నాలుగేళ్లలోపు పిల్లలకు ఎఫ్‌డిసి జలుబు నివారణ మందులు వాడొద్దు..

ఢిల్లీ (CLiC2NEWS): ఫిక్స్‌డ్ డోస్ కాంబినేషన్ (FDC)తో ఉన్న జలుబు నివారణ ఔషధాలు నాలుగేళ్లలోపు పిల్లలకు వాడొద్దని కేంద్రం తెలిపింది. వీటిని కేంద్ర ఔషధ ప్రమాణాల నియంత్రణ సంస్థ (CDSCO) నిషేధించింది. ఈ మేరకు భారత ఔషధ నియంత్రణ మండలి(DGCI) ప్రకటనలో వెల్లడించింది. రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ఔషధ నియంత్రణ శాఖలకు కూడా ఆదేశాలు జారీ చేసింది. రెండు లేదా అంతకంటే ఎక్కువ ఔషధాలను కలిపి ఒకే ఔషధంగా ఆవిస్కరిస్తే, దానిని ఎఫ్‌డిసి ఔషధంగా పరిగణిస్తారు.
ఎఫ్‌డిసి ఔషధాల తయారీకి 2017 జులై 17 నుండి అనుమతించినట్లు డిజిసిఐ డైరెక్టర్ జనరల్ రాజీవ్ రఘువంశీ తెలిపారు. అయితే, చిన్న పిల్లలకు ఎఫ్‌డిసి వినియోగం ఆమోదయోగ్యం కాదని శ్వాసకోశ సంబంధ వ్యాధుల నిపుణుల కమిటితో చర్చలు జరిపినట్లు వివరించారు. కమిటి సూచనలు మేరకు నాలుగేళ్ల కేంటే తక్కువ వయసున్న చిన్నారులకు జలుబు నివారణకు ఎఫ్‌డిసి ఔషధాల వినియోగంపై నిషేధం విధించాలని నిర్ణయించినట్లు ఆయన వెల్లడించారు. 2016 లో ఒకసారి 322 ఎఫ్‌డిసి మెడిసిన్స్‌పై కేంద్రం నిషేధం విధించింది.