గ్రేటర్ ఎన్నికలు: ఈసీ కీలక మార్గదర్శకాలు

హైదరాబాద్: దేశవ్యాప్తంగా కొవిడ్ కేసుల విజృంభిస్తున్నాయి. తెలంగాణలో అత్యధిక కేసులు ఇంకా హైదరాబాద్‌లోనే నమోదు అవుతున్నాయి.. మరోవైపు ఈ రోజు (మంగళవారం) జిహెచ్ ఎంసి ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. ఈ సమయంలో.. కోవిడ్ దృష్ట్యా ఎన్నికల సమయంలో పాటించాల్సిన మార్గదర్శకాలను విడుదల చేసింది తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం.. కేంద్ర వైద్యారోగ్య, హోం శాఖ నిబంధనలతో పాటు రాష్ట్ర ప్రభుత్వ నిబంధనలను పరిగణనలోకి తీసుకొని వీటిని తయారు చేసినట్లు వెల్లడించింది ఎన్నికల సంఘం.
ఎన్నికల సంఘం సూచనలు:
- ప్రతి ఒక్కరు ఫేస్ మాస్క్ తప్పకుండా పెట్టుకోవాలి.
- పోలింగ్ బూత్‌ల ద్వారాల వద్ద శానిటైజర్ అందుబాటులో ఉంటుంది.
- కోవిడ్ 19 కేంద్ర హోం శాఖ ఇచ్చిన నిబంధనల ప్రకారం భౌతిక దూరం పాటించాలి.
- భౌతిక దూరాన్ని పాటించటానికి వీలుగా ఎన్నికలకు సంబంధించినంత వరకు పెద్ద హాల్స్ ను ఉపయోగించుకోవాలి.
- కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా ఎన్నికల కార్యకలాపాల్లో ఉన్న వారితో పాటు భద్రతా సిబ్బందిని తరలించేందుకు వాహనాలను ఉపయోగించుకోవాలి.
- ఎన్నికల కార్యకలాపాల్లో ఉన్న అందరి వద్ద ఆరోగ్య సేతు యాప్ తప్పనిసరిగా ఉండాలి.
- ఎన్నికల ప్రక్రియలో కోవిడ్ నిబంధనలు మేర ఏర్పాట్లు, నివారణ చర్యలను పరిశీలించేందుకు జీహెఎంసీ స్థాయి, సర్కిల్ స్థాయి, వార్టు స్థాయిలో
- డల్ హెల్త్ ఆఫీసర్ నియమించాలి.
- పెద్ద హాళ్లలో వికేంద్రీకరణ పద్ధతిలో ఎన్నికల సిబ్బంది శిక్షణ ఇవ్వాలి. వర్చువల్ ట్రైనింగ్ ను కూడా ఉపయోగించుకోవచ్చు.
- ఎన్నికల అధికారులకు అందుబాటులో ఉండే విధంగా ట్రైనింగ్‌కు సంబంధించిన మెటీరియల్, వీడియో క్లిప్పులు, ఇతర డాక్యుమెంట్లను అధికారి పోర్టల్ లో అప్ లోడ్ చేయొచ్చు.
- ఎన్నికల సిబ్బందిలో ఎవరికైనా కోవిడ్ 19 లక్షణాలు కనబడినట్లైతే వారికి బదులుగా ఉపయోగించుకునేందుకు అవసరం మేర సిబ్బందిని రిటర్నింగ్ ఆఫీసర్లు, కమిషనర్ అందుబాటులో ఉంచుకోవాలి.
- ఆన్ లైన్ ద్వారా నామినేషన్ చేసుకునేందుకు అభ్యర్థులకు వీలు, రిటర్నింగ్ ఆఫీసర్ కు సమర్పించే ముందు దాని ప్రింట్ తీసుకొవచ్చు.
- అఫిడెవిట్‌ను కూడా ఆన్ లైన్ ద్వారా నింపుకోవచ్చు. దీనిని నామినేషన్ సమయంలో రిటర్నింగ్ ఆఫీసర్ కు సమర్పించాలి.
- ఆన్ లైన్ ద్వారా ఎన్నికల ఖర్చుకు సంబంధించి రిపోర్టును తయారు చేసుకోవచ్చు.. ఆన్ లైన్ లోనే సమర్పించవచ్చు.
- నామినేషన్ సమయంలో అభ్యర్థితో పాటు తోడుగా వచ్చే వారి సంఖ్య రెండుకు పరిమితం, వాహనాల సంఖ్య రెండుకు పరిమితం
- ఎన్నికల జరిగే ముందు పోలింగ్ స్టేషన్ ను తప్పకుండా శానిటైజేషన్ చేయాలి.
- కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా మార్కింగ్స్ చేయాలి.
- పోలింగ్ సిబ్బందికి మాస్క్, శానిటైజర్, ఫేస్ షీల్ట్ అందించాలి.
- పోస్టల్ బ్యాలెట్ దివ్యాంగులకు, 80 ఏళ్లు పైబడిన వారికి, నోటిఫైడ్ అత్యవసర సేవల్లో ఉన్న వారు ఉపయోగించుకోవచ్చు.
- ప్రచారం కూడా కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా చేసుకోవాలి.
- భద్రతా సిబ్బంది మినహాయిస్తే ఐదుగురి బృందం మాత్రమే ఇంటింటి ప్రచారం చేసుకోవచ్చు.
- ప్రచారం కాన్వాయ్ లో రెండు వాహనాల తరువాత కనీసం 100 మీటర్ల దూరం ఉండాలి.
- రెండు పార్టీల, అభ్యర్థుల రోడ్ షోలకు మధ్య కనీసం అర్ధగంట విరామం ఉండాలి.
- ప్రచార సమావేశాలు కోవిడ్ నిబంధనలకు లోబడి చేసుకోవాలి. దీనికి సంబంధించి ఎన్నికల అధికారులు చర్యలు తీసుకోవాలి.
- స్ట్రాంగ్ రూం శానిటైజేషన్ చేయాలి. ఇందులో భౌతిక దూరం పాటించాలి.
- ఒక కౌంటింగ్ హాల్ లో 10 కౌంటింగ్ టేబుల్లకు మించి ఉండకూడదు.
- కౌంటింగ్ ముందు బ్యాలెట్ బాక్స్ లను శానిటైజ్ చేయాలి.
- కౌంటింగ్ కు ముందు, తర్వాత కౌంటింగ్ సెంటర్లను డిస్ ఇన్ఫెక్ట్ చేయాలి.
- అవసరం అయితే పోస్టల్ బ్యాలెట్లను ప్రత్యేక హాల్స్ లలో కౌంటింగ్ చేయాలి