hyd: నాలాలో గల్లంతైన బాలుడి మృతి

హైదరాబాద్ (CLiC2NEWS): తెలంగాణ వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలు పలు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. భారీ వర్షాలకు నాలుగేళ్ల బాలుడు మృతి చెందిన ఘటన హైదరాబాద్‌లో చోటుచేసుకుంది. ఈ ప్రమాదం నగరంలోని ప్రగతినగర్ లో జరిగింది. మంగళవారం బాచుపల్లి నాలాలో నాలుగు సంవత్సరాల బాలుడు మిథున్ గల్లంతయ్యాడు. వెంటనే కుటుంబ సభ్యులు స్థానికులతో సహా గాలింపు చర్యలు చేపట్టినా ఫలితం లేకుండా పోయింది.
సూర్యాపేటకు చెందిన సంతోష్ రెడ్డి గత 5 సంవత్సరాల నుంచి ప్రగతినగర్‌లోని ఎన్నారై కాలనీలో నివాసం ఉంటున్నారు. సంతోష్‌రెడ్డి రెండవ కుమారుడు మిథున్ రెడ్డి ఇంటి నుంచి బయటకు వచ్చి మూత లేని మ్యాన్‌హోల్ పడి గల్లంతయ్యాడు. విషయం తెలుసుకొన్న కుటుంబ సభ్యులు, స్థానికులు ఎంత గాలించినా ఫలితం లేకుండా పోయింది. బాచుపల్లి నాలా కలిసే ప్రగతి నగర్ తుర్క చెరువులో డిఆర్ ఎఫ్ బృందాలు గాలింపు చేపట్టగా మిథున్ మృతదేహం లభ్యమైంది.