టివిజి: కాకినాడ కోటయ్య కాజ

1857 సిపాయిల తిరుగుబాటు జరుగుతున్న కాలం. ప్రాణాలను తృణప్రాయంగా అర్పిస్తూ భరతమాత స్వేచ్చా వాయువులకోసం భారతవీరులు కరవాలాలు ఝళిపిస్తున్నారు . ఆదే కాలంలో భారతదేశం అద్భుత ప్రతిభావంతులకు జన్మనిస్తున్న సమయం కూడా. తెలుగు వీరుల గడ్డ గుంటూరు జిల్లా తెనాలి తాలూకా చిన్నపరిమి గ్రామంలో వ్యవసాయదారుల కుటుంబం ఓ ప్రతిభావంతుడుకి జన్మనిచ్చింది.అతడే చిట్టిపెద్ది కోటయ్య .చిన్ననాటి నుండి కోటయ్యను తండ్రి తన కూడా పొలానికి తీసుకుపోవాలని ఆరాటపడేవాడు. పొలం పని అస్సలు ఇష్టం ఉండేది కాదు కోటయ్యకు . పదేళ్ళ వయస్సుకే కోటయ్యలో నూతన ఆలోచనలు గజి బిజి చేయసాగాయి. అమ్మ పిండివంటలు చేస్తున్నప్పుడల్లా ఎంతో సంబర పడిపోయేవాడు.తనూ కూడా ఉండలు ఒత్తుతూనో , గరెటెలతో వండినవి పెనం నుండి దించుతుంటేనో చెప్పలేని ఆనందం కలిగేది కోటయ్యకు.
పొలం పనికి కోటయ్య రావటంలేదని ఆరోజు పెద్ద రాద్దాంతం చేసాడు కోటయ్య తండ్రి. పొలం పని ఇష్టంలేని కోటయ్య పదేళ్ళవయస్సులో అర్దరాత్రి ఇంటినుండి పారిపోయేడు. కన్నవారు కోటయ్య కోసం వెతకని ఊరులేదూ వెతకని చోటూ లేదు .కోటయ్య పోయి పోయి తిరుపతి చేరుకున్నాడు. ఎలా బ్రతకాలో బ్రతకడానికి ఏంచెయ్యాలో తెలియని వయస్సు కోటయ్యది. దూరంగా ఏడుకొండలు కనిపిస్తున్నాయి. అమ్మ ఏడుకొండలవాడా అంటూ పూజలు చేయడం గుర్తుకు వచ్చింది. ఇంతలో తన ముందర నుండి భక్తులగుంపు ” ఏడుకొండలవాడా వెంకటరమణా ” అంటూ కొండ ఎక్కడం చూసాడు.తను కూడా” ఏడుకొండలవాడా వెంకటరమణా ” అంటూ నడవడం మొదలెట్టాడు కోటయ్య . కొంత సేపటికి తిరుపతి కొండ ఎక్కలేక ఓ చెట్టు క్రింద కూలబడిపోయాడు. ఓ ప్రక్క ఆకలి దంచేస్తుంది . ఇంతలో ఓ భక్తుల బృందం కొండ దిగుతుంది. అందులో ఓ ముసలావిడ అలసిపోయి ఆకలితో దిగులుగా కూర్చున్న కోటయ్య దగ్గరకు వచ్చి చేతిలో తిరుపతి లడ్డు పెట్టింది. గబా గబా సగం తినేసాడు. అబ్బ ఎంత రుచిగా వుందో అనేలోపు లడ్డూతీపిలోని మాధుర్యానికి కోటయ్య కనులు మెల్లగా మూతలు పడ్డాయి. కనులు తెరచి చూసే సరికి చెన్నపట్టణం అంటే ఇప్పుడు చెన్నై నగరం లో మంచం మీద పడుకుని ఉన్నాడు. వంటపాత్రల చప్పుడుకు మెలకువ వచ్చి గబ గబా మంచం దిగి గది బయటకు వచ్చి చూసాడు. అక్కడ చాలా మంది పనివాళ్ళు రకరకాల మిఠాయిలు చేస్తూ ఉన్నారు. అక్కడ కుర్చీలో జేరబడి వినసకర్ర విసురుకుంటూ ఉన్న బామ్మ కనబడింది. ఆ బామ్మే తనకు చేతిలో లడ్డు పెట్టిన బామ్మ అని గుర్తు పట్టాడు కోటయ్య . బామ్మ కోటయ్యను చూడగానే లేచి దగ్గరకు వచ్చింది. “ఏం నాయనా ఇప్పటికి కళ్ళు తెరచావా. నీకు లడ్డూ పెట్టగానే తింటూనే నిద్రపోయావు. నువు ఎవరో ఏంటో ఎవరిబిడ్డవో తెలియదు .అందుకే అక్కడ నిన్ను వదిలేయలేక తీసుకువచ్చాను మా ఇంటికి” అంటూ కోటయ్యకు గాలి విసురుతూ చెపుతుంది. కోటయ్యకు మెల్లగా అర్దమయ్యింది. బామ్మగారి బుగ్గన ముద్దుపెట్టాడు. బామ్మగారి మనస్సు వెన్నలా కరిగిపోయింది. తన వృత్తాంతమంతా చెప్పాడు బామ్మగారికి. “పాలుగారే ఉన్నావు నిన్ను కొడతాడా మీ నాన్న వద్దులే అక్కడకు పోవద్దు ఇదిగో మా మిఠాయి దుకాణంలో రకరకాల వంటలు నేర్చుకుంటూ ఇక్కడే ఉండిపో” అంది. కోటయ్యకు బామ్మగారి ప్రేమాభిమానాలు మిఠాయి దుకాణం ఎంతో నచ్చేసింది. కోటయ్య నెల తిరిగేలోపే అన్ని రకారకాల మిఠాయిలు వండటం నేర్చేసుకున్నాడు. పన్నెండేళ్ళు గిర్రున తిరిగాయి. ఇరవై రెండేళ్ళు వచ్చేసరికి చిట్టిపెద్ది కోటయ్యకు ఇంటి వైపు మనసు లాగింది. అమ్మా నాన్నలను చూడాలనిపించింది. మెల్లగా బామ్మ దగ్గరకు పోయి ” మా ఇంటికి వెళతాను” అని బామ్మతో చెప్పాడు. బామ్మకు దుఖః ఆగలేదు కోటయ్య పట్ల ప్రేమ పెంచుకుంది మరి. బామ్మ కన్నీళ్ళు తుడుచుకుని “వెళ్ళు కోటయ్య మీ అమ్మ నీకోసం ఎంత ఏడుస్తుందో ఎంత బెంగ పెట్టుకుందో” అంటూ గబగబా లోపలికి వెళ్ళి డబ్బుల మూట ఇచ్చి దీవించి పంపింది.
చెన్నపట్టణం మద్రాసుగా మారింది. మద్రాసు నగరం నుండి తెనాలి చేరి తన ఊరు చిన్నపరిమి చేరుకున్నాడు. ఇంటి ముందుకు వెళ్ళి “అమ్మా ! నాన్నా !” అని పిలిచాడు కోటయ్య. ఎన్నాళ్ళగానో ఆ పిలుపుకోసమే ఎదురు చూస్తున్న కోటయ్య తల్లిదండ్రులు గబగబా బయటకు వచ్చి నూనూగు మీసాల కోటయ్యను చూసి గుర్తుపట్టి కౌగిలించుకుని ముద్దాడుతూ తనివితీరా ఏడ్చారు.క్షమించమని తండ్రి కన్నీళ్ళు పెట్టుకున్నాడు. అమ్మా నాన్నల కాళ్ళకు నమస్కరించి లోపలికి నడిచాడు కోటయ్య.
1888 గాంధీ ఇంగ్లాండు నగరం బారేట్ల చదవడానికి ఓడమీద వెళుతున్న సమయం.
కోటయ్యకు తల్లిదండ్రులు అనసూయతో పెండ్లి జరిపించారు. కోటయ్య తెనాలిలో మిఠాయి దుకాణం తెరిచాడు. అనతికాలంలోనే మంచి మిఠాయి దుకాణంగా పేరుతెచ్చుకుంది. అయితే ప్రతిభావంతులు ఎప్పుడూ చేతులు కట్టుకు కూర్చోరు. తన పనిలో గొప్పదనం కోసం నిరంతరం ప్రయత్నిస్తూ ఉంటారు. కోటయ్య మనస్సు నూతన ఆవిష్కరణకు ప్రయత్నిస్తుంది. ఒక రోజు పిండితో కుస్తీ పడుతున్న కోటయ్యను చూసి భార్య ఏం చేస్తున్నారండి అంది. “అనసూయ మనం అమ్మే తినుబండారాలు అందరి దగ్గరా దొరికేవే నాకంటూ ఓ ప్రత్యేకత ఉండాలి అందుకు ఓ కొత్తరకం వంటకు ప్రయత్నిస్తున్నాను” అన్నాడు కోటయ్య “అసలు మీ ఆలోచన ఏంటో చెప్పవచ్చుకదా ” ” ఏం లేదు అనసూయ కొరికితే పాకం కారాలి కాని చూస్తుంటే లోపల పాకం ఉన్నట్టు కనబడకూడదు నొక్కితే గట్టిగా ఉండాలి” అన్నాడు కోటయ్య. “ఏంటి ఏంటి విడ్డూరంగా ఉందే “బుగ్గలు నొక్కుకుంటూ కళ్ళు పెద్దవి చేసి కోటయ్య ప్రక్కన పీట వేసుకు కూర్చుంది అనసూయ.
“ఏలా చేస్తారు మరి” “ఏం చేస్తానంటే ఇదిగో మైదా పిండి కేజి తీసుకున్నాను దీనికి ఓ వంద గ్రాములు పచ్చి సెనగపిండి కలుపుతాను.”
“మైదాలో సెనగపిండా బలేగుందండి” “అనసూయ నిన్న నువు తయారుచేసిన గుమగుమలాడే నెయ్యి తీసుకురా” అన్నాడు కోటయ్య. అనసూయ లేడిలా వంటగదిలోకి పరిగెత్తి నెయ్యి డబ్బా తెచ్చింది. కోటయ్య అందుకుంటూ ఇందులో వందగ్రాముల నెయ్యి వేస్తాను. వేసి ఇదిగో నెయ్యితో పిండిని పాలిష్ చేసినట్టు కలుతాను అంటూ ఓ పదినిమిషాలు
నెయ్యిని మొత్తం పిండికి పట్టించాడు.
“ఆ తరువాత ఏం చేస్తారు” ఆతృతగా అడిగింది అనసూయ. “వంటసోడా ఓ ఇరవై గ్రాములు వేస్తాను”. “నాకు తెలుసు వంటసోడా వేస్తే పొంగుతాయి కదా” అన్నది అనసూయ . “ఆ అవును అందుకే వేస్తాను . వేపినప్పుడు కరకరలాడడానికి కాస్త డాల్డ కూడా కలుపుతాను.” “మీ బుర్రే బుర్రండీ” మెచ్చుకుంటూ సాయంచేస్తుంది కోటయ్యకు భార్య అనసూయ. “కాస్త ఇత్తడి చెంబు తీసుకుని నీళ్ళుపొయ్యి “అన్నాడు . అనసూయ పిండిలో నీళ్ళు పోసింది. “ఇప్పుడు పిండిని కలిపి కలిపి ముద్దలా చేస్తాను చెయడమే కాదు ఓ అరగంటసేపు ముద్దను ఎత్తి కుదేస్తాను” అంటూ పళ్ళెం కేసి బాదడం మొదలెట్టాడు కోటయ్య . ఇలా చేస్తున్నాడే కాని అలా వండాలని కోటయ్యకూ తెలియదు ప్రయత్నిస్తూన్నాడంతే. కోటయ్యకు చేతులు నొప్పి పుట్టాయి. అనసూయ కోటయ్య అలసిపోవడం చూసి “పైకి లేవండి బాదింది చాలుగాని చేతులు కడుక్కొని భోంచేయండి అంది.” కోటయ్య అవస్దను చూస్తూ . వంటగదిలోకి వెళ్ళి భోజనం పళ్ళెం తెచ్చి పీటమీద పెట్టింది. కలిపిన పిండి ముద్దను ప్రక్కన పెట్టి దానిపై గుడ్డను కప్పాడు కోటయ్య. కోటయ్యకు తెలియదు అలా కొంత సేపు పిండిముద్దను ఉంచితే చక్కగా మృదువుగా అవుతుందని.
“భోజనం చేస్తున్నాడు గాని కోటయ్య “తరువాత ఏంచేయాలి ? అని అనుకుంటుంటే ఒక్కసారిగా పొలమారింది కోటయ్యకు. అనసూయ కోటయ్యకు మంచి నీళ్ళ చెంబు అందిస్తూ ” నాకు తెలుసు మన కాకినాడ చూట్టాలే తలుచుకుంటున్నారు. మొన్న దీపావళికి వచ్చినప్పుడు నాతో చెప్పారు. కాకినాడ లో మంచి మిఠాయి దుకాణం ఏదీ లేదు మీరు అక్కడకు వచ్చేయవచ్చు కదా . తెనాలి బాగా చిన్నఊరు కాకినాడ అయితే వ్యాపారం పెద్దదవుతుందని ” అంటూ చుట్టాలు సలహ ఇవ్వడం గుర్తు చేసుకుంది. చేయి కడుగుకుంటూ కోటయ్య “నాకు అలాగే అనిపిస్తుంది అనసూయ మద్రాసు లో చూసాను కదా ఎంత పెద్దనగరమైతే వ్యాపారం అంత పెద్దగా సాగుతుంది వెళదాము గాని ముందు మనకంటూ ఓ ప్రత్యేకమైన వంటకం ఉండాలి. నేను అనుకున్న వంటకం బాగా వస్తే రేపే ప్రయాణం ” అన్నాడు కోటయ్య. “ఇంకెందుకు ఆలస్యం మొదలెట్టండి” అంది అనసూయ సంతోషపడుతూ పిండి ముద్దను పీటపై వేసుకున్నాడు” ఏంచెయ్యాలి ఇప్పుడూ చేసేది ఏదైనా నేతి వంటకమే ఉండాలి అలాగే చేతిలో ఇమడాలి అంటే వ్రేలంత పొడవుంటే చాలు అనుకుని ఒక్కసారిగా వచ్చిన ఆలోచనతో “అనసూయ ముందు పొయ్యి వెలిగించి పెనం మీద కళాయి పెట్టి నెయ్యి మరిగించు” అన్నాడు. అదేంటండి నెయ్యంతా మరిగిస్తే రేపు వంటలకో అంది” అనసూయ .” మాట్లాడకు మన దశ తిరగబోతుంది బ్రహ్మండమైన ఆలోచన వచ్చింది.” అంటూ కోటయ్య పిండిని సన్నని గొట్టంలా చేసి ముక్కలు ముక్కలుగా ఇనపరేకు తో కోసాడు. ఇంతలో కళాయిలో నెయ్యి వేడెక్కింది. కోటయ్య పిండి ముక్క తీసుకుని వేలితో ఓ నొక్కు నొక్కి అప్పడాలు వత్తే కర్రతో అదిమి ఆ పిండి ముక్కను మరిగే నెయ్యిలో వేసాడు అంతే బుడగలా పొంగింది. కోటయ్య అనుకున్నది వచ్ఛేసింది. భార్య అనసూయ “ఇదేంటండి గొట్టంలా వుంది అంది. ” “అవును గొట్టాలే ” గబగబా ఓ యాబై గొట్టాలు తయారు చేసాడు కోటయ్య. ” అనసూయ బంగారు రంగులో వచ్చేక గరిటే బెట్టి గొట్టాలు పళ్ళెంలోకి తీసేయ్ ” అన్నాడు . అనసూయ కంగారుపడుతూ గొట్టాలను కళాయినుండి తీసే పళ్ళెంలో వేసింది.. “అదేంటండి అప్పుడే దించేయమన్నారు.” ” చెపుతాను గాని నువ్వు
కేజి పంచదార తీసుకుని దానికి సమానమైన నీరు పోసి పంచదార పాకం పట్టు ” అన్నాడు. అనసూయ కోటయ్య చెప్పినట్టే పంచదార పాకం పట్టింది. ఇంతలో కోటయ్య గొట్టాలు అన్నీ ఒకేసారి మరలా నెయ్యికళాయిలో వేసి గరెటెతో తిప్పుతూ గొట్టాలను ఎగరేస్తూ ఉన్నాడు. “అనసూయ అదేంటండి అలా ఎగరేస్తున్నారు మతిగాని పోయిందా” అంది కోటయ్య చేసేది అర్దంకాక . ” నాకు మతి పోలేదోయ్ ఎందుకు ఎగరేస్తున్నానంటే గొట్టాలు గలగల శబ్దం చేసేవరకూ వేపాలని”
“బాగానే ఉంది కాని పాకం వేడి తగ్గిపోతుంది” అంది అనసూయ.
“తగ్గితేనే మంచిది అనసూయ గొట్టాలు వేడిగా పాకం వేడితక్కువగా ఉంటే గొట్టాలలొకి పాకం ఎక్కువ పడుతుంది” అన్నాడు కోటయ్య.
భర్త కోటయ్య అనుకున్నది సాధించినట్టే ఉన్నాడనిపించింది అనసూయకు.
“అనసూయ రాత్రి నువు పడుకున్నాక జార అని తయారు చేసాను అది బయట అరుగుమీద ఉంది పట్టుకురా” అన్నాడు. ఇదెప్పుడు చేసాడు రాత్రంతా నిద్రపోలేదన్నమాట అనుకుంటూ భర్త ప్రయత్నానికి తనవంతు సాయం అందిస్తూ ఉంది అనసూయ. గరెటెలో మైదాపిండితో చేసిన గొట్టాలు గలగలలాడుతున్నాయ్ కోటయ్య ముఖం ఆనందంతో విప్పారింది. గొట్టాలను పంచదారపాకంలో వేసి జారతో ఓ నిమిషం నొక్కి బయటకు తీసాడు చిట్టిపెద్ది కోటయ్య.
భార్య అనసూయ ముఖం చిన్నబోయింది . గొట్టం గొట్టంలాగే వుంది ఏంవుంది ఇందులో అనుకుంది. కోటయ్య భార్యకు ఓ గొట్టం ఇచ్చి తినమన్నాడు. భర్త శ్రమను చూసి వద్దనలేక వంటకం సరిగా రాలేదు పాపం అనుకుంటూ గొట్టాన్ని పళ్ళమధ్య పెట్టి కొరికింది అంతే ఒక్కసారిగా నోటినిండా పాకం జలజలా కారింది. అనసూయ ఆశ్చర్యానికి అంతులేదు .కోటయ్య అనుకున్నది సాధించాడు. బయటకు మామూలుగా గట్టిగా కనిపిస్తుంది గొట్టం కాని నిండా పాకమే. పాకం గొట్టం లోపలికి ఎలా వెళ్ళిందో ఎవరికీ తెలియదు. బలే వంటకం.”ఏమండీ దీనికి ఏం పేరు పెడతారు ? ” అని అడిగింది. “అనసూయ దీనికి ” కాజ “అని పేరు పెడతాను. “గొట్టం కాజా అంటారా” ” లేదు ఇది కాకినాడ కాజా ” అని ప్రసిద్ది చెందుతుంది అన్నాడు కోటయ్య . భర్త ఉద్దేశ్యం అర్దమయ్యింది కాకినాడలో అమ్మడం మొదలు పెడతారన్నమాట అని అనుకుంది అనసూయ. భర్తను మురిపెంగా చూస్తూ “ఏమండి మీరు తయారు చేసిన ఈవంటకం వందేళ్ళపాటు ప్రపంచ ప్రసిద్ది చెందుతుంది “అంటూ భర్త కోటయ్య నుదిటికి పట్టిన చెమటను పైట చెంగుతో తుడిసింది అనసూయ.
1891 గాంధీ ఇంగ్లాండులో బారెట్ల పట్టాపుచ్చుకుని మూడేళ్ళ తరువాత తిరిగి భారతదేశంలో అడుగు పెట్టాడు. 1891 కాకినాడ కోటయ్య కాజా దుకాణం తెరవడానికి కాకినాడ మెయిన్ రోడ్డులో అడుగు పెట్టాడు మన కోటయ్య.
-టి.వి.గోవిందరావు
ఎవరి జీవితం ఎప్పుడు ఏ మలుపు తిరుగుతుందో చెప్పలేం.. కోటయ్య వివరాలు చాలా బాగున్నాయి మిత్రుడు గోవింద రావు గారికి అభినందనలు
-టి. వేదాంత సూరి