ఇస్రోకు 2023 లీఫ్ ఎరిక్సన్ లూనార్ ఫ్రైజ్..

ఢిల్లీ (CLiC2NEWS): చంద్రయాన్-3 విజయవంతం చేసినందుకు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో)కు ఐస్లాండ్ అవార్డును అందజేసింది. ఐస్లాండ్లోని హుసావిక్లో గల ఎక్స్‌ప్లోరేషన్ మ్యూజియం 2023 లీఫ్ ఎరిక్సన్ లూనార్ ప్రైజ్‌ను ఇస్రోకి అందజేసింది. ఈ ఏడాది ఆగస్టు నెలలో ఇస్రో పంపిన చంద్రయాన్-3 మొట్టమెదటి సారిగా చంద్రుడి దక్షిణ ధ్రువం మీద ల్యాండ్ అయిన విషయం తెలిసిందే. ఈ అవార్డును ఇస్రో తరపున భారత రాయబారి బి.శ్యాం అందుకున్నారు. చంద్రుడి గురించి అన్వేషణను ముందుకు తీసుకువెళ్లడంలో, ఖగోళ రహస్యాల ఛేదనలో ఇస్రో తిరుగులేని స్ఫూర్తిని ప్రదర్శించిందని ఐస్లాండ్ రాజధాని రెయ్‌కావిక్‌లోని భారత రాయబార కార్యాలయం ఎక్స్ ద్వారా తెలిపింది. ఐస్లాండ్కు కృతజ్ఞతలు తెలుపుతూ ఇస్రో ఛైర్మన్ ఎస్.సోమనాథ్ వీడియో సందేశం పంపినట్లు సమాచారం.