పర్యాటకులతో ఉన్న ఫెర్రీ పడవ ప్రమాదానికి గురై 13 మంది మృతి
ముంబయి (CLiC2NEWS): పర్యాటకులతో వెళుతున్న నీల్‌కమల్ అనే ఫెర్రీ పడవ ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో 13 మంది ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం. దాదాపు 100 మంది పర్యాటకులతో వెళుతున్న పడవను నేవీకి చెందిన బోటు ఢీకొట్టింది. ఈ విషయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్ అధికారికంగా ప్రకటించారు. మరణించిన వారిలో 10 మంది పర్యాటకులు ఉండగా.. మరో ముగ్గురు నేవీ సిబ్బంది ఉన్నారు. ఈ ఘటనలో 101మందిని కాపాడినట్లు సమాచారం. ఈ ప్రమాదంలో తీవ్ర గాయాలై న వారికి నేవీ ఆస్పత్రిలో చికిత్సనందిస్తున్నారు. మృతుల కుటుంబాలకు సిఎం ఎక్స్‌గ్రేషియా ప్రటించారు. ఒక్కొక్కరికి రూ.5లక్షలు చొప్పున పరిహారం ప్రకటించారు.
నేవీకి చెందిన స్పీడ్ బోటు ఇంజిన్ ట్రయల్స్ చేస్తున్న సందర్బంలో వేగంగా వచ్చి ఫెర్రీని ఢీకొట్టింది. దీంతో భారతీయ నౌకాదళం స్పందించింది. స్పీడ్ బోటు సాంకేతిక లోపం తలెత్తి, బోటు నియంత్రణ కోల్పోవడంతో ఈ ప్రమాదం జరిగినట్లు వెల్లడించింది. వెంటనే రెస్క్యూ సిబ్బంది బృందాలు భారీ ఆపరేషన్ చేపట్టాయి. 11 నేవీ పడవలతో సహా తీర ప్రాంత దళాలకు చెందిన మూడు పడవలు, నాలుగు హెలికాప్టర్లు ఈ ఆపరేషన్‌లో పాల్గొన్నాయి. చీకటి పడేవరకు మొత్తం 101 మందిని కాపాడినట్లు సమాచారం.