కేంద్రానికి ఆర్‌బీఐ రూ.57,128 కోట్ల చెక్

కేంద్రానికి ఆర్‌బీఐ రూ.57,128 కోట్ల చెక్

ముంబై:గత ఆర్థిక సంవత్సరానికి (2019-20) గాను ఆర్‌బీఐ తన మిగులు నిల్వల నుంచి రూ.57,128 కోట్లు కేంద్ర ప్రభుత్వానికి బదిలీ చేయనుంది. ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ అధ్యక్షతన జరిగిన 54వ సెంట్రల్ బోర్డు సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. దీనికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) బోర్డ్ శుక్రవారం ఆమోదముద్ర వేసింది. 2019-20 ఆర్థిక సంవత్సరానికిగాను ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఒక ప్రకటన వెల్లడించింది. సెంట్రల్ బోర్డ్ 54వ సెంట్రల్ బోర్డ్ సమావేశం సందర్భంగా ఆర్‌బీఐ ఈ కీలక నిర్ణయం తీసుకుంది. మిగులు నిల్వల నిర్వహణపై బిమల్ జలాన్ కమిటీ సిఫారసులను ఆమోదించిన అనంతరం అదనపు కేటాయింపుల కింద మరో రూ.52,637 కోట్లు చెల్లించింది. మాజీ గవర్నర్ ఉర్జిత్ పటేల్ హయాంలో ఆర్‌బీఐ,కేంద్ర ప్రభుత్వానికి మధ్య విభేధాలకు ప్రధాన కారణాల్లో మిగులు నిల్వల నిర్వహణ అంశం కూడా ఒకటి. ఈ నిల్వల సముచిత స్థాయిని నిర్ణయించేందు కోసం ఆర్‌బీఐ మాజీ గవర్నర్ బిమల్ జలాన్ అధ్యక్షతన ఏర్పాటైన కమిటీ సిఫారసులను ఆర్‌బీఐ సెంట్రల్ బోర్డు గత ఏడాది ఆమోదించింది. ఈసారి ఆర్‌బీఐ నుంచి రూ.60,000 కోట్ల డివిడెండ్ లభించవచ్చన్న ప్రభుత్వ అంచనాలు తప్పాయి. కరోనా సంక్షోభంతో సర్కారు ఖజానాకు ఇప్పటికే భారీ గండి పడింది. ఈ తరుణంలో ఆర్‌బీఐ డివిడెండ్ చెల్లింపులు అంచనాల కంటే తగ్గడం సర్కారుకు ఇబ్బందికరమే. ఎందుకంటే, కరోనా కష్టాల్లో ప్రభుత్వానికి పన్ను వసూళ్లు తగ్గడంతో పాటు ఇతర మార్గా ల్లో ఆదాయాలూ సన్నగిల్లాయి. ఇదే సమయంలో ప్రభుత్వం భారీగా ఖర్చు చేయాల్సి వస్తోంది. దీంతో ఈసారి ప్రభుత్వ ద్రవ్యలోటు (ఆదాయం, వ్యయానికి మధ్య అంతరం) భారీగా పెరగవచ్చని ఆర్థికవేత్తలు భావిస్తున్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ద్రవ్యలోటు జీడీపీలో 7.4 శాతానికి చేరుకోవచ్చని స్టాండర్డ్ చార్టర్డ్ అంచనా వేసింది. ద్రవ్యలోటును పూడ్చుకునేందుకు ప్రభుత్వం మార్కెట్ నుంచి రుణాలు సేకరిస్తుంది.

అత్యవసర నిధి (కంటిజెన్సీ రిస్క్ బఫర్)ని మొత్తం ఆస్తుల్లో 5.5 శాతంగా కొనసాగించాలని తాజా సమావేశంలో ఆర్‌బీఐ సెంట్రల్ బోర్డు నిర్ణయించింది. జలాన్ కమిటీ సిఫారసుల మేరకు గత ఏడాది అమలులోకి తెచ్చిన కొత్త నియమావళి ప్రకారం.. మొత్తం ఆస్తుల్లో 5.5-6.5 శాతం నిధులను అత్యవసర నిధిగా నిర్వహించాల్సి ఉంటుంది. జలాన్ కమిటీ సిఫారసుల ఆమోదానికి ముందు ఆర్‌బీఐ మూలధన నిధుల్లో 6. శాతాన్ని అత్యవసర నిధిగా నిర్వహించేది.
ఆర్‌బీఐ ఆర్థిక సంవత్సరంలో మార్పు!

ప్రస్తుతం ఆర్‌బీఐ జూలై నుంచి జూన్ వరకు ఆర్థిక సంవత్సరంగా లెక్కలోకి తీసుకుంటుంది. ఉదాహరణకు, ఆర్‌బీఐకి గత ఆర్థిక సంవత్సరం 2019 జూలై 1న మొదలై 2020 జూన్ 30తో ముగిసింది. కానీ, ప్రభుత్వ ఆర్థిక సంవత్సరం మాత్రం గత ఏడాది ఏప్రిల్ 1న మొదలై ఈ మార్చి 31తో ముగిసింది. వచ్చేసారి (2021-22) నుంచి ఆర్‌బీఐ కూడా ప్రభుత్వ ఆర్థిక సంవత్సరాన్నే పాటించనుంది. దాంతో ఆర్‌బీఐకి ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21) 9 నెలలే. అంటే, ఈ జూలై 1న మొదలై వచ్చే ఏడాది మార్చి 31కి ముగియనుంది.

Leave A Reply

Your email address will not be published.