ జారీ చేసిన 30 రోజుల్లోగా జిల్లాల ఏర్పాటుపై అభ్యంతరాలు, సూచనలు, సలహాలు ఇవ్వాలని ప్రభుత్వం తెలిపింది. ఇప్పటి వరకు వచ్చిన అభ్యంతరాలను, ప్రజలనుండి వచ్చిన సలహాలను పరిశీలిస్తున్నారు.