జీహెచ్ఎంసీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల

హైదరాబాద్ : గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల నగారా మోగింది. మంగళవారం రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసింది. మంగళవారం హైదరాబాద్‌లోని మసబ్ ట్యాంక్‌లో 10.30 గంటలకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పార్థసారధి షెడ్యూల్ విడుదల చేశారు. గ్రేటర్ పరిధిలోని 150 వార్డులకు ఎన్నికలు జరుగనుండగా.. బుధవారం నుంచి మూడు రోజుల పాటు ఈ నెల 20వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరించనున్నారు. 21న నామినేషన్ల పరిశీలన, అదే రోజు అభ్యర్థుల జాబితాను ప్రకటించనున్నారు. 24న ఉప సంహరణ కార్యక్రమం ఉంటుంది. అదే రోజు గుర్తులు కేటాయించనున్నట్లు తెలిపారు.
డిసెంబర్ 1న ఓటింగ్ నిర్వహించి, డిసెంబర్ 4 న కౌంటింగ్ చేపడుతామని తెలిపారు. అవసరమైన చోట్ల డిసెంబర్ 3న రీ పోలింగ్ నిర్వహిస్తామన్నారు. రేపటి నుంచి డివిజన్ల వారీగా నామినేషన్లు స్వీకరిస్తామని తెలిపారు.
డిసెంబర్ 6 లోగా ఎన్నికల ప్రక్రియ పూర్తి చేస్తామని అన్నారు. మొత్తం 14 రోజుల్లో ఎన్నికల ప్రక్రియ ముగుస్తుందని చెప్పారు. బ్యాలెట్ పద్ధతిలోనే జీహెచ్ఎంసీ ఎన్నికలు జరుగుతాయని పార్థసారథి పేర్కొన్నారు. జీహెచ్ఎంసీ చట్ట ప్రకారమే 150 వార్డులకు ఎన్నికలు నిర్వహిస్తామని అన్నారు.
ఎస్ఈసీ పార్థసారధి మీడియాతో మాట్లాడుతూ.. జీహెచ్ఎంసీ ఎన్నికలకు చాలా ప్రాధాన్యత ఉంది. 2016లో ఏ రిజర్వేషన్లు అమల్లో ఉన్నాయో.. అవే రిజర్వేషన్లు ఉంటాయి. ఈనెల 13న ఓటర్ల తుది జాబితా పూర్తైంది. ఫిబ్రవరి 10తో జీహెచ్ఎంసీ పదవీకాలం ముగియనుంది. ప్రతి డివిజన్‌కు ఒక రిటర్నింగ్ అధికారి ఉంటారు. బ్యాలెట్ పద్ధతిలోనే జీహెచ్ఎంసీ ఎన్నికలు నిర్వహిస్తాం. గతంలో ఏపీ ఈసీకి బ్యాలెట్ బాక్సులు ఇచ్చాం.. ఇప్పుడు అవి తెచ్చుకుంటాం. ఈనెల 20న పోలింగ్ బూత్‌ల తుది వివరాలు వెల్లడిస్తాం’అని పేర్కొన్నారు.
పాత రిజర్వేషన్లే ..
2016 జీహెచ్ఎంసీ ఎన్నికల్లో అమలైన రిజర్వేషన్లే ఇప్పుడూ కొనసాగిస్తామని ఎస్ఈసీ పార్థసారథి అన్నారు. జీహెచ్ఎంసీ రిజర్వేషన్ల కేటాయింపులు అనేది ప్రభుత్వ వ్యవహారమని చెప్పారు. అసెంబ్లీ ఓటర్ల జాబితా ఆధారంగానే గ్రేటర్ ఎన్నికలు నిర్వహిస్తామని వెల్లడించారు. జనవరి 1, 2020 నాటికి 18 ఏళ్లు పూర్తి చేసుకున్న వయోజనులు ఓటు వేసేందుకు అర్హులని తెలిపారు. బల్దియా పరిధిలో 52.09 శాతం పురుష, 47.90 శాతం మహిళా ఓటర్లున్నారని తెలిపారు. జీహెచ్ఎంసీ పరిధిలో 74 లక్షల 4 వేల మందికి పైగా ఓటర్లున్నారని వెల్లడించారు.
మరిన్ని వివరాలు
- జీహెచ్ఎంసీ పరిధిలో తక్షణమే అమల్లోకి వచ్చిన ఎన్నికల కోడ్
- డిసెంబర్ 1న ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్
- మధ్యాహ్నం 12 గంటలకల్లా బ్యాలెట్ పేపర్లు సెపరేటు
- మధ్యాహ్నం 3 గంటలకల్లా ఫలితాలు
- ఎస్సీ, బీసీ, ఎస్టీ అభ్యర్థులకు రూ.2500 నామినేషన్ డిపాజిట్
- ఇతర అభ్యర్థులకు రూ.5000 నామినేషన్ డిపాజిట్
- రిటర్నింగ్ అధికారి దగ్గరకు వచ్చే నామినేషన్లు దాఖలు చేయాలి
- 48 వేల మంది సిబ్బందితో ఎన్నికల నిర్వహణ
- తెలుగు రంగు బ్యాలెట్ పేపర్ వినియోగం
- మొత్తం 2,700 పోలింగ్ కేంద్రాలు
- 1439 సున్నితమైన పోలింగ్ కేంద్రాలు
- సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు 1,004
- అత్యంత సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు 257
జీహెచ్ఎంసీ వార్డు రిజర్వేషన్లు
- గ్రేటర్ మేయర్ పదవి జనరల్ మహిళకు రిజర్వ్
- బీసీ -50: (జనరల్ 25, మహిళలు 25)
- ఎస్సీ -10: (జనరల్ 5, మహిళలు 5)
- ఎస్టీ-2: (జనరల్ 1, మహిళ 1)
- జనరల్ -44
- జనరల్ మహిళ -44