జనవరి నుండి అమెరికాలోనే H-1B వీసా రెన్యువల్..

వాషింగ్టన్ (CLiC2NEWS): హెచ్-1బి వీసాలను అమెరికాలోనే రెన్యువల్ చేసుకునేలా బైడెన్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ పైలట్ ప్రోగ్రామ్ వచ్చే ఏడాది జనవరి 29 నుండి ప్రారంభించనున్నట్లు సమాచారం. ముందుగా 20 వేల వీసాల రెన్యువల్‌కు పైలట్ కార్యక్రమాన్ని చేపట్టాలని నిర్ణయించారు. తొలి దశ రెన్యువల్ అవకాశాన్ని కేవలం భారతీయులు, కెనడియన్లకు మాత్రమే కల్పిస్తున్నట్లు యుఎస్ ఫెడరల్ రిజిస్ట్రి తమ నోటీసులలో వెల్లడించింది.
విదేశీ వృత్తి నిపుణులకు అమెరికా పని చేయడానికి ఇచ్చే అనుమతి పత్రాన్ని H-1B వీసా అంటారు. ఈ వీసా గడువు మూడేళ్లు. దాన్ని మరో మూడోళ్లు పొడిగించుకోవాడానికి అమెరికా నుండి స్వదేశానికి రావాలి. లేదా మరేదైనా దేశం వెళ్లి పునరుద్ధరించుకోవాలి. ఈ ఏడాది జూన్‌లో ప్రధాని మోడీ అమెరికా పర్యటనలో భాగంగా హెచ్-1బి వీసాలు అమెరికాలోనే రెన్యువల్ చేస్తామని బైడెన్ ప్రభుత్వం హామీ ఇచ్చింది.
ఈ పైలట్ పోగ్రాంలో కేవలం హెచ్-1బి వీసాలను మాత్రమే రెన్యువల్ చేయనున్నారు. 2020 జనవరి నుండి 2023 ఏప్రిల్ 1 మధ్య మిషన్ కెనడా జారీ చేసిన వీసాలు.. 2021 ఫిబ్రవరి 1 నుండి 2021 సెప్టెంబర్ 30 మధ్య మిషన్ ఇండియా జారీ చేసిన వీసాలను మాత్రమే రెన్యువల్ చేయనున్నారు.
హెచ్-1బి వీసా దారులు 2024 జనవరి 29 నుండి ఏప్రిల్ 1వ తేదీ వరకు అమెరికాలోనే రెన్యువల్ చేసుకోవచ్చు. ప్రతి వారం 4వేల స్లాట్లను అందుబాటులోకి తీసుకురానున్నారు. వీటిలో 2 వేలు భారతీయులకు కేటాయిస్తారు. జనవరి 29, ఫిబ్రవరి 5, ఫిబ్రవరి 12, ఫిబ్రవరి 19, ఫిబ్రవరి 26వ తేదీల్లో ఈ స్లాట్లను అందుబాటులో ఉంటాయి. వీసా రెన్యువల్ కోసం రాతపూర్వక వివరణ, సంబంధిత పత్రాలు సమర్పణకు 2024 ఏప్రిల్ 15 వరకు గడువుంది.