రెవెన్యూ పెంపుపై జలమండలి ప్రత్యేక కార్యాచరణ
అధికారులతో జలమండలి ఎండీ సమీక్ష

హైదరాబాద్ (CLiC2NEWS): జీహెచ్ఎంసీ పరిధిలోని ప్రజలకు ప్రభుత్వం అందిస్తున్న నెలకు 20 వేల లీటర్ల ఉచిత నీటి పథకానికి అర్హులు కాని, నమోదు చేసుకోని వారి నుంచి ఈ జనవరి నుంచి ఇప్పటివరకు నల్లా బిల్లులను, బకాయిలను వసూలు చేయాలని జలమండలి ఎండీ దానకిశోర్ పేర్కొన్నారు. శనివారం ఖైరతాబాద్‌లోని జలమండలి ప్రధాన కార్యాలయంలో అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా దానకిశోర్ మాట్లాడుతూ.. జీహెచ్ఎంసీ పరిధిలో ఇప్పటికీ 4.2 లక్షల మంది వినియోగదారులు అర్హత ఉండి కూడా ఉచిత నీటి పథకానికి నమోదు చేసుకోలేదన్నారు. వీరికి ఉచిత మంచినీటి పథకానికి నమోదు చేసుకోవడానికి 13 నెలల వెసులుబాటును కల్పించిందని తెలిపారు.
కాబట్టి, ఈ పథకానికి నమోదు చేసుకోని వినియోగదారుల నుంచి ఈ సంవత్సరం జనవరి నుంచి ఇప్పటివరకు బిల్లులు వసూలు చేయాలని పేర్కొన్నారు. ఇప్పటికే మొత్తం గృహవసరాల వినియోగదారులకు డిసెంబరు 2020 నుంచి డిసెంబరు 2021 వరకు 13 నెలల బిల్లులను ప్రభుత్వం రూ.520 కోట్లు మాఫీ చేసినట్లు తెలిపారు.
ఉచిత నీటి పథకానికి నమోదు చేసుకోని 4.2 లక్షల మంది వినియోగదారుల్లో పని చేస్తున్న మీటర్లు కలిగిన వినియోగదారులు ఆధార్ లింక్ చేసుకొని ఈ పథకానికి నమోదు చేయించుకునేలా ఏర్పాట్లు చేయాలని సూచించారు.
పని చేయని మీటర్లు ఉన్న కనెక్షన్లను గుర్తించి కొత్త మీటర్లను ఏర్పాటు చేసుకునేలా చూడాలన్నారు. నెలకు 20 వేల లీటర్ల ఉచిత నీటి పథకానికి ఎప్పుడైనా నమోదు చేసుకునే అవకాశం ఉందని, నమోదు చేసుకున్న నాటి నుంచి వారికి ఈ పథకం వర్తిస్తుందని తెలిపారు. నల్లా కనెక్షన్‌కు పని చేసే మీటరు ఉండి, ఆధార్ లింక్ చేసుకుంటే ఈ పథకానికి నమోదు చేసుకోవచ్చన్నారు. ఇక, 2020 డిసెంబరు కంటే ముందు ఉన్న బకాయిలను సైతం వసూలు చేయాలని ఆదేశించారు.
నెలకు 20 వేల లీటర్ల ఉచిత నీటి పథకానికి నమోదు కాని వారు బకాయిలు చెల్లించాలని సూచిస్తూ ముందుగా నోటీసులు ఇవ్వాలని ఆదేశించారు. వీరికి సమాచారం అందించేందుకు, ఆధార్ అనుసంధానంలో ఏదైనా సందేహాలను నివృత్తి చేయడానికి 30 మందితో కాల్ సెంటర్ ఏర్పాటుచేస్తున్నామని, కాల్ సెంటర్ నుంచి ఫోన్లు, మెసేజ్‌లు పంపించనున్నట్లు తెలిపారు. అలాగే, ఇంటెరాక్టీవ్ వాట్సాప్ చాట్‌బోట్ సదుపాయాన్ని కూడా ఏర్పాటుచేస్తున్నట్లు పేర్కొన్నారు.
పట్టణ ప్రగతికి సమాయత్తం
ఇక, త్వరలో ప్రభుత్వం పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని ప్రారంభించనున్న నేపథ్యంలో సెక్షన్లవారీగా చేపట్టాల్సిన ప్రణాళికలను సిద్ధం చేసుకోవాలని అధికారులకు సూచించారు. ఇప్పటికే చాలా వరకు డీసిల్టింగ్, తదితర పనులు పూర్తి చేసినట్లు తెలిపారు. ఇంకా ఎక్కడైనా పనులు అసంపూర్తిగా ఉంటే ఆ పనులను త్వరగా పూర్తి చేయాలని సూచించారు.
25 నుంచి భద్రతా వారోత్సవాలు
ఈ నెల 25వ తేదీ నుంచి నగరంతో పాటు ఓఆర్ఆర్ పరిధిలో భద్రతా వారోత్సవాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగా పని ప్రదేశాల్లో కార్మికులు, సిబ్బంది తీసుకోవాల్సిన రక్షణ చర్యలు, ఉపయోగించాల్సిన రక్షణ పరికరాల గురించి అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు. వర్షాలు పడుతున్న సమయంలో ప్రజలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో కూడా అవగాహన కల్పించాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో రెవెన్యూ డైరెక్టర్ వీఎల్ ప్రవీణ్ కుమార్, ఆపరేషన్స్ డైరెక్టర్లు అజ్మీరా కృష్ణ, స్వామి, సీజీఎంలు, జీఎంలుల, డీజీఎంలు, మేనేజర్లు, ట్రాన్స్‌మిషన్ అధికారులు పాల్గొన్నారు.