వరంగల్‌కు పూర్వ వైభవం తీసుకొస్తాం: మంత్రి కెటిఆర్
తెలంగాణలో ఏం జరుగుతుందో ప్రపంచానికి తెలియాలి
వరంగల్ (CLiC2NEWS): వరంగల్ జిల్లాలో యంగ్ వన్ కంపెనీ ఏర్పాటు చేయనున్న టెక్స్‌టైల్ పార్కుకు మంత్రి కెటిఆర్ శంకుస్థాపన చేశారు. మొత్తం 261 ఎకరాల్లో రూ. 900 కోట్లతో ఈ టెక్స్‌టైల్ పార్కును నిర్మించనున్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఉమ్మడి వరంగల్ జిల్లాకు మరిన్ని పరిశ్రమలు తీసుకురావడం ద్వారా పూర్వ వైభవం తీసుకొస్తామని కెటిఆర్ అన్నారు. పార్కు నిర్మాణానికి భూములిచ్చిన రైతులకు ఈ సందర్భంగా కెటిఆర్ కృతజ్ఞతలు తెలిపారు.
వరంగల్‌లో నాణ్యమైన పత్తి పండుతోందని.. ఇప్పటికే ఇక్కడున్న గణేశా కంపెనీ రూ. 600 కోట్ల పెట్టుబడి పెట్టిందని తెలిపారు. ఈ కంపెనీలో వెయ్యి మందికి ఉద్యోగాలు వచ్చాయన్నారు. యంగ్ వన్ కంపెనీ కొరియాలో పెద్ద పరిశ్రమని.. దీని ద్వారా మొత్తం 11 పరిశ్రమలు వస్తాయన్నారు. దీంతో వేల ఉద్యోగాలు వస్తాయని.. వాటిలో 99 శాతం స్థానికులకేనని తెలిపారు. టెక్స్‌టైల్స్ రంగంలో బంగ్లాదేశ్, శ్రీలంక మనదేశం కంటే ముందున్నాయని.. కేంద్ర ప్రభుత్వం ఇటీవలే పిఎం మిత్ర పథకం తీసుకొచ్చిందన్నారు. తెలంగాణలో ఏం జరుగుతుందో ప్రపంచానికి తెలియాలని మంత్రి కెటిఆర్ అన్నారు. వరంగల్‌లో రానున్న 3 కంపెనీల ద్వారా 33 వేల ఉద్యోగాలు వస్తాయన్నారు.