ఎపి మంత్రిగా బాధ్యతలు చేపట్టిన ఆర్కే రోజా..

అమరావతి (CLiC2NEWS): ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటక, క్రీడలు, యువజన సర్వీసుల శాఖ మంత్రిగా నగరి ఎమ్మెల్యే రోజా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా మంత్రి రోజా మాట్లాడుతూ.. పార్టీ పెట్టక ముందు నుంచి సిఎం జగన్ అడుగు జాడల్లో నడిచాను, మంత్రులుగా ఉన్న వారంతా జగన్ సైనికుల్లా పని చేశారు. పార్టీ కోసం జెండా పట్టుకొని నడిచిన ప్రతి ఒక్కరికీ సిఎం జగన్ న్యాయం చేస్తున్నారన్నారు. జగనన్న నమ్మకాన్ని వమ్ము చేయను. రాష్ట్రంలో ఉన్నవనరులను ఉపమోగించుకొని అభివృద్ది చేస్తాం. సముద్ర తీర ప్రాంతాలను పర్యాటకంగా అభివృద్ది చేస్తామని, విదేశీ పర్యాటకులను ఆకర్షించే విధంగా రాష్ట్రంలో అనుకూలమైన టూరిజంను అభివృద్ధి చేస్తామని అన్నారు.
క్రీడలపై ప్రత్యేక దృష్టి పెట్టి అభివృద్ధికి కృషి చేస్తానని, గ్రామీణ స్థాయి క్రీడలను ప్రోత్సహించేందుకు అన్ని చర్యలు తీసుకుంటామని రోజా తెలిపారు. ఒక ఆర్టిస్ట్‌గా కళాకారుల సమస్యలు తెలుసునని, కళాకారులకు మంచి చేసేలా నిర్ణయాలు తీసుకుంటామని అన్నారు. గండికోట నుండి బెంగుళూరుకు పర్యాటకం కోసం బస్సు సర్వీసు ఏర్పాటుపై మొదటి సంతకం చేస్తా’ అని ఆమె తెలిపారు.
ఇకపై షూటింగ్‌లు చేయను: ఆర్కే రోజా