నిఘా నేత్రం నీడలో పెద్దపల్లి పట్టణం..
51 సిసి కెమెరాలను ప్రారంభించిన రామగుండం సిపి చంద్రశేఖర్ రెడ్డి

పెద్దపల్లి (CLiC2NEWS): పట్టణ కేంద్రంలోని ప్రధాన కూడళ్లలో నూతనంగా ఏర్పాటు చేసిన అత్యాధునిక టెక్నాలజీ తో ఏర్పాటు చేసిన 51 సిసి కెమెరాలను పెద్దపల్లి పట్టణ పోలీస్ స్టేషన్ అవరణలో రామగుండం పోలీస్ కమీషనర్ ఎస్. చంద్రశేఖర్ రెడ్డి, ఐపిఎస్, పెద్దపల్లి జోన్ ఇంచార్జ్ డిసిపి అఖిల్ మహాజన్‌తో కలిసి ప్రారంభించారు.
ఈసందర్బంగా సిపి మాట్లాడుతూ.. పోలీసు వ్యవస్థను పటిష్టం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంలో భాగంగా ఎక్కడ ఎలాంటి నేరాలు జరిగినా తక్షణమే స్పందించేలా పట్టణం మొత్తంగా నూతనంగా 51 సిసి కెమెరాలు ఏర్పాటు చేయడం జరిగింది అన్నారు. నిఘా నేత్రల నీడ లో నేరాల నియంత్రణ, ట్రాఫిక్ క్రమబద్ధీకరణ పై పోలీసు శాఖ దృష్టి సారించింది అన్నారు. పట్టణం లో ఈ కెమెరాలు నిరంతరం 360 డిగ్రీల్లో తిరుగుతూ ప్రతీ దృశ్యాన్ని రికార్డు చేస్తాయని అన్నారు. వీటి ద్వారా వంద మీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయిన వెంటనే గుర్తించి పరిష్కరించవచ్చు. రాత్రి వేళల్లోనూ దృశ్యాలను స్పష్టంగా చిత్రీకరిస్తాయని నేరస్తులను గుర్తించడానికి, ఏదైనా సంఘటన జరిగిన వెంటనే నేరస్తులను పట్టుకోవడానికి ఈ కెమెరాలు ఉపయోగపడుతాయని సిపి గారు అన్నారు. పెద్దపల్లి లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడమే కాకుండా వాటి పనితీరును ఎప్పటికప్పుడు పర్యవేక్షించేలా పోలీసుస్టేషన్‌లో ప్రత్యేకంగా కంట్రోల్ రూం ఏర్పాటు చేయడం జరిగింది అన్నారు. క్రైం, లా అండ్ ఆర్డర్, ట్రాఫిక్ విభాగాల నుంచి పోలీస్ సిబ్బందిని కంట్రోల్ రూంలో సీసీ కెమెరాల దృశ్యాలను విశ్లేషిస్తుంటారని అన్నారు.
అనంతరం సిపి చంద్రశేఖర్ రెడ్డి అధికారులతో కలిసి పోలీస్ స్టేషన్ ఆవరణలో మొక్కలు నాటడం జరిగింది. ఈ కార్యక్రమంలో పెద్దపెల్లి జోన్ ఇన్చార్జి డిసిపి అఖిల్ మహాజన్ , ఎసిపి సారంగపాణి, పెద్దపల్లి సర్కిల్ ఇన్స్పెక్టర్ ప్రదీప్ కుమార్, పెద్దపల్లి ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ అనిల్, సబ్ డివిజన్ ఎస్ఐ లు పాల్గొన్నారు..